![Ragging at Warangal Kakatiya Medical College - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/17/waramgal.jpg.webp?itok=GPadR2TA)
ఎంజీఎం: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ)ను ర్యాగింగ్ భూతం వెంటాడుతోంది. ఈ కళాశాలలో పీజీ వైద్యవిద్య చదువుతున్న ప్రీతి మృతి చెందిన విషయాన్ని ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న క్రమంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కేఎంసీలో రాజస్తాన్‌కు చెందిన మనోహర్ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 14న కళాశాల లైబ్రరీలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు చదువుకుని హాస్టల్ గదికి బయలుదేరాడు.
ఈ క్రమంలో ఓ సీనియర్ విద్యార్థి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న 15 మంది విద్యార్థుల కళ్లు మనోహర్‌పై పడ్డాయి. అతడిని దగ్గరికి పిలిచి మద్యం తాగించి, నృత్యాలు చేయించారు. సీనియర్లు ఎంతకీ వదలకుండా వేధిస్తుండగా ఎదురుతిరిగాడు. దీంతో అతడిని వారు దారుణంగా చితకబాదారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థి ఈ నెల 15న తల్లిదండ్రుల సహాయంతో ప్రిన్సిపాల్‌కు, మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్
ర్యాగింగ్ ఘటనలో గాయపడ్డ మనోహర్‌ను వెంటనే ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చారు. ర్యాగింగ్ విషయాన్ని ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ డీఎంఈకి వివరించగా కళాశాల అంతర్గత కమిటీతో విచారణ చేపట్టారు. 10 మంది విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు విచారణలో నిర్ధారించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సదరు విద్యార్థులను సంవత్సరంపాటు సస్పెండ్ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కేఎంసీ అధికారులపై ఒత్తిళ్లు మొదలైనట్లు తెలుస్తోంది. ఘటనపై అంతర్గత విచారణ చేస్తున్నామని, ర్యాగింగ్ జరిగినట్లు రుజువైతే ఆ విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment