అనంతపురం విద్య: జిల్లాలో మరో కీచక టీచర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. బొమ్మనహాళ్ మండలం శ్రీధర్‌ఘట్ట ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ చల్లా ఓబులేసు ఓ విద్యార్థినిని వేధించిన కేసులో కటకటాలపాలయ్యాడు. ఈ ఉదంతం మరువకముందే గుత్తికోట జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడు ముగ్గురు తొమ్మిదో తరగతి విద్యార్థినులను లైంగికంగా వేధించిన విషయం వెలుగు చూసింది.
అతనిపై ఓ విద్యార్థిని తల్లిదండ్రులు డయల్ 100కు సమాచారమిచ్చారు. పైగా అతను ఓ ఉపాధ్యాయ సంఘంలో కీలక హోదాలో ఉండడం గమనార్హం. ఈ అంశంపై పోలీసుస్టేషన్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఎవరైనా స్టేషన్‌కు ఎందుకొచ్చారని అడిగితే... ‘మొన్న విజయవాడ ర్యాలీకి వెళ్లాం కదా! అందుకే వచ్చి మాట్లాడుతున్నా’నంటూ కప్పిపుచ్చుకుంటున్నట్లు తెలిసింది.
వేధింపులు..బెదిరింపులు
సదరు స్కూల్ అసిస్టెంట్ విద్యార్థినులను లైంగికంగా వేధించడమే కాకుండా ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరింపులకు సైతం పాల్పడినట్లు సమాచారం. బాధిత విద్యార్థినులు ఒకానొక దశలో అతని ఆగడాలు భరించలేమని, పాఠశాలకు వెళ్లలేమని తల్లిదండ్రులతో మొరపెట్టుకున్నారు. దీంతో ఓ విద్యార్థిని తల్లిదండ్రులు ఈ నెల నాల్గో తేదీన డయల్ 100కు సమాచారమిచ్చారు. పోలీసులు పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. అయినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉదంతంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయలేదు.
గతంలో దేహశుద్ధి
సదరు ఉపాధ్యాయుడు పుట్లూరు మండలం కడవకల్లు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సమయంలోనూ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేశారు. అప్పట్లో పోలీసు కేసు నమోదు కావడంతో సస్పెండ్ అయ్యారు. తర్వాత రాజీ కుదుర్చుకుని కేసు లేకుండా చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment