
స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలతో డీఎస్పీ
రెడ్డిగూడెం: తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనుచరుడు అయ్యంకి బాలస్వామి అక్రమ మద్యం కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించి, విక్రయిస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారన్న సమాచారం మేరకు ఓ టీడీపీ నాయకుడిని రెడ్డిగూడెం పోలీసులు సోమవారం వలపన్ని పట్టుకున్నారు.
రెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు సోమవారం వివరాలు వెల్లడించారు. రెడ్డిగూడెం మండలంలోని బూరుగగూడెం గ్రామంలో తెలంగాణ నుంచి అక్రమంగా తరలించిన మద్యంను నిల్వ ఉంచారని అందిన సమాచారం మేరకు రెడ్డిగూడెం ఎస్‌ఐ డి.ఆనంద్‌కుమార్ తన సిబ్బందితో కలసి దాడి చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా అనుచరుడు, బూరుగగూడెం గ్రామానికి చెందిన నిందితుడు అయ్యంకి బాలస్వామి తన ఇంటికి సమీపంలో నిల్వ చేసిన రూ.68,120 విలువ చేసే 524 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కాగా భారీగా తెలంగాణ మద్యాన్ని పట్టుకుంటున్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ అభినందించారని డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment