
రామ్‌కుమార్ (ఫైల్)
సాక్షి, విశాఖపట్నం: అప్పటివరకు సరదాగా కుటుంబ సభ్యులతో గడిపి విధులకు బయలుదేరిన ఆ యువకుడిని మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలిలావున్నాయి. కశింకోట హౌసింగ్ కాలనీకి చెందిన పావాడ రామ్‌కుమార్ (35) విశాఖలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రతిరోజు అతను బస్సులో వెళ్లేవాడు.
బుధవారం మాత్రం సాయంత్రం వరకు కుటుంబసభ్యులతో సరదా గడిపి.. బైక్‌పై నైట్ డ్యూటీకి కశింకోట నుంచి విశాఖ బయలుదేరాడు. అతని బైక్‌ను అనకాపల్లి జాతీయ రహదారిలో కొప్పాక బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో రామ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. రామ్‌కుమార్ మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి, ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయనకు భార్య జానీఫర్ (గర్భిణి), రెండేళ్ల వయసు గల కుమారుడు ఉన్నారు. రామ్‌కుమార్ మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.