జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో నిర్మించిన షెడ్‌లో ఏసీ బిగించిన దృశ్యం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: బాధ్యత గల పోలీసు ఉద్యోగంలో ఉంటూ బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి అధికార దుర్వినియోగానికి పాల్పడిన సీఐ నాగేశ్వరనాయక్ అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సీఐ నాయక్ తమకు అన్యాయం చేశారంటూ ఆయన బాధితులు జిల్లా పోలీసు అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు గురువారం జంగారెడ్డిగూడెం పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ కరీముల్లా షరీఫ్ నేతృత్యంలోని అధికారుల బృందం తనిఖీ నిర్వహించింది. జంగారెడ్డిగూడెం పోలీసుస్టేషన్ పరిధిలోని ఇసుక అక్రమార్కులకు పెద్దఎత్తున లంచాలు తీసుకుని సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో ఎస్‌ఈబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిగిన విచారణపై ‘సాక్షి’ రాసిన కథనాలతో ఉన్నతాధికారులు తప్పనిసరి పరిస్థితిలో జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వర్ నాయక్, ఎస్సై గంగాధర్‌ను వీఆర్‌లో పెట్టారు. ఈ మేరకు ఏలూరు రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే విచారణ చేస్తున్న సందర్భంలో సీఐ అవినీతి బాగోతాలు వెలుగుచూస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాలో నిందితుడిగా ఉన్న వ్యక్తి కారును ఇప్పటికీ సీఐ వినియోగిస్తున్నట్లుగా విచారణాధికారులు గుర్తించారు.
సీఐపై మరికొన్ని ఆరోపణలు ఇవీ..
ఉన్నతాధికారుల అనుమతులు ఏమాత్రం లేకుండా జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో ఒక షెడ్ నిర్మాణంతోపాటు అనధికారికంగా సీఐ కార్యాలయంలో ఏసీలు పెట్టించడం వంటి నిబంధనలకు విరుద్ధమైన చర్యలు చేపట్టినట్లు సీఐపై ఫిర్యాదులు వచ్చాయి.
►భీమడోలు సీఐగా పనిచేసే సమయంలో సీఐ నాయక్ తనను అక్రమంగా నిర్బంధించి, చేపల వ్యాపారస్తులకు చెందిన కేసులో ఇరికిస్తానంటూ బెదిరించి తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.40 లక్షలను అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరుల ఖాతాల్లోకి బదిలీ చేయించారని, సీఐ నాయక్‌పై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ ఏలూరుకు చెందిన చేపల వ్యాపారి మామిడి వెంకట కృష్ణ అనే వ్యక్తి గురువారం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.
►సీఐ నాయక్ చింతలపూడి ఇన్‌చార్జ్ సీఐగా ఉంటూ చింతలపూడి ప్రాంతంలో మద్యం దుకాణంలో జరిగిన దొంగతనం కేసులో నిందితులను అరెస్ట్ చేసి, వారినే ద్వారకాతిరుమలలో జరిగిన మద్యం దొంగతనం కేసులో కూడా నిందితులుగా పెట్టి, అసలైన నిందితులను వదిలేశారనే విషయం తాజాగా వెలుగులోకి రావడంతో అధికారులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు.
►జిల్లాలోని చింతలపూడి పోలీసుస్టేషన్‌లో నమోదైన ఓ కేసులో నిందితురాలిగా ఉన్న జిల్లా అధికారిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు సదరు ఉద్యోగి నుంచి సీఐ పెద్దఎత్తున వసూళ్లు చేశారని గుర్తించి ఆ దిశగానూ విచారణ మొదలుపెట్టారు.
మద్యం బాటిళ్ల మాయంపై క్రిమినల్ చర్యలు : ఎస్‌ఈబీ ఏఎస్పీ కరీముల్లా షరీఫ్
జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో పలు కేసుల్లో సీజ్‌చేసిన మద్యం బాటిళ్లు దురి్వనియోగం జరిగినట్లు గుర్తించామని దీనిపై సంబంధిత ఎస్‌హెచ్‌ఓపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు ఎస్‌ఈబీ అడిషనల్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ వెల్లడించారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. నాలుగు ఎన్‌డీపీ మద్యం కేసుల్లో బాటిళ్లను తారుమారు చేశారని పేర్కొన్నారు. మొత్తం 24 బాటిళ్లు తారుమారయ్యాయని వెల్లడించారు. అంతేగాక కేసులకు సంబంధం లేని అనధికార మద్యం బాటిళ్లు 51 క్వార్టర్ బాటిళ్లను పోలీస్‌స్టేషన్‌లో గుర్తించామన్నారు. జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించి మద్యం బాటిళ్లను తారుమారు చేసినట్లు, అక్రమాలు జరిగినట్లు నిర్ధారించినట్లు చెప్పారు. ఈ మద్యం కేసులు నమోదు జరిగిన సమయంలో ఉన్న ఎస్‌హెచ్‌ఓపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రస్తుత ఎస్‌హెచ్‌ఓను షరీఫ్ ఆదేశించారు. అంతేగాక అప్పటి ఎస్‌హెచ్‌ఓపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులను నివేదించినట్లు కరీముల్లా షరీఫ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment