సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): కరోనా రోగులతో ఆసుపత్రి నిండిపోయింది.. ఇంకా బయటి నుంచి వస్తూనే ఉన్నారు. వైద్యులు, సిబ్బంది క్షణం తీరికలేకుండా సేవలు చేయడంలో మునిగిపోయారు.. ఆక్సిజన్ సకాలంలో అందక ముగ్గురు రోగులు చనిపోయిన ఉదంతం ఇంకా మరవలేదు.. అంతలోనే ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలోకి వచ్చి హల్‌చల్ సృష్టించారు. వైద్యులను, సిబ్బందిని హడలెత్తించారు. చివరికి పోలీసులకు చిక్కి రిమాండ్ పాలయ్యారు. అసలు విషయమేమిటంటే... తస్కీన్, అమరేందర్ అనే ఇద్దరు వ్యక్తులు యూనిట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ (ఎన్సీఐడీ) పేరిట ఇన్వెస్టిగేషన్ అధికారులుగా అవతారమెత్తారు. ఆదివారం ఆసుపత్రిలో సకాలంలో ఆక్సిజన్ అందక ముగ్గురు రోగులు చనిపోయిన ఘటనను ‘సుమోటోగా స్వీకరించిన’వీళ్లు రెండు రోజులు ఆలస్యంగా మంగళవారం సాయంత్రం ఆ దవాఖాన వద్దకు వచ్చారు.
వేర్ ఈజ్ యువర్ సూపరింటెండెంట్..?
ఫ్లోర్ ఇన్‌చార్జ్ షాహీదా వద్దకు వెళ్లి ఆక్సిజన్ ప్లాంట్‌కు దారి అడిగారు. ‘వీ ఆర్ ఫ్రం ఎన్సీఐడీ. వేర్ ఈజ్ యువర్ సూపరింటెండెంట్ ఛాంబర్ అండ్ వేర్ ఈజ్ ఆక్సిజన్ ప్లాంట్’ అంటూ గద్దించారు. వీళ్లు నిజమైన సీఐడీ అధికారులుగా భావించిన ఆమె ప్లాంట్‌కు దారి చూపించారు. వారు తమ ఫోన్లతో అక్కడ ఫొటోలు, వీడియోలు తీశారు. అక్కడ నుంచి రిసెప్షన్ వద్దకు రాగా... అదే సమ యంలో ఓ మహిళా కోవిడ్ రోగి అడ్మిషన్ కోసం వచ్చారు. అయితే నిబంధనల ప్రకారం రోగి రక్తంలో ఆక్సిజన్ శాతం గణనీయంగా తగ్గిపోతేనే అడ్మిషన్ ఇవ్వాలి. ఆ మహిళలకు 85 శాతం ఉండటంతో ఆసుపత్రిలో చేర్చుకోవడం కుదరదంటూ సిబ్బంది చెప్పారు. ఇది చూసిన ఈ ఎన్సీఐడీ ద్వయం రెచ్చిపోయింది. అసలు ఈ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది, ప్రతి చోటా లంచం తీసుకుం టున్నారు, డబ్బు ఇవ్వకపోతే అడ్మిట్ చేసుకోవట్లేదు.. అంటూ ఆరోపణలు చేసింది.
ఐసీయూలో వైద్యురాలికి బెదిరింపు..
అనంతరం ఆ ఇద్దరు వ్యక్తులు ఐసీయూలోకి దూసుకుపోయి ఫొటోలు, వీడియోలు తీయడం మొదలెట్టారు.. అక్కడ విధుల్లో ఉన్న ఓ వైద్యురాలు వీరిని గమనించి ‘ఎవరండీ మీరు.. ఐసీయూలోకి ఎందుకు వచ్చారు? అంటూ ప్రశ్నించగా.. ‘ఎవతివే నువ్వు? ఉద్యోగం చెయ్యాలని ఉందా లేదా’అంటూ ఆమెపై రంకెలు వేశారు.
మా సంగతి మీకు తెలీదంటూ బెదిరింపు..
