కొల్లాబత్తుల దయాకరుణ్ (ఫైల్) బాణావత్ సత్యనారాయణ (ఫైల్)
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్/ఆత్రేయపురం: వారిద్దరూ కలిసి చదువుకుంటున్నారు. కలసిమెలసి ఉండేవారు. చివరికి మృత్యువులోనూ వారి స్నేహబంధం వీడలేదు. ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద గోదావరిలో స్నానాలకు వెళ్లి ఇద్దరు మృత్యువాత పడిన సంఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. రాజమహేంద్రవరం ఐఎల్‌టీడీ బొగ్గులదిబ్బ ప్రాంతానికి చెందిన కొల్లాబత్తుల దయాకరుణ్ ఎలియాస్ సన్నీ (20), రైల్వే క్వార్టర్స్‌కు చెందిన బాణావత్ సత్యనారాయణ (20) ధవళేశ్వరం వివేకానంద ఐటీఐలో మొదటి సంవత్సరం చదువుతున్నారు.
గురువారం సాయంత్రం తరగతులు ముగిశాక ఇద్దరూ గోదావరి స్నానానికి పిచ్చుకలంక వెళ్లారు. ప్రమాదవశాత్తూ కాలు జారి నదిలో పడ్డారు. పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్రంగా గాలించినా ప్రయోజనం లేకపోయింది. చివరికి వారి మృతదేహాలు శుక్రవారం గోదావరి ఒడ్డున లభ్యమయ్యాయి. దయాకరుణ్ తండ్రి శేఖర్ పెయింటింగ్ పనుల కాంట్రాక్టు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడు, కుమార్తె ఉన్నారు. మరో మృతుడు సత్యనారాయణ తండ్రి సీతనాయక్ రైల్వే శాఖలో పని చేస్తున్నారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. ఐటీఐ చదివి ఉద్యోగాలు పొందుతారని భావించిన తరుణంలో విద్యార్థులిద్దరూ మృత్యువాత పడడాన్ని ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment