సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ వ్యవహారాల కేసులో ఏ–1గా ఉన్న సంస్థ చైర్మన్ చెరుకూరి రామోజీరావు సీఐడీ విచారణను తప్పించుకునేందుకు ఆడిన డ్రామాలు ఫలించలేదు. విచారించాల్సింది తనను కాదని, మార్గదర్శిలో కిందిస్థాయి సిబ్బందినంటూ తప్పించుకునేందుకు ఆయన వేసిన ఎత్తుగడలు పారలేదు. తన ఆరోగ్యం బాగా లేదని రామోజీరావు చెబుతున్నవి సాకులేనని ఆయన వ్యక్తిగత వైద్యుడే పరోక్షంగా సమ్మతించడంతో విచారణకు అంగీకరించక తప్పలేదు.
చిట్‌ఫండ్ చట్టం, రిజర్వ్‌బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డ రామోజీరావు సీఐడీ అధికారులు రామోజీరావును హైదరాబాద్‌లో సోమవారం దాదాపు 8 గంటలపాటు విచారించారు. విచారణ ప్రక్రియను పూర్తిగా ఆడియో, వీడియో రికార్డింగ్ చేశారు. కేంద్ర చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా భారీగా నిధుల మళ్లింపు, రిజర్వ్ బ్యాంకు నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమ డిపాజిట్ల సేకరణపై ఆధారాలతో విచారించారు.
ఈ కేసులో ఏ–2గా ఉన్న రామోజీరావు కోడలు, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజను ఈ నెల 6న సీఐడీ అధికారులు విచారించనున్నారు. అనంతరం కేసు దర్యాప్తులో పురోగతిని సమీక్షించి రామోజీరావు, శైలజను ఆంధ్రప్రదేశ్‌కు పిలిచి మరోసారి విచారించాలని సీఐడీ భావిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
రామోజీరావును విచారించిన అనంతరం బయటకు వస్తున్న అధికారులు
తప్పించుకునేందుకు చివరిదాకా యత్నం..
మార్గదర్శి అక్రమ వ్యవహారాల కేసులో సీఐడీ విచారణను తప్పించుకునేందుకు రామోజీరావు చివరి వరకూ ప్రయత్నించారు. రామోజీరావు, శైలజ హైదరాబాద్‌లోనే వారి నివాసంలోగానీ కార్యాలయంలోగానీ విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. నాలుగు తేదీలు సూచించి వారికి అనువైన రోజు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.
నిబంధనల మేరకు కేసు దర్యాప్తులో భాగంగా విచారిస్తామని స్పష్టం చేశారు. అయితే విచారణను తప్పించుకునేందుకు రామోజీరావు కాలయాపన చేశారు. చివరికి మార్చి 3న రామోజీ ఫిల్మ్‌సిటీలోని తన కార్యాలయంలో విచారణకు హాజరవుతానని సీఐడీకి తొలుత సమాచారం ఇచ్చారు. తీరా సోమవారం రోజు ఫిల్మ్‌సిటీలో కాకుండా జూబ్లీహిల్స్‌లోని తన కోడలు శైలజ కిరణ్ నివాసంలో విచారణకు హాజరవుతానని పేర్కొనగా అందుకు సీఐడీ అధికారులు సమ్మతించారు.
ఈ మేరకు సీఐడీ ఎస్పీ అమిత్ బర్దార్, విచారణాధికారి రవికుమార్‌తోపాటు అధికారుల బృందం జూబ్లీహిల్స్‌లోని శైలజ నివాసానికి ఉదయం 10.30 గంటలకు చేరుకుంది. సీఐడీ అధికారులు రావడమే ఆలస్యం తన ఆరోగ్యం సరిగా లేనందున విచారణకు సహకరించలేనని రామోజీ పేర్కొన్నారు. అనారోగ్యానికి కారణాలు, నివేదికలు అందచేసి విచారణకు హాజరు కాలేరని ధృవీకరించాలని రామోజీరావు వ్యక్తిగత వైద్యుడిని సీఐడీ అధికారులు కోరారు.
దీంతో రామోజీని విచారించవచ్చని, మంచంపై పడుకుని సమాధానాలు ఇస్తారని ఆయన వైద్యుడు చెప్పడంతో అందుకు సీఐడీ అధికారులు సమ్మతించారు. ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, కేసును సక్రమంగా విచారించడమే తమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఇక తప్పదని స్పష్టం కావడంతో సీఐడీ అధికారుల విచారణకు రామోజీ సమ్మతించారు.
ఆడియో...వీడియో రికార్డింగ్
విచారణ సందర్భంగా సీఐడీ అధికారులు నిబంధనలను కచ్చితంగా పాటించారు. ఈ ప్రక్రియ మొత్తం రికార్డింగ్ చేశారు. రామోజీ పడుకున్న మంచం సమీపంలోనే వేర్వేరు కోణాల్లో రెండు కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆయనకు కాస్త దూరంగానే సీఐడీ అధికారులు కూర్చున్నారు.
విచారణ సందర్భంగా రామోజీరావు చెప్పిన సమాధానాలు, ఆయన హావభావాలు అన్నీ రికార్డ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సుదీర్ఘ విచారణ సందర్భంగా సీఐడీ అధికారుల బృందం అక్కడ కనీసం మంచినీళ్లు కూడా తాగలేదు. తమకు కావల్సిన ఆహారం, మంచినీళ్లు అంతా బయట నుంచే తెచ్చుకున్నారు.
సహకరించని రామోజీ
సీఐడీ అధికారులు విచారణ మొదలు పెట్టిన తరువాత రామోజీరావు సమాధానాలు చెప్పేందుకు చాలాసేపు ససేమిరా అన్నారు. సీఐడీ పరిధినే ప్రశ్నిస్తూ తనను అసలు విచారించడానికే వీల్లేదన్నట్టుగా వ్యవహరించడం గమనార్హం. తాను విచారణ సంస్థలకు అతీతమన్నట్టు మొండిగా వ్యవహరించారు. దీంతో చట్ట నిబంధనలను తెలియచేస్తూ సీఐడీ అధికారులు విచారణ ప్రక్రియ కొనసాగించారు.
చిట్‌ఫండ్స్‌లో అక్రమ వ్యవహారాలన్నింటికీ తమ బ్రాంచి మేనేజర్లు(ఫోర్‌మెన్), అకౌంటెంట్లదే బాధ్యతని, తనకు సంబంధం లేదని తప్పించుకునేందుకు రామోజీరావు ప్రయత్నించారు. బ్రాంచి కార్యాలయాల్లోనే అన్ని వ్యవహారాలు సాగినందున వారినే ప్రశ్నించాలని మొండికేసినట్లు తెలుస్తోంది.
బ్రాంచి మేనేజర్లకు రూ.500కు మించి చెక్‌పవర్ లేనప్పుడు భారీగా నిధుల బదిలీపై వారిని మాత్రమే ఎలా బాధ్యులను చేస్తామని సీఐడీ అధికారులు ఎదురు ప్రశ్నించడంతో రామోజీరావు మౌనం వహించారు. బ్రాంచిల నుంచి నిధులన్నీ హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయానికి తరలింపుపై కూడా తనకు సంబంధం లేదని రామోజీ వాదించారు.
మరి చెక్ పవర్ మార్గదర్శి ఎండీ శైలజ, ప్రధాన కార్యాలయంలోని మరో 10 మంది వద్ద ఎందుకు ఉందని విచారణ అధికారులు ప్రశ్నించడంతో రామోజీ సమాధానం చెప్పలేకపోయారు. చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, షేర్‌మార్కెట్లో పెట్టుబడుల ద్వారా ఆర్జించిన ఆదాయం అంతా చైర్మన్, ఎండీలుగా వారే ప్రయోజనం పొందుతున్నప్పుడు కేవలం జీతాలకు పనిచేసే మేనేజర్లు ఎలా బాధ్యులవుతారని సీఐడీ అధికారులు ప్రశ్నించారు.
నిధులు మళ్లింపు, అక్రమ డిపాజిట్లపై..
విచారణలో సీఐడీ అధికారులు కీలక విషయాలను రాబట్టినట్టు సమాచారం. ప్రధానంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ నిధులు అక్రమంగా బదిలీ, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ, రికార్డుల నిర్వహణలో అవకతవకలపై ప్రశ్నించినట్లు సమాచారం.
మార్గదర్శి కార్యాలయాల్లో తనిఖీల్లో కనుగొన్న ఆధారాలు, బ్రహ్మయ్య అండ్ కో చార్టెడ్ అకౌంటెంట్ శ్రావణ్ ఇచ్చిన వాంగ్మూలం కాపీలను చూపిస్తూ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేసేందుకు రామోజీరావు ప్రయత్నించారు.
కీలక పత్రాలు, బ్యాంకు లావాదేవీల కాపీలు, బ్యాలన్స్ షీట్ల కాపీలను చూపిస్తూ అధికారులు ప్రశ్నించడంతో ఇక మాట్లాడలేకపోయారని తెలుస్తోంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి కార్యాలయాల్లోని నిధులను ప్రధాన కార్యాలయానికి మళ్లించడం నిజమా.. కాదా? అని సూటిగా ప్రశ్నించడంతో అవునని రామోజీ అంగీకరించాల్సి వచ్చింది.
చిట్‌ఫండ్స్ నిధులను నిబంధనలకు విరుద్ధంగా మ్యూచ్‌వల్ ఫండ్స్, ఇతర షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టిన ఆధారాలను కూడా సీఐడీ అధికారులు చూపించి ప్రశ్నించగా అదంతా మార్గదర్శి ఆర్థిక ప్రణాళికలో భాగమని రామోజీ చెప్పినట్టు సమాచారం.
అంటే చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మ్యూచ్‌వల్ ఫండ్స్, షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వాస్తవమే కదా? అని ప్రశ్నించడంతో ఔనని రామోజీరావు అంగీకరించారని సమాచారం. చిట్టీల చందాదారులు పాడిన మొత్తాన్ని ఇవ్వకుండా రశీదు’ మాత్రమే ఇస్తూ 5శాతం వడ్డీ చెల్లిస్తున్న విషయంపై కూడా సీఐడీ అధికారులు సూటిగా ప్రశ్నించారు.
తాము అట్టిపెట్టుకున్న మొత్తానికి వడ్డీ చెల్లిస్తున్నాం కదా అందులో అక్రమం ఏముందనీ రామోజీరావు ఎదురు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వడ్డీ చెల్లిస్తామని చెప్పి నగదును అట్టిపెట్టుకోవడం అంటే అది డిపాజిట్ సేకరణే అవుతుంది కదా... చిట్‌ఫండ్ కంపెనీలను డిపాజిట్ల సేకరణకు రిజర్వ్‌బ్యాంకు అనుమతించిందా? అంటే రామోజీరావు స్పందించకుండా మౌనం వహించారని సమాచారం.
అంటే మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో సీఐడీ అధికారులు నమోదు చేసిన అభియోగాలన్నీ దాదాపు వాస్తవమేనని ఆయన పరోక్షంగా సమ్మతించినట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లు, ఆడిటింగ్ వ్యవహారాలు చూసిన చార్టెడ్ అకౌంటెంట్ కూడా నిధులు మళ్లింపు, అక్రమ పెట్టుబడులు, అక్రమ డిపాజిట్లకు పాల్పడినట్టు సమ్మతించారు.
తదుపరి విచారణ ఏపీలో!
మార్గదర్శి వ్యవహారంలో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ అధికారులు కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయనున్నారు. అందుకోసం రామోజీరావు, శైలజలను త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు రప్పించి విచారించాలని భావిస్తున్నారు. నేరం జరిగిన ప్రదేశం(సీన్ ఆఫ్ అఫెన్స్) ఆంధ్రప్రదేశ్ కాగా మన రాష్ట్రంలోని చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ తరలించారు.
కేసు దర్యాప్తు తీరును సమీక్షించిన అనంతరం తదుపరి విచారణ కోసం రామోజీరావు, శైలజలను రాష్ట్రానికి రప్పించాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో వారు ఎంపిక చేసుకున్న నగరంలో విచారించేందుకు సమాయత్తమవుతున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలపై ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతర రాష్ట్రాలకు ఇప్పటికే సీఐడీ అధికారులు సమాచారం ఇచ్చారు.
స్టేట్‌మెంట్ విశ్లేషించాక తదుపరి చర్యలు: అమిత్ బర్దార్, ఎస్పీ
‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ వ్యవహారాలకు సంబంధించి 7 కేసులు నమోదయ్యాయి. రామోజీరావును విచారించి ఆయన స్టేట్‌మెంట్ నమోదు చేశాం. అది విశ్లేషించాల్సి ఉంది. మార్గదర్శి ఎండీ శైలజను ఈ నెల 6న విచారిస్తాం. కేసులో కనుగొన్న ఆధారాలు, పురోగతిని బట్టి తదుపరి చర్యలు చేపడతాం’
Comments
Please login to add a commentAdd a comment