దారిపొడవునా రుధిర చారలే..! | Road Accidents on Anakapalli Highway Visakhapatnam | Sakshi
Sakshi News home page

దారిపొడవునా రుధిర చారలే..!

Published Wed, Feb 20 2019 6:40 AM | Last Updated on Wed, Feb 20 2019 6:40 AM

Road Accidents on Anakapalli Highway Visakhapatnam - Sakshi

మంగళవారం జేఎంజే స్కూల్‌ వద్ద ప్రమాద ప్రాంతంలో లారీ, రక్తసిక్తం అయిన రోడ్డు

కొద్ది నెలల క్రితం.. సమయం తెల్లవారు జాము 5 గంటలు.. మునగపాక వద్ద మెయిన్‌రోడ్డుకు పక్కనే ఉన్న ఇంటి నుంచి అప్పారావు కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డుపైకి వచ్చాడు. అదే సమయంలో అచ్యుతాపురం నుంచి వస్తున్న ఒక వాహనం కూడలిలోని ఆటోని ఢీకొట్టింది. ఆటో ఎగిరి పక్కన పడి పోయి అటు వైపు ఉన్న అప్పారావును ఢీ కొట్టింది. కనీసం వాహ నం వస్తుందని తెలుసుకునే లోగా అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ అతి వేగం వల్ల నిండుప్రాణం గాల్లో కలిసిపోయిం ది.. ఇలాంటి సంఘటనలు అనకాపల్లి – అచ్యుతాపురం మార్గంలో తరచూ జరుగుతున్నాయి. దారి పొడునా ఎక్కడ చూసినా గత ప్రమాదాలనే గుర్తుచేస్తున్నాయి..

విశాఖపట్నం, అనకాపల్లి: అనకాపల్లి – అచ్యుతాపురం మార్గం ప్రమాదాలకు నెలవుగా మారింది. ఒకప్పుడు గ్రామీణ జిల్లాలో ఉపాధి పని దొరకాలన్నా, వాణిజ్య పరమైన వస్తువుల్ని కొనుగోలు చేయాలన్నా అందరూ అనకాపల్లి వచ్చే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దినదినాభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురం పారిశ్రామిక వాడలో పరిశ్రమలు ఏర్పాటవుతుండటంతో నిరుద్యోగుల దృష్టి అంతా అటు వైపే మళ్లింది. కార్పోరేట్‌ స్థాయి కంపెనీలు ఏర్పాటవుతుండడంతో అచ్యుతాపురం నుంచి వెళ్లే పరిశ్రమల వాహనాలు, అక్కడి పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకులు రవాణా చేసే మార్గమైన అనకాపల్లి– అచ్యుతాపురం మార్గానికి వాహనాల తాకిడి పెరిగింది. దీంతో రోజురోజుకూ ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతోంది. మంగళవారం తెల్లవారు జామున జేఎంజే స్కూల్‌ ఒక సైక్లిస్టును వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో అతడు మృతి చెందాడు. ఇలా ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.

100 అడుగుల విస్తరణకే ప్రతిపాదనలు
పెరుగుతున్న వాహనాల రద్దీకి తగ్గట్టుగా మార్గాన్ని విస్తరించాలని ఏళ్ల నుంచి వస్తున్న ప్రతిపాదనలకు  తగ్గట్టుగా విస్తరణ పనులు జరగడడం లేదు. దీంతో ఈ మార్గంలో రోజూ ఏదో ఒక చోట జరుగుతున్న ప్రమాదాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎప్పటికప్పుడు మార్గాన్ని విస్తరించాలని ఆందోళనలు చేపడుతున్నా సాంకేతిక అవరోధాలు, అధికారుల నిర్లిప్తత, రాజకీయ నేతల జోక్యాలు జనానికి శాపంగా మారుతున్నాయి. రోడ్డుని విస్తరించి ప్రమాదాలు నివారించాలని ఏళ్ల క్రితమే అధికారులు నిర్ణయించారు. ఈ మార్గంలో నాగులాపల్లి, ఒంపోలు, మునగపాక, తిమ్మరాజుపేట, హరిపాలెం, కొండకర్ల జంక్షన్, చోడపల్లి గ్రామాలకు సంబంధించి ఇళ్లు పోయే అవకాశం ఉండటంతో సమస్య జటిలంగా మారింది. 180 అడుగుల వరకూ విస్తరించాలని తొలుత భావించినా ఇప్పుడు ఆ ప్రతిపాదన 100 అడుగులకు మాత్రమే పరిమితమైంది.

అర్ధరాత్రి వరకూ వాహనాల రద్దీ
అనకాపల్లి నుంచి అచ్యుతాపురం రహదారి వరకూ 16 కిలో మీటర్ల రహదారి ఉంది. 30 అడుగుల వెడల్పు గల ఈ తారు రోడ్డుకు ఇరు పక్కలా ఐదు అడుగుల చొప్పున స్థలం ఉంది. పక్కనే సాగునీటి కాల్వలలకు రెయిలింగ్‌ లేకపోవడంతో వాహనాలు వెళ్లడం ఇబ్బందిగా మారుతోంది. అచ్యుతాపురంలో పరిశ్రమలు ఏర్పడకముందు ఈ మార్గంలో వాహనాల రద్దీ పెద్దగా ఉండేది కాదు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన బ్లాక్‌స్టోన్, రఫ్‌ స్టోన్, గ్రావెల్‌తో కూడిన వాహనాలు అనకాపల్లి మీదుగా అచ్యుతాపురం వెళ్తుండడంతో తెల్లవారు జాము 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ వాహనాల రద్దీ పెరుగుతోంది.

త్వరలోనే విస్తరణ పనులు ప్రారంభిస్తాం
ఈ మార్గంలో రహదారి విస్తరణ పనులకు సంబంధించిన ప్రణాళికలు ఉన్నాయి. ఆర్డీవో నేతృత్వంలో వివిధ శాఖల అధికారులు ఎంత మేర విస్తరణ చేయాలి అన్న దానిపై నివేదిక సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికి 100 అడుగుల మేర రోడ్డు విస్తరించాలని ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు.– లలిత, ఆర్‌అండ్‌బీ జేఈ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement