సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతమైంది. చిట్‌ఫండ్స్ ముసుగులో సాగిన నల్లధనం దందాపై దర్యాప్తు సంస్థ దృష్టి సారించింది. రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన అక్రమ డిపాజిట్ల వివరాలను వెలికి తీసేందుకు సిద్ధమైంది. మార్గదర్శిలో ఇప్పటికే మూసి వేసిన 23 చిట్ గ్రూపులతోపాటు మరికొన్ని గ్రూపుల మూసివేతకు చర్యలు చేపట్టింది. ఆ చిట్టీల నిర్వహణను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
రూ.కోటికిపైగా డిపాజిట్‌దారులకు నోటీసులు
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో రూ.కోటి అంతకుమించి డిపాజిట్లు చేసినవారికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. డిపాజిట్ల ముసుగులో నల్లధనం వ్యవహారాలను వెలికి తీసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం చిట్‌ఫండ్ సంస్థలు డిపాజిట్లను వసూలు చేయకూడదు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ మాత్రం యథేచ్ఛగా అక్రమ డిపాజిట్లు వసూలు చేస్తున్నట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు వేర్వేరుగా నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైంది. అక్రమ డిపాజిట్లకు సంబంధించి పూర్తి వివరాలను మార్గదర్శి చిట్‌ఫండ్స్ వెల్లడించలేదు. రశీదుల పేరిట భారీ ఎత్తున నల్లధనం దందా సాగిస్తున్నట్లు సీఐడీ ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.
ఆదాయ వివరాల పరిశీలన..
రాష్ట్రవ్యాప్తంగా 37 మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో రశీదుల పేరిట డిపాజిట్ చేసిన వారి వివరాలను సీఐడీ సేకరించింది. డిపాజిట్‌దారుల వృత్తి, వ్యాపారాలు, ఆదాయ మార్గాలు, ఇతర వివరాలతో సీఐడీ అధికారులు ఇప్పటికే నివేదిక రూపొందించారు. మొదటి దశలో రూ.కోటి అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసినవారికి నోటీసులు జారీ చేశారు. డిపాజిట్ చేసిన ఆ మొత్తాన్ని ఎలాంటి ఆదాయ మార్గాల ద్వారా సేకరించారు? మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోనే ఎందుకు డిపాజిట్ చేశారు? తదితర వివరాలను వెల్లడించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
నిర్ణీత గడువులోగా దర్యాప్తు సంస్థకు ఈ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. డిపాజిట్‌దారులు లిఖితపూర్వకంగా తెలిపే వివరాలను సీఐడీ అధికారులు మరోసారి క్షుణ్నంగా పరిశీలించి వాస్తవికతను నిగ్గు తేలుస్తారు. ఆర్బీఐ, కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు నిబంధనలను ఎందుకు పాటించలేదు? అనే కోణాల్లో విచారణను వేగవంతం చేయనున్నారు. తద్వారా నల్లధనం వ్యవహారాలపై ఒక నిర్ధారణకు వస్తారు. అనంతరం తదుపరి చర్యలు చేపడతారు.
మూసివేసిన చిట్టీల నిర్వహణకు ప్రత్యేక అధికారి!
కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించినందున మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థకు చెందిన 23 చిట్టీ గ్రూపులను మూసివేయాలని స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే ఆదేశించింది. ఆ మేరకు చిట్టీ గ్రూపుల మూసివేత దాదాపు పూర్తయ్యింది. మరిన్ని గ్రూపులను మూసివేసే దిశగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఈమేరకు ఇప్పటికే గుర్తించిన అక్రమాలతో నివేదికను రూపొందిస్తున్నారు.
మూసివేసిన చిట్టీల నిర్వహణ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక అధీకృత అధికారిని నియమించడానికి సన్నద్ధమవుతున్నారు. మూసివేసిన చిట్టీల గ్రూపుల్లోని చందాదారులు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లకు చందాలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చిట్టీ పాట పాడిన చందాదారులు మిగిలిన వాయిదాలను చెల్లించాలి. మూసివేసిన చిట్టీ గ్రూపుల చందాదారులకు వారి మొత్తాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియ పర్యవేక్షణకు అధీకృత అధికారిని నియమిస్తూ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment