ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టైన నటి రియా చక్రవర్తి నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో ఎవరి పేర్లను వెల్లడించలేదని ఆమె తరఫు న్యాయవాది సతీశ్ మానేషిండే అన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మినహా ఇతర నటుల గురించి ఆమె మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడిన సతీశ్.. ‘‘ఎన్‌సీబీ ఎదుట వాంగ్మూలం ఇచ్చే సమయంలో రియా ఎవరి పేరును ప్రస్తావించలేదు. ఇందుకు సంబంధించిన వార్తలన్నీ అవాస్తవం. సుశాంత్‌తో ఉన్నన్ని రోజులు అతడు మత్తు పదార్థాలు తీసుకునేవాడని మాత్రమే రియా చక్రవర్తి ఎన్‌సీబీకి తెలిపారు. అంతేతప్ప ఇతరుల గురించి ఆమె మాట్లాడలేదు’’అని పేర్కొన్నారు. (చదవండి: టీవీ నటులను తాకిన డ్రగ్స్ సెగ)
అదే విధంగా రియాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలను కూడా ఆయన కొట్టిపారేశారు. ‘‘సుశాంత్ ఇంటి మనిషిగా ఉన్నందున తన గురించి ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదు’’అని పేర్కొన్నారు. అయితే జయా సాహా ఇతర డ్రగ్ డీలర్లతో రియా వాట్సాప్ చాట్స్ గురించి సతీశ్‌ను ప్రశ్నించగా.. ‘‘రియా, సుశాంత్‌లతో జయా ఏం మాట్లాడారన్న దానిపై స్పష్టతనివ్వాలనుకుంటున్నా. గంజాయి ఆకుల నుంచి తీసిన సీబీడీ ఆయిల్ ఇవ్వాలని మాత్రమే వాళ్లు ఆమెను అడిగారు. నిజానికి అది మత్తు పదార్థం కాదు. ఎవరికైనా అనుమానం ఉంటే ఆ ఆయిల్ బాటిల్‌ను చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి మాదక ద్రవ్యాలు లేవని దానిపై రాసి ఉంటుంది’’అని పేర్కొన్నారు. (చదవండి: హీరోయిన్లు మాత్రమేనా? హీరోల మాటేమిటి?)
కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు సినీ పరిశ్రమలో తీవ్ర ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి అరెస్టు కాగా, బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకునె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ సహా రకుల్ ప్రీత్‌సింగ్‌కు ఎన్‌సీబీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దీపికా సెప్టెంబరు 25న, సారా, శ్రద్ధ సెప్టెంబరు 26న ఎన్‌సీబీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. రకుల్, సుశాంత్ మేనేజర్ శృతి మోదీ, సిమోన్ ఖంబట్టా నేడు విచారణ ఎదర్కొంటున్నారు. అయితే రియా చెప్పడంతోనే వీరందరి పేర్లు బయటపడ్డాయనే ప్రచారం నేపథ్యంలో లాయర్ సతీశ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment