హరికృష్ణ (ఫైల్)
అనంతపురం: తొమ్మిదో తరగతి విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠశాల కరస్పాండెంట్ పెట్టిన చిత్రహింసలు భరించలేకే తన కుమారుడు ఉరి వేసుకుని చనిపోయాడని ఆ విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూడేరు మండలంలోని ముద్దలాపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. ముద్దలాపురం గ్రామానికి చెందిన గొల్ల రమేష్ రెండో కుమారుడు హరికృష్ణ(13) అనంతపురంలోని రామన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు.
నాలుగేళ్లుగా ఈ పాఠశాలలోని హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. హరికృష్ణ బుధవారం రాత్రి స్కూల్ నుంచి ముద్దలాపురంలోని తమ ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉన్న హరికృష్ణ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పొలం నుంచి వచ్చిన తల్లిదండ్రులు విగతజీవిగా ఉరికి వేలాడుతున్న కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కూడేరు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేశారు.
చిత్రహింసలకు గురిచేశారు...అవమానించారు
తన కుమారుడు హరికృష్ణపై రామన్ స్కూల్ కరస్పాండెంట్ రామాంజనేయులు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశాడని, చిత్రహింసలు పెట్టి ఆత్మహత్యకు పాల్పడేలా చేశాడని విద్యార్థి తండ్రి గొల్ల రమేష్ కూడేరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో తమ కుమారుడిని రామాంజనేయులు విపరీతంగా కొట్టారని తెలిపారు.
అనంతరం 6301824064 సెల్ నంబర్ నుంచి తమకు ఫోన్ చేసి ‘మీ కుమారుడు మా స్కూల్‌లో ఉండాల్సిన అవసరం లేదు.. ఇంటికి పిలుచుకుని పోండి’ అని చెప్పాడన్నారు. తాము పాఠశాల వద్దకు వెళ్లకపోవడంతో తమ కుమారుడిని ఇంటికి పంపారని చెప్పారు. బుధవారం రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చిన తన కుమారుడు... తనను అవమానించారని, పదేపదే వేదన చెందాడన్నారు. ఇంట్లోనే ఉండి చదువుకోవాలని తాము సర్ది చెప్పామని తెలిపారు.
గురువారం ఉదయం తాము పొలం పనులకు వెళ్లగా... కరస్పాండెంట్ పెట్టిన చిత్రహింసలను తలచుకుని జీవితంపై విరక్తి చెందిన హరికృష్ణ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ కుమారుడి మృతికి కారణమైన స్కూల్ కరస్పాండెంట్‌ను కఠినంగా శిక్షించాలని కోరారు. మరోవైపు హరికృష్ణ మృతికి కారణమైన రామన్ స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పాఠశాల ఎదుట కొద్దిసేపు ఆందోళన చేశారు.
చదవండి: ప్రేమ ఎంత కఠినం
Comments
Please login to add a commentAdd a comment