కాకిలేరులో భర్త దాడి చేయడంతో గాయపడిన ఉపాధ్యాయురాలు గుత్తుల నాగలక్ష్మి
ఇరగవరం: ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న మహిళపై ఆమె భర్త హత్యాయత్నం చేసిన ఘటన ఇరగవరం మండలం కాకిలేరు గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్సై జానా సతీష్ కథనం ప్రకారం నారాయణపురం గ్రామానికి చెందిన గుత్తుల నాగలక్ష్మికి జంగారెడ్డిగూడెం మండలం వేగవరానికి చెందిన కడలి రామ దుర్గాప్రసాద్‌కు 2016లో పెళ్లయింది. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. కొంత కాలంగా భార్యాభర్తలు గొడవలు పడుతున్నారు. ఉపాధ్యాయురాలైన నాగలక్ష్మికి గతనెల 16న కాకిలేరు శివారు సింగోడియన్ పేటలోని ఎంపీపీ పాఠశాలకు బదిలీ అయింది. శుక్రవారం మధ్యాహ్నం ఆమె భర్త రామదుర్గా ప్రసాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటాచార్యులు వద్దకు వచ్చి నాగలక్ష్మి టీచర్‌ను కలవాలని అడిగాడు.
ఆమె క్లాస్‌రూమ్‌లో ఉందని చెప్పడంతో క్లాస్ రూమ్‌కు వెళ్లి విద్యార్థులు చూస్తుండగానే జుట్టు పట్టుకుని నేల్ కట్టర్‌లోని చాకుతో వీపుపై, పక్కటెముకలపై దాడి చేశాడు. విద్యార్థులు గట్టిగా అరవడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అక్కడకు చేరుకుని వెంటనే ఎంఈఓ ఎస్.శ్రీనివాసరావు ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సహకారంతో నాగలక్ష్మిని పెనుగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందించిన తరువాత తణుకు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తణుకులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రామ దుర్గాప్రసాద్‌పై జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌లో వరకట్నం వేధింపుల కేసు ఉందని, ప్రస్తుత ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment