సాక్షి, విజయవాడ : విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకున్నాడు. కట్నం కోసం ఆడవాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతూ క్రమశిక్షణ తప్పాడు. ఆగ్నిసాక్షిగా కట్టిన తాళిని ఎగతాళి చేస్తూ ముగ్గురు మెడలో మూడుముళ్లు వేశాడు. రెండో భార్య దిశ పోలీసులను ఆశ్రయించడంతో బడిపంతులు బాగోతం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అవనిగడ్డకు చెందిన శీలం సురేష్ చాట్రాయి మండలంలోని మర్రిబంధం ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. 2011 లో శాంతిప్రియ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అదనపు కట్నం తేలేదని ఆమెను వదిలేసి, మొదటి పెళ్లి గురించి చెప్పకుండా 2015 లో శైలజ అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు.
కట్నం కింద నాలుగులక్షల రూపాయలు, పది సవర్ల బంగారం తీసుకొన్నాడు. ఆడపిల్లకు జన్మనిచ్చిందని శైలజతో తెగతెంపులు చేసుకొని 2019 లో అనూష అనే ఉపాధ్యాయిని రహస్యంగా మూడో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి నిలదీసిన భార్య శైలజ ,అత్తలపై దాడి చేశాడు. సురేష్ నయవంచనపై జిల్లా విధ్యాశాఖాధికారితో పాటు దిశ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. సురేష్‌పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడు పెళ్లిళ్లకు సహకరించిన సురేష్ తల్లిదండ్రులు, అన్నయ్యపై చర్యలు తీసుకోవాలని విజయవాడ దిశ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో మహిళ మోసపోకముందే సురేష్‌ను అరెస్ట్ చేయాలని రెండో భార్య శైలజ విజ్ఞప్తి చేశారు. న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగిస్తానని తేల్చి చెప్పారు. బాధిత భార్యలకు మహిళ సంఘాలు అండగా నిలిచాయి. సురేష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి.
అదనపు కట్నం కోసం వేధించాడు : సురేష్ మొదటి భార్య
నిత్య పెళ్లికొడుకు సురేష్ బాగోతంపై ఆయన మొదటి భార్య శాంతి ప్రియ స్పందించారు. తనలాగే మరో ఇద్దరిని కూడా మోసం చేశాడని తెలిసి బాధపడ్డానని తెలిపారు. సురేష్ పై చర్యలు తీసుకోకుంటే మరింతమందిని మోసం చేస్తారని పేర్కొన్నారు. తాను కేసు పెట్టినప్పుడే చర్యలు తీసుకుంటే మరో ఇద్దరు మహిళలకు అన్యాయం జరిగేది కాదని వాపోయారు. రూ.10లక్షలు కట్నంగా తీసుకొని ఇంకా కావాలని తనను వేధించారని ఆరోపించారు. పుట్టింట్లో ఘనంగా పుట్టిన రోజు జరుపుతానని చెప్పి వదిలేసి కనిపించకుండా వెళ్లాడని చెప్పారు. సురేష్‌కు పలుకుబడి ఉండటం వల్ల ఏ కేసులోనూ చిక్కకుండా తిరుగుతున్నాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయమని త్వరలోనే మహిళా కమిషన్‌ను కూడా కలుస్తానని శాంతిప్రియ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment