సీటు రాదేమోనని.. రైలు దిగి గూడ్స్‌ రైలుకు ఎదురుగా వెళ్లి.. | Student Feeled On BITSAT Score He Taken Last Breath Falling Under Train | Sakshi
Sakshi News home page

‘బిట్‌శాట్‌’లో తక్కువ స్కోరు.. తండ్రి నిద్రిస్తుండగా రైలు దూకి

Published Mon, Aug 9 2021 7:48 AM | Last Updated on Mon, Aug 9 2021 11:09 AM

Student Feeled On BITSAT Score He Taken Last Breath Falling Under Train - Sakshi

హిందూపురం: బిట్‌శాట్‌లో స్కోర్‌ తగ్గడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు... అనంతపురము హిందూపురంలోని విద్యానగర్‌లో నివాసముంటున్న ఉపాధ్యాయుడు పెన్నోబులం, రమాదేవి దంపతుల కుమారుడు ఫణిసాయి హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేశాడు. హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీలో సీటు వచ్చింది. ఈ క్రమంలోనే జేఈఈ మెయిన్స్‌కు కూడా అర్హత సాధించాడు. అలాగే బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అడ్మిషన్‌ టెస్ట్‌ (బిట్‌శాట్‌)కు ఇంట్లోనే ఉంటూ సిద్ధమయ్యాడు.

ఈ నెల 4న హైదరాబాద్‌కు తండ్రితోపాటు వెళ్లి 5వ తేదీ తెలంగాణ ఎంసెట్, 6వ తేదీన బిట్‌శాట్‌ పరీక్షలు రాశాడు. అనంతరం ఆన్‌లైన్‌లో బిట్‌శాట్‌ ఫలితాలు చూసుకున్న ఫణిసాయి స్కోర్‌ తగ్గిందని, తనకు సీటు రాదేమోనని మనోవేదనకు గురయ్యాడు. తండ్రి సముదాయించి కుమారుడిని వెంటబెట్టుకుని శనివారం రాత్రి కాచిగూడ - బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రైలులో హిందూపురానికి బయలుదేరాడు. కర్నూలు స్టేషన్‌ దాటిన తర్వాత పెన్నోబులం నిద్ర లేచి చూడగా పక్కనున్న బెర్త్‌పై కుమారుడు కనిపించలేదు. ఫణిసాయి కోసం టాయిలెట్స్, మిగిలిన కంపార్ట్‌మెంట్లు గాలించాడు.

అయినా ఫలితం లేకపోయింది. అనంతపురానికి చేరుకున్న తర్వాత అక్కడి బంధుమిత్రులతో కలిసి తాను ప్రయాణిస్తూ వచ్చిన అన్ని రైల్వే స్టేషన్లలోనూ విచారించారు. ఎక్కడా అబ్బాయి ఆచూకీ లభ్యం కాలేదు. కాగా, గద్వాల సమీపంలోని ఇటిక్యాలపాడు రైల్వేస్టేషన్‌లో కుమారుడు విగతజీవిగా పడి ఉన్నాడని సమాచారం అందింది. బంధువులు, స్నేహితులు వెంటనే ఇటిక్యాలపాడుకు వెళ్లారు. అక్కడ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇటిక్యాలపాడు వద్ద రైలు నెమ్మదిగా వెళ్తుండడంతో ఫణిసాయి దిగి తర్వాత అక్కడికి సమీపంలో వస్తున్న గూడ్స్‌ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement