ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చివ్వెంల (నల్లగొండ) : ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే తన ఫోన్‌ను ఎస్‌ఐ లాక్కున్నాడని ఓ మహిళ గురువారం సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణానికి చెందిన పిడమర్తి సునీత చివ్వెంల మండల పరిధిలోని దురాజ్‌పల్లి గ్రామానికి చెందిన పొట్టపెంజర వీరయ్య దగ్గర గ్రామంలోని సర్వేనంబర్ 330/రు/2 గల 11 గుంటల భూమిని 2019లో కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి అదే సంవత్సరంలో తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని పట్టాదారు పాస్‌పుస్తకం పొందింది.
ఈక్రమంలో భూమిని విక్రయించిన వీరయ్య అదే భూమి ఎదుట హోటల్ పెట్టుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, ఇదేంటని ప్రశ్నిస్తే తనను తన్నడంతోపాటు, అసభ్య పదజాలంతో దూషించి, చంపుతానని బెదిరించాడని ఆరోపించింది. ఈమేరకు ప్రాణభయంతో వీరయ్యపై కేసు పెట్టేందుకు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పరిష్కరించాల్సిన ఎస్‌ఐ తన ఫోన్ లాక్కున్నాడని, అంతేకాకుండా పొట్ట పెంజర వీరయ్యకు ఫోన్ చేసి నీపై ఫిర్యాదు వచ్చిందని, వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తానని వీరయ్యకు చెప్పాడని ఆరోపించింది.
సంఘటనా స్థలం వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోలు డిలీట్ చేసేందుకే తన ఫోన్ లాక్కున్నారని ఆరోపించింది. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు సోషల్ మీడియాలో విషయాన్ని పోస్టు చేసింది. ఈ విషయమై ఎస్‌ఐ విష్ణుమూర్తిని వివరణ కోరగా ఇద్దరు అన్నదమ్ములు, ఆమె సోదరికి మధ్య భూమి విషయంలో జరిగిన ఘర్షణ గురించి వివరాలు అడిగి తెలుసుకుంటుండగా, సునీత వెంట వచ్చిన మరో మహిళ ఫోన్‌లో తాము మాట్లాడుతున్న విషయాన్ని రికార్డు చేస్తుండడంతో లాక్కున్నట్లు పేర్కొన్నారు. ఆమె తీసిన వీడియో కూడా ఫోన్‌లో ఉందని చెప్పారు.
చదవండి: ఉస్మానియా.. 3 ప్రపంచ రికార్డులు
Comments
Please login to add a commentAdd a comment