సాక్షి హైదరాబాద్: నగరానికి చెందిన సయ్యద్ ఆసిఫ్ జిబ్రాన్, పి.తరుణ్ కొన్నేళ్ల క్రితం డ్రగ్స్‌కు అలవాటుపడ్డారు. కాలక్రమంలో వినియోగించడంతో పాటు అందుకు అవసరమైన డబ్బు కోసం విక్రయించడమూ ప్రారంభించారు.
- గౌలిగూడ వాసి అశుతోష్ కొన్నేళ్లుగా మియాపూర్‌కు చెందిన లక్కీ నుంచి గంజాయి, హష్ ఆయిల్ ఖరీదు చేసి వినియోగిస్తున్నాడు. ఆపై స్నేహితులు, పరిచయస్తులకు వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడం మొదలెట్టాడు.
- వీరితో పాటు వీరి నుంచి డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగిస్తున్న వారినీ గత గురు–శుక్రవారాల్లో హెదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు పట్టుకున్నారు. కేవలం వీళ్లే కాదు.. కొన్నాళ్లుగా వెలుగులోకి వస్తున్న ఉదంతాలను పరిశీలిస్తే... సరదా కోసం డ్రగ్స్ వాడటం మొదలెట్టిన వారిలో 95 శాతం మంది వాటికి బానిసలుగా మారుతున్నారని, ఇలాంటి వినియోగదారుల్లో 40 శాతం విక్రేతల అవతారం ఎత్తుతున్నారని పోలీసులు గుర్తించారు.
నిఘాతో పాటు పెరుగుతున్న రేటు...
రాజధానికి గంజాయితో పాటు దాని సంబంధిత పదార్థమైన హష్ ఆయిల్ విశాఖ, అదిలాబాద్ ఏజెన్సీల నుంచి వచ్చి చేరుతోంది. హెరాయిన్, కొకైన్, ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్ వంటి మాదకద్రవ్యాలు గోవాతో పాటు ఇతర మెట్రోల నుంచి వచ్చేవి. అయితే పోలీసులు, ఎక్సైజ్ అధికారుల నిఘా పెరగడంతో మాకద్రవ్యాల దందా డార్క్ నెట్ ద్వారా జరుగుతోంది. వీటి క్రయవిక్రయాలపై నిçఘా ఏస్థాయిలో ఉంటే... వాటి రేట్లు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ కారణంగానే వీటికి బానిసలుగా మారిన యువత ఆ ‘ఖర్చు’ల కోసం విక్రేతలుగా మారుతున్నారు. కాస్త ఎక్కువ మొత్తంలో వాటిని తెప్పించి స్నేహితులు, పరిచయస్తులకు విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ ధోరణి ఎక్కువైందని హెచ్–న్యూ అధికారులు చెప్తున్నారు.
వారి కంటే వీరికే ఎక్కువ శిక్షలు...
డ్రగ్స్, గంజాయి సంబంధిత కేసులను ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదు చేస్తారు. న్యాయస్థానిల్లో నిందితులు దోషులుగా నిరూపితమైనప్పుడు ఇందులోని సెక్షన్ల ప్రకారమే శిక్షలు పడతాయి. ఈ చట్ట ప్రకారం వినియోగదారుల కంటే విక్రేతలకు ఎక్కువ శిక్షలు ఉంటాయి. ఏ నిందితుడు వినియోగదారుడు? ఎవరు విక్రేత అనేది అరెస్టు సమయంలో వారి వద్ద లభించిన డ్రగ్, గంజాయి పరిమాణంతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి నిర్థారిస్తారు. ప్రొఫెషనల్ డ్రగ్ పెడ్లర్లు కాకపోయినా... ఖర్చుల కోసం ఈ దందా చేసినా అదే స్థాయిలో శిక్ష అనుభవించాల్సి వస్తుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసలైన వాళ్లే పెడ్లర్లుగా మారుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవన్నీ డ్రగ్స్ బానిసల లక్షణాలు:
నగరంలోని డ్రగ్స్ వినియోగదారులు, విక్రేతల్లో అనేక మందిని హెచ్–న్యూ పట్టుకుంది. వీరిని పరిశీలించడంతో పాటు విచారించిన నేపథ్యంలో అనేక సారూప్యతలు ఉన్న లక్షణాలను గుర్తించింది. ఇవి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలని, వీటిలో ఏవైనా వారి పిల్లల్లో కనిపిస్తే అప్రమత్తం కావాలని సూచించింది.
- మాదకద్రవ్యాలతో పాటు గంజాయి, హష్ ఆయిల్ వంటి వాటికి బానిసలుగా మారిన యువతలో అనేక మంది తమ ఒంటిపై టాటూస్ ఎక్కు వ సంఖ్యలో వేయించుకుంటున్నారు. వీటిలోనూ పుర్రెలు, కొన్ని రకాలైన పూలు ఉంటున్నాయి.
- డ్రగ్స్ వినియోగదారులు వినే సంగీతం కూడా అసాధారణంగా ఉంటోంది. సైకొడెలిక్‌గా పిలిచే చిత్రమైన మ్యూజిక్‌ను వింటుంటారు. టెక్నో, ట్రాన్స్ మ్యూజిక్స్‌గా పిలిచే వీటిలో లిరిక్స్ కంటే మ్యూజిక్కే ఎక్కువగా ఉంటుంది. ఇది వింటూ మత్తులో జోగుతుంటారు.
- వీరిని ఎదైనా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పే విధానం సుదీర్ఘంగా ఉంటుంది. చిత్రమైన డిజైన్లతో కూడిన దుస్తులు ధరించడం, విభిన్నమైన హెయిల్ స్టైల్స్ కలిగి ఉండటం కూడా బానిసల లక్షణాలు. వీళ్లు ఎక్కువగా టీషర్టులు, చిత్రమైన షర్టులు ధరిస్తూ ఉంటారు.
- డ్రగ్స్‌కు బానిసలుగా మారిన వాళ్లు సాధారణంగా ఒక్కరుగా వాటిని తీసుకోరు. ఎక్కువగా గ్రూప్ పార్టీలు నిర్వహిస్తూ, వాటికి హాజరవుతూ ఉంటారు. తరచుగా గోవాకు వెళ్లివస్తున్న యువత విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని హెచ్–న్యూ అధికారులు సూచిస్తున్నారు.
(చదవండి: కారు కొనివ్వలేదని యాసిడ్ తాగాడు.. )
Comments
Please login to add a commentAdd a comment