మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ తదితరులు
విద్యా బుద్ధులు చెప్పించి ఉన్నతుడిగా తీర్చిదిద్దాలనుకున్న తండ్రి కలలను ఆ సుపుత్రుడు కల్లలు చేశాడు..విదేశంలో ఉన్నత విద్య అభ్యసించినా వక్రమార్గంలో పయనించి చెడు వ్యసనాల బారినపడ్డాడు. కుమారుడి తీరుతో విసుగుచెందిన ఆ తండ్రి ఇంటికి తీసుకొచ్చినా తీరు మారలేదు సరికదా.. ఇంకా పెచ్చుమీరిపోయాడు. చివరకు అవసరాలకు డబ్బు ఇవ్వలేదన్న కారణంతో కాలయముడిగా మారి తండ్రినే పొట్టనబెట్టుకున్నాడు. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లాలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
పెన్‌పహాడ్: మండల పరిధిలోని నారాయణగూడెం గ్రామానికి చెందిన నంద్యాల అంజిరెడ్డి(65), పుల్లమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.పుల్లమ్మ పదేళ్ల క్రితం కాలం చేసింది. కుమార్తె కీర్తి వివాహం కాగా, కుమారుడు అమరసింహారెడ్డి బీటెక్ పూర్తి చేశాడు.
ఉన్నత విద్యకు విదేశానికి..
అమరసింహారెడ్డి చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉండేవాడు. టెన్త్, ఇంటర్ సూర్యాపేటలో అభ్యసించి హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎంఎస్ చేయడానికి కెనడా వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు.
చెడువ్యసనాల బారిన పడి
అంజిరెడ్డి రెండు ఎకరాల వ్యవసాయ భూమిని విక్రయించి రెండేళ్ల క్రితం తన కుమారుడి ఉన్న త చదువుల నిమిత్తం కెనడాకు పంపించాడు. కొంతకాలం సజావుగానే ఉన్న అమరసింహా రెడ్డి చెడువ్యసనాల బారిన పడ్డాడు. మాధకద్రవ్యాల బారిన పడినట్లు తండ్రికి ఫిర్యాదులు అందడంతో జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఏడాది క్రితం అమరసింహారెడ్డిని ఇంటికి పిలిపించుకుని ఇక్కడే ఉంచాడు. అయినా అతడి తీరులో ఎలాంటి మార్పు రాకపోగా ఇంకా చెడు తిరుగుళ్లకు అలవాటు పడ్డాడు.
డబ్బు ఇవ్వలేదని..
అమరసింహారెడ్డి తన అవసరాలకు డబ్బు ఇవ్వాలని నిత్యం తండ్రితో గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తండ్రితో గొడవకు దిగాడు. తన వద్ద డబ్బు లేదని, ఉన్న అర ఎకరం భూమిని విక్రయిస్తే బతుకుబండి సాగేదెలా అని నచ్చజెప్పినా వినిపించుకోలేదు. పైగా తండ్రితో ఘర్షణపడి పక్కనే ఉన్న బకెట్‌తో కొట్టాడు. ప్రాణభయంతో బయటికి పరుగుపెడుతున్న అంజిరెడ్డి తలపై బండరాయితో బలంగా మోదడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలి ప్రా ణాలు విడిచాడు.
చుట్టు పక్కల వారు గమనించి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని సూర్యాపేట డీఎస్పీ మోహన్‌కుమార్, సీఐ విఠల్‌రెడ్డి, ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి పరిశీలించారు. అక్కడే ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమార్తె కీర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చదవండి: కొబ్బరికాయ కొడదామని గుడికి.. అంతలోనే బాబుతో
Comments
Please login to add a commentAdd a comment