ఈ హైడ్రామాతో దాదాపు రెండు గంటలపాటు వైద్యులు, సిబ్బంది హడలిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న స్పెషల్ ఆఫీసర్ విజయేంద్ర బోయి అబిడ్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డిని అప్రమత్తం చేశారు. ఆయనతోపాటు నారాయణగూడ ఇన్‌స్పెక్టర్ భూపతి గట్టుమల్లు తమ సిబ్బందితో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. పోలీసులను చూశాక కూడా ఆ ఇద్దరూ ‘మా సంగతి మీకు తెలీదు, మేం తలచుకుంటే ఇక్కడ ఎవ్వరూ ఉద్యోగాలు చేయ్యలేరంటూ’బెదిరింపు ధోరణిని ప్రదర్శించారు. వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు ఠాణాకు తరలించి విచారించగా ఎన్సీఐడీకి సంబంధించిన అసలు విషయం బయటపడింది. వైద్యులను దూషించినందుకు, దౌర్జన్యానికి దిగినందుకు కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హల్‌చల్ చేస్తున్న సమయంలో వీరి వెంట ఉన్నది ఎవరు? వీరితో సంబంధాలు ఏంటి? అనే అంశాలు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ద్వయం గతంలోనూ ఇలాంటి బెదిరింపుల దందాలు చేసిందా? అనేది ఆరా తీస్తున్నారు.
రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ పోలీసుల లేఖ
నారాయణగూడ పోలీసులు ఇరువురినీ అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఈ ద్వయం గతంలోనే తమ సంస్థను రిజిస్ట్రేషన్ చేయాలంటూ సంబంధిత రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నారాయణగూడ పోలీసులు వీరి వ్యవహారశైలిని వివరిస్తూ, రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. అయితే హల్‌చల్ చేయడానికి వారు ఇలా యూసీఐడీలుగా అవతారమెత్తారని, ఇక్కడ ఎవరినీ డబ్బులు డిమాండ్ చేయలేదని పోలీసులు పేర్కొన్నారు.
అసలు వీరెవరంటే...
డబీర్‌పురకుచెందిన మహ్మద్ తస్కీన్ ఆలిండియా సీనియర్ స్పెషల్ ఆఫీసర్, ప్రెసిడెంట్‌గా, మెట్టుగూడ వాసి అమరేందర్ సెక్రటరీగా యూసీఐడీ సంస్థను ఏ ర్పాటు చేశారు. దీన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటూ సంబంధిత రిజిస్ట్రార్‌కు పంపిన దరఖాస్తు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈలోపే విజిటింగ్ కార్డులు ముద్రించుకు న్న ఈ ద్వయం రోడ్లపైకి ఎక్కింది. ఇందు లో యూనిట్ అనే పదాన్ని చిన్నగా... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డివిజన్‌ను పెద్దగా ఎర్ర అక్షరాలతో ముద్రించారు. అందులోనే వర్కింగ్ ఎగైనెస్ట్ క్రైమ్ అని రాశారు.
ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించిన కెపాసిటీ నాది
అట్నుంచి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ ఛాంబర్‌కు వీళ్లిద్దరూ వెళ్లారు. ఆ సమయంలో ఛాంబర్‌లో నోడల్ అధికారి డాక్టర్ మల్లిఖార్జున్, అడిషినల్ సూపరింటెండెంట్ డాక్టర్ జలజ వెరోనికా, ఆర్‌ఎంవో నీరజ ఉన్నారు. వారిని చూస్తూ రెచ్చిపోయిన ఎన్సీఐడీ ప్రెసిడెంట్, సెక్రటరీలు ‘ఆదివారం ఆక్సిజన్ అందక రోగులు ఎందు కు చనిపోవాల్సి వచ్చింది? ఆక్సిజన్ పూర్త య్యే వరకు మీరేం చేస్తున్నారు?’అంటూ చిందులేశారు. అక్కడున్న అధికారులు ‘మీరు ఎవరు?’అంటూ వీరిని ప్రశ్నించారు. దీంతో ‘ఏం సూపరింటెండెంట్.. నన్నే అడుగుతావా? నేను ఎవర్ని అనుకుంటున్నావ్. ఈటల రాజేందర్ లాంటి వాడినే మంత్రి పదవి నుంచి తప్పించిన కెపాసిటీ నాది. మైండ్ యువర్ వర్డ్స్.. నీ అంతుచూస్తా’అంటూ వారిలో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment