అనంతపురంలోని మార్గదర్శి కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న సీఐడీ అధికారులు
సాక్షి, అమరావతి: భారీగా నల్లధనం మార్పిడికి మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాలు కేంద్ర స్థానంగా మారినట్లు సీఐడీ గుర్తించింది. రశీదుల రూపంలో బ్రాంచీ కార్యాలయాల నుంచి ప్రధాన కార్యాలయానికి చేరిన భారీ నిధుల వెనుక మనీ లాండరింగ్ ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు చోట్ల మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ అధికారుల బృందం బుధవారం సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను సేకరించింది.
చందాదారుల నిధుల మళ్లింపు, అక్రమ పెట్టుబడులు, అక్రమ డిపాజిట్ల సేకరణ తదితర అభియోగాలతో ఏ–1గా మార్గదర్శి చిట్‌ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజా కిరణ్, ఏ–3గా బ్రాంచీ మేనేజర్లపై కేసులు నమోదైన విషయం విదితమే. ఈ కేసులో ఇటీవల రామోజీరావు, శైలజను విచారించడంతోపాటు హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రధాన కార్యాలయంలో సోదాలు చేపట్టి పలు అవకతవకలను గుర్తించారు.
ఆ సోదాలకు కొనసాగింపుగా తాజాగా 7 చోట్ల మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచీ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. విశాఖ (సీతంపేట), రాజమహేంద్రవరం (శ్యామల థియేటర్ బ్రాంచి), ఏలూరు (నర్సింగరావుపేట బ్రాంచి), విజయవాడ (లబ్బిపేట బ్రాంచి), గుంటూరు (అరండల్ పేట), నరసరావుపేట (సత్తెనపల్లి రోడ్ బ్రాంచి), అనంతపురం (లక్ష్మీనగర్ బ్రాంచి)లోని మార్గదర్శి కార్యాలయాల్లో ఉదయం 10కి మొదలైన సోదాలు అర్ధరాత్రి దాటిన తరువాత కూడా కొనసాగుతున్నాయి.
చట్ట ప్రకారం నిర్వహించాల్సిన 12 రికార్డులకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు సీఐడీ అధికారుల సోదాల సందర్భంగా గుర్తించినట్లు సమాచారం. ఏటా దాదాపు రూ.600 కోట్ల వరకు నగదు రూపంలో మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి అక్రమంగా బదిలీ చేసినట్లు గతంలో గుర్తించారు. ఆ నిధులను బ్రాంచి కార్యాలయాల నుంచి ఏ తేదీల్లో అక్రమంగా తరలించారనే అంశాలపై తాజా సోదాల్లో ప్రధానంగా దృష్టి సారించారు.
ఏటా మార్చి 31న వచ్చినట్లు చూపిస్తున్న దాదాపు రూ.500 కోట్లకు పైగా చెక్కులకు సంబంధించిన వివరాలను సంబంధిత బ్రాంచి కార్యాలయాల రికార్డుల్లో నమోదు చేస్తున్నారా? అనే అంశాన్ని పరిశీలించారు. ఇక రశీదుల రూపంలో డిపాజిట్లు వివిధ బ్రాంచి కార్యాలయాల నుంచి ప్రధాన కార్యాలయానికి వచ్చినట్లు మార్గదర్శి చూపిస్తోంది.
అయితే అందుకు సంబంధించిన రికార్డులు బ్రాంచి కార్యాలయాల్లో లేవని వెల్లడైనట్లు తెలుస్తోంది. రశీదు రూపంలో సేకరించిన అక్రమ డిపాజిట్ల నిధులనే రామోజీరావు తమ కుటుంబ సంస్థల్లోకి మళ్లించినట్లు సీఐడీ ఇప్పటికే గుర్తించింది. ప్రధాన కార్యాలయం, బ్రాంచీల రికార్డులకు ఎక్కడా పొంతన లేదని వెల్లడైంది. తాజా సోదాల్లో కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. సీఐడీ సోదాలు మరికొద్ది రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment