
బీరువాని పగులగొట్టి. అందులోని వస్తువులు చిందరవందరగా పడేసిన దొంగలు
మారేడుమిల్లి: మండలంలోని గుజ్జుమామిడి వలస (జీఎంవలన) గ్రామంలో మాజీ సర్పంచ్ పల్లాల సూర్యనారాయణ రెడ్డి ఇంట్లో గురువారం మధ్యాహ్నం సమయంలో దొంగతనం జరిగింది. దొంగలు సుమారు రెండు లక్షలు విలువ గల బంగారం, డబ్బును అపహరించుకుని పోయినట్టు తెలిసింది. బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం మాజీ సర్పంచ్ పల్లాల సూర్యానారాయణ రెడ్డి, అతని భార్య గ్రామ శివారులో గల ఇంట్లో నివాసం ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం ఇరువురూ గ్రామంలో జరిగిన పెళ్లికి వెళ్లారు.
అనంతరం ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఇంటి వెనుక వైపు తలుపు తాళం పగులకొట్టి ఉంది. దీంతో ఆందోళనతో వారు ఇంట్లోకి వెళ్లి చూడగా తలుపుల తాళాలు, బీరువా తాళం పగులకొట్టి బీరువాలోని దుస్తులు, వస్తువులు చిందరవందరగా పడేసి ఉన్నాయి. బీరువాలో ఉంచిన నగదు, బంగారం కనిపించలేదు. తమ ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి చుట్టుపక్కల వారికి విషయం తెలిపారు. వచ్చే నెలలో ఇంట్లో శుభకార్యం పెట్టుకున్నామని దానికోసం దాచి ఉంచిన నగదు, బంగారాన్ని దొంగలు అపహరించుకుపోయారని వారు బోరున విలపించారు. శుక్రవారం స్ధానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రాము సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు.
(చదవండి: పోలీసు ఇంటికే కన్నం)
Comments
Please login to add a commentAdd a comment