Don't Miss Me: Married Woman Falls To Death At Posh Kolkata Locality Family Members And Friends Asks For Justice - Sakshi
Sakshi News home page

చచ్చిపోతున్నా.. నన్ను మిస్సవకండి నాన్నా!

Published Fri, Mar 5 2021 3:14 PM | Last Updated on Sat, Mar 6 2021 8:25 AM

Married Woman Deceased In Kolkata Family Friends Asks For justice - Sakshi

కుటుంబ సభ్యులతో రషికా అగర్వాల్‌(ఫొటో కర్టెసీ: ఇండియా టుడే)

రషికా జైన్‌.. పశ్చిమ బెంగాల్‌ అమ్మాయి.. అందంగా ఉంటుంది. చదువులోనూ చురుకే. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించింది. ఆమె తండ్రి మహేంద్ర జైన్‌ వ్యాపారవేత్త. ట్రాన్స్‌పోర్ట్‌ బిజినెస్‌ ఉంది. రెండేళ్ల క్రితం సింగపూర్‌ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత, వ్యాపారంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండేది రిషికా. ఈ క్రమంలో ఆమెకు ఓ పెద్దింటి సంబంధం వచ్చింది. వరుడుదీ వ్యాపార కుటుంబమే. ఎన్నెన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి. సుసంపన్న అగర్వాల్‌ ఫ్యామిలీ.. సమాజంలో మంచి హోదా, పలుకుబడి, పేరు కూడా ఉంది. ఈ మ్యాచ్‌ కాదనేందుకు పెద్దగా కారణాలు కనిపించలేదు మహేంద్ర జైన్‌కు. దీంతో నరేశ్‌ అగర్వాల్‌ కుమారుడు కుశాల్‌ అగర్వాల్‌తో కూతురి పెళ్లి ఖాయం చేశాడు. భారీ కట్న కానుకలతో అత్తారింటికి పంపాడు. అలా రషికా జైన్‌.. రషికా అగర్వాల్‌గా మారింది. కోటి ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టింది. అయితే ఆమె సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లైన కొన్నాళ్లకే భర్త వ్యసనాల గురించి బయటపడింది.

డ్రగ్స్‌, మద్యానికి బానిసైన కుశాల్‌ తనకు నరకం చూపిస్తున్నాడంటూ తల్లిదండ్రుల ఎదుట గోడు వెళ్లబోసుకుంది. అంతేకాదు అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నట్లు తెలిపింది. పెళ్లికి ముందు ఎంతో మర్యాదస్తుడిగా కనిపించిన అల్లుడి నిజ స్వరూపం తెలిసి మహేంద్ర జైన్‌ షాకయ్యాడు. అయితే అతడిలో మార్పు వస్తుందని కూతురికి నచ్చజెప్పాడు గానీ, మనసులో ఆ బాధ అలాగే గూడు కట్టుకుపోయింది. దీంతో గతేడాది నవంబరులో ఆయన ఆరోగ్యం చెడిపోయింది. ఆస్పత్రిపాలయ్యారు. అంతకు ముందు భర్తతో గొడవ జరిగినప్పుడల్లా తరచుగా పుట్టింటికి వెళ్లే రషికా, తండ్రి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అక్కడికి వెళ్లడం మానేసింది. కానీ భర్త కుశాల్‌ ఆగడాలు శ్రుతి మించడంతో ఈ ఏడాది జనవరిలో తల్లిదండ్రుల వద్దకు వెళ్లి అక్కడే ఉంటానని, తిరిగి వచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.

కానీ ఆమె మామగారు వచ్చి బతిమిలాడే సరికి మళ్లీ అక్కడికి వెళ్లకతప్పలేదు. అలా ఫిబ్రవరి 13న భర్త దగ్గరకు వెళ్లింది రషికా. అంతా సవ్యంగా సాగుతుంది అని తల్లిండ్రులు భావిస్తున్న తరుణంలో రషికా అత్తగారు వాళ్లకు ఫోన్‌ చేశారు. మీ అమ్మాయి, మూడో అంతస్తు నుంచి దూ​కి చనిపోయిందని చెప్పింది. ఒక్కసారిగా లోకమంతా చీకటై పోయినట్లనిపించింది రషికా పేరెంట్స్‌కు. తాము విన్నది నిజం కాదని, తమ కూతురు అంతటి పిరికికాదంటూ బోరున విలపించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అనుమానాస్పద స్థితిలో వారి గారాలపట్టి మృత్యువాత పడింది. కూతురి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయినప్పటికీ మహేంద్ర జైన్‌ దంపతులు మనసు దిటువ చేసుకున్నారు. తమ బిడ్డ తరఫున న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు.

అత్తారింటికి వెళ్లిన మూడు రోజులకే
ఈ క్రమంలో భర్త వేధింపులు భరించలేకే తమ కూతురు చనిపోయిందని ఫిబ్రవరి 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘రషికా అత్తారింటికి తిరిగి వెళ్లిన మూడు రోజుల తర్వాత చనిపోయింది. తన అంత్యక్రియల్లో వియ్యంకుల కుటుంబం కూడా పాల్గొంది. కానీ మా అల్లుడి సోదరుడు మమ్మల్ని బెదిరించారు. పోలీస్‌ కంప్లెంట్‌ ఎందుకు ఇచ్చారని, ఇందుకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని భయపెట్టారు. కానీ మేం వెనకడుగు వేయం. చనిపోయే ముందు నాకు, నా కుమారుడు రిషవ్‌, కుశాల్‌, నరేశ్‌కు ఓ వాట్సాప్‌ మెసేజ్‌ పంపింది. ‘‘నాన్నా ఇక్కడ బతకడానికి పెద్ద పోరాటమే చేస్తున్నా. కానీ ఈ చిత్రహింసలు భరించడం నా వల్ల కాదు. ఇంతకంటే వెళ్లిపోవడమే(మృతి చెందడమే) నయం. నన్ను మిస్సవ్వకండి’’ అని మెసేజ్‌ పెట్టింది. అదే రోజు రాత్రి తను బిల్డింగ్‌ పై నుంచి దూకిందని వియ్యంకులు చెప్పారు.

నాకైతే వాళ్లు చెప్పింది నమ్మబుద్ధికాలేదు. పెళ్లి సమయంలో రూ. 7 కోట్లు, ఇతర కానుకలు ఇచ్చిన తర్వాత కూడా అదనపు కట్నం కోసం వేధించారు. కాబట్టి వాళ్లే తనను చంపేసి ఉంటారేమో అనిపించింది. ఏదేమైనా మా కూతురి మరణానికి కారణమైన వాళ్లకు శిక్ష పడే వరకు పోరాటం ఆపం’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. కాగా కోల్‌కతాను ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించారు. అయితే, ఇంతవరకు అగర్వాల్‌ కుటుంబ సభ్యుల్లో ఒక్కరిని కూడా ప్రశ్నించలేదు సరికదా, వారి ఆచూకీ తెలియడం లేదని మీడియాతో చెబుతున్నారు.

కానీ మహేంద్ర జైన్‌ మాత్రం అగర్వాల్స్‌ వాళ్లింట్లోనే ఉండి నాటకాలు ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రషికా కుటుంబ సభ్యులు, స్నేహితులు #JusticeForRashika పేరిట సోషల్‌ మీడియాలో ఓ క్యాంపెయిన్‌ చేపట్టారు. రషికా మరణానికి కారణాలేమిటి అంటూ ప్రశ్నలు సంధిస్తూ అగర్వాల్‌ కుటుంబ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరకట్న పిశాచి గురించి నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

చదవండి: ప్రియుడితో వెళ్లిన వివాహిత.. హతమార్చిన తండ్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement