
సాక్షి, చెన్నై: కుటుంబ కలహాల కారణంగా భార్య, భర్త ఒకరి తరువాత ఒకరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. సేలం జిల్లా సంగిరి సమీపంలో ఉన్న వైకుంఠం మారియమ్మన్ ఆలయ ప్రాంతానికి చెందిన కార్తీక్ (31) సొంతంగా టిప్పర్ లారీ కొని.. కాంట్రాక్టర్ పనులు చేస్తున్నాడు. అతని భార్య ప్రియ (28). వీరికి వివాహమై ఏడాది అవుతోంది. కార్తీక్‌కు మద్యానికి బానిస కావడంతో ఇద్దరికీ తరచూ గొడవలు జరిగేవి. ఈక్రమంలో బుధవారం రాత్రి భార్య, భర్త ఘర్షణపడ్డారు.
దీంతో ప్రియ గురువారం ఉదయం తన పడక గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పొద్దున్న నిద్ర లేచిన కార్తీక్ భార్య ఉరి వేసుకుని మృతి చెంది ఉండడం చూసి బోరున విలపించాడు. తరువాత గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. బంధువులు అడ్డుకున్నారు. దీంతో అక్కడి నుంచి బయటకు వెళ్లిన అతను చెల్లియమ్మన్ ఆలయం వెనుక ఉన్న ఓ వేపచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.