బిజ్నోర్, వారణాసి: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్‌ఎల్డీ) అభ్యర్థి నీరజ్ చౌదరిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆయన బిజ్నోర్ స్థానం నుంచి బరిలోకి దిగారు. కొన్ని రోజుల క్రితం నీరజ్ ఇంటింటి ప్రచారం కొనసాగిస్తూ ఉండగా ఆయన వెంట ఉన్న కొందరు వ్యక్తులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారని, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని పోలీసులు శనివారం చెప్పారు.
శత్రుదేశానికి అనుకూలంగా నినాదాలు చేసినందుకు గాను నీరజ్ చౌదరితోపాటు మరో 20–25 మందిపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 295ఏతో పాటు పలు సెక్షన్ల కింద గురువారం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అంటువ్యాధుల చట్టం కింద కూడా కేసు పెట్టామన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు. సంబంధిత ఆడియో, వీడియో క్లిప్‌లను క్షుణ్నంగా పరిశీలిస్తామని అన్నారు.
తమ పార్టీ అభ్యర్థిపై దేశద్రోహం కేసు నమోదు చేయడం పట్ల ఆర్‌ఎల్డీ అధినేత జయంత్ చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అకీఫ్ భాయ్ జిందాబాద్ అని నినదించినా కొందరికి పాకిస్తాన్ జిందాబాద్ అన్నట్లుగా వినిపిస్తోందని శనివారం ట్విట్టర్‌లో ఎద్దేవా చేశారు. తప్పుడు వీడియోలు సృష్టించి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైద్యుడు, పెద్దమనిషి అయిన నీరజ్ చౌదరిని ద్రోహిగా చిత్రీకరిస్తుండడం దారుణమని జయంత్ చౌదరి ఆరోపించారు.
కాంగ్రెస్ అభ్యర్థిపై...: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా ప్రసంగించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్‌పై పోలీసులు శనివారం దేశద్రోహం కేసు నమోదు చేశారు. అజయ్ రాయ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి జిల్లాలోని పిండ్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన జనవరి 31న రాజేతరా గ్రామంలో అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదంతా నిజమేనని నిర్ధారించుకున్న పోలీసులు అజయ్ రాయ్‌పై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 269, 153, 153ఏ, 188 కింద కేసు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment