వరంగల్: అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి పాలు తీసుకొచ్చేందుకు బైక్‌పై తన మేనల్లుడితో కలిసి పక్క తండాకు వెళ్లాడు. పాలు తీసుకుని మళ్లీ ఇంటికి పయనమయ్యాడు. ఇంతలోనే మృత్యువులా దూసుకొచ్చిన ట్రాక్టర్ ఇతడి బైక్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అతడి మేనల్లుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని బిచ్చానాయక్‌తండాజీపీ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై రమేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం..
బిచ్చానాయక్‌తండాజీపీ శివారు రాజీవ్‌నగర్‌తండాకు చెందిన జాటోతు బిల్యా, బక్కి దంపతులకు ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు బాలాజీ(25) ఉన్నారు. కుమార్తెల వివాహం చేశారు. కుమారుడు ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ వ్యవసాయ పనులు చేస్తున్నాడు. కాగా, కొద్దిరోజులుగా తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. తల్లి ఆరోగ్యం కోసమని పాలు తెచ్చేందుకు ఎప్పటిలాగే, బాలాజీ బిచ్చానాయక్‌తండాలోని బంధువుల ఇంటికి, తన మేనల్లుడు ఆంగోతు సంతోష్‌తో కలిసి ఉదయాన్నే వెళ్లాడు. పాలు తీసుకుని తిరిగి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు.
రాజీవ్‌నగర్‌తండా సమీపంలో ప్రధానరహదారిపై ట్రాక్టర్, బైక్ పక్కపక్కనుంచే వెళ్తుండగా గుంతరావడంతో ట్రాక్టర్‌ను పక్కకు తిప్పడంతో బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ రోడ్డుపక్కనున్న గుంతలో పడగా, తీవ్రంగా గాయపడిన బాలాజీ అక్కడికక్కడే మృతిచెందాడు. వెనకాల కూర్చున్న సంతోష్‌కు తీవ్రగాయాలు కాగా, 108లో మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇంతలో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహంపై పడి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
హెల్మెట్ ఉంటే బతికేవాడు..
బైక్‌పై వెళ్లే బాలాజీ హెల్మెట్ ధరించి ఉంటే ప్రా ణాలతో బయటపడేవాడని ఎస్సై రమేష్‌బాబు అన్నారు. రోడ్డుప్రమాదంలో తలకు గాయం కావడం వల్లే మృతిచెందాడని, ప్రమాదం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికి తెలియదని, దగ్గర దూరంలో ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment