
నల్లగొండ క్రైం: తనకు నచ్చిన స్కూళ్లో చేర్పించడంలేదన్న కోపంతో ఓ విద్యార్థిని భవనంపై నుంచి కిందకు దూకింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన బచ్చు ఉమామహేశ్వరి నల్లగొండలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది.
ఈనెల 2వ తేదీన శుభకార్యం ఉండడంతో ఉమామహేశ్వరిని ఆమె తల్లి ఇంటికి తీసుకెళ్లింది. ఆదివారం తిరిగి పాఠశాలకు తీసుకువచ్చింది. కాగా, చెల్లెలు చదువుతున్న చౌటుప్పల్ పాఠశాలలో తనను చేర్పించాలని ఉమా మహేశ్వరి తల్లిని కోరింది. అక్కడ సీట్లు లేవని, వచ్చే సంవత్సరం చూద్దామని తల్లి పార్వతమ్మ సర్ది చెప్పింది. కానీ తను అక్కడ చదవనని ఉమామహేశ్వరి గొడవ చేసింది.
తల్లి పాఠశాల గేట్ దాటే లోపే ఉమామహేశ్వరి భవనంపైకి ఎక్కి దూకింది. వెంటనే ఆమెను ప్రిన్సిపాల్, తల్లి, తోటి విద్యార్థులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.