న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టైన జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్‌కు వచ్చే నెల 22 వరకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద అరెస్టై పోలీసుల అదుపులో ఉన్న ఉమర్.. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరయ్యాడు. ఈ క్రమంలో అదనపు సెషన్స్ జడ్జి అమితాబ్ రావత్ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. కాగా పౌరసత్వ సవరణ చట్టం, ఎన్సార్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో చెలరేగిన అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్ పేరును చార్జిషీట్‌లో చేర్చిన పోలీసులు, సెప్టెంబరు 13న అతడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కుట్రపూరితంగా వ్యవహరించి, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి హింసాత్మక ఘర్షణలకు కారణమయ్యాడని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. (చదవండి: ఢిల్లీ అల్లర్లు: చార్జిషీట్‌లో సల్మాన్ ఖుర్షీద్ పేరు!)
ఈ క్రమంలో ఉగ్రవాద నిరోధక చట్టం, ఉపాతో పాటు రాజద్రోహం, హత్యానేరం, హత్యాయత్నం, రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించడం తదితర తీవ్రమైన నేరాల కింద అతడిపై అభియోగాలు నమోదు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చిన నేపథ్యంలో మైనార్టీల పట్ల ప్రభుత్వ తీరుపై నిరసన తెలియజేసి, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకు ప్రజలను రెచ్చగొట్టాడని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. రెండు వేర్వేరు ప్రదేశాల్లో విద్వేష ప్రసంగాలు పౌరులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేపట్టేలా ప్రేరేపించాడని పేర్కొన్నారు. నిరసనలు హింసాత్మక రూపం దాల్చేలా పెట్రోల్ బాంబులు, ఆసిడ్ బాటిళ్లు, రాళ్లతో దాడి చేసేందుకు కుట్ర పన్నాడని, ఇలాంటి ఎన్నో వస్తువులను సమీప ఇళ్లల్లో నుంచి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. (టైమ్ మ్యాగజీన్: ప్రధాని మోదీతో పాటు ఈ ‘దాదీ’ కూడా..)
ఇక ఈ కేసులో ఉమర్ ఖలీద్‌తో పాటు సహ నిందితుడిగా ఉన్న దానిష్‌కు ప్రజలను పోగు చేయడం, వాళ్లు కొట్టుకునేలా ప్రేరేపించడం వంటి బాధ్యతలు అప్పగించారని పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ క్రమంలో మహిళలు, చిన్నారులతో రోడ్లను దిగ్భంధనం చేయించి, ఫిబ్రవరి 23న జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారని పేర్కొన్నారు. కాగా దేశ వ్యాప్తంగా ప్రకంనపనలు సృష్టించిన ఢిల్లీ అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 200 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో పలువురు ప్రముఖ కార్యకర్తలు, రాజకీయ నాయకులతో పాటు సోషల్ ఆక్టివిస్టుల పేర్లను చేరుస్తూ ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ నమోదు చేసిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment