ఆమె... ఆరుగురు పిల్లల తల్లి. భర్త దుబాయ్ వెళ్లడంతో మరొకనితో సంబంధం పెట్టుకుంది. భర్త తిరిగి వచ్చాక ఎవరూ ఊహించనంతటి ఘోరానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే... బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా లాఢ్‌పుర్ గ్రామంలో చేపల విక్రేత మొహమ్మద్ మియా గత మే22న హత్యకు గురయ్యాడు. పోలీసుల దర్యాప్తులో పలు విస్తుగొలిపే వివరాలు వెల్లడయ్యాయి.ఈ ఉదంతంలో మృతుని భార్య నూర్జహాన్ ఖాతూన్, ఆమె ప్రియుడు నౌషద్ ఆలం నిందితులుగా తేలింది. వీరిద్దరూ సుపారీ కిల్లర్ సాయంతో ఈ హత్య చేయించినట్లు వెల్లడయ్యింది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.7,500 నగదు, ఒక తుపాకీ, 3 బుల్లెట్లు, ఒక మొబైల్ ఫోను, బైకు స్వాధీనం చేసుకున్నారు.
మొహమ్మద్ మియా భార్య నూర్జహాన్ ఖాతూన్..నౌషద్ ఆలంతో వివాహేతర సంబంధం కలిగివుంది. ఇది తెలిసిన మొహమ్మద్ తన భార్యను కొడుతుండేవాడు. ఈ నేపధ్యంలోనే నూర్జహాన్, ఆమె ప్రియుడు నౌషద్ కలిసి, ఇద్దరు సుపారీ కిల్లర్ల సాయంతో మొహమ్మద్ మియాను హత్య చేయించారు. పోలీసులు సుపారీ కిల్లర్ మన్సూర్ ఆలం, పర్వేజ్ ఆలంలను ప్రశ్నించగా ఆరుగురు పిల్లలకు తల్లి అయిన నూర్జహాన్ రూ.50 వేలు తమకు ఇచ్చి, ఆమె భర్త మొహమ్మద్ మియాను హత్య చేయించేందుకు పురిగొల్పిందన్నారు.ఈ సొమ్ములోని రూ. 28 వేలతో ఒక తుపాకీ, 4 బుల్లెట్లు కొనుగోలు చేశామన్నారు.
ఘటన జరిగినరోజు రాత్రి నూర్జహాన్ మొబైల్ ఫోనులో హత్య ఎలా చేయాలో తెలియజేసిందన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చేపల విక్రేత మొహమ్మద్ మియా ఆరోజు ఇంటి బయట మంచంపై పడుకున్నాడు. ఇంతలో అతని భార్య నూర్జహాన్ సుపారీ కిల్లర్లకు ఫోను చేసి హత్యకు పురమాయించింది. కాగా మొహమ్మద్ మియా గతంలో కొంతకాలం దుబాయ్‌లో ఉండి ఇంటికి తిరిగివచ్చాడు.ఈ సమయంలోనే అతని భార్య నూర్జహాన్.. నౌషద్‌తో సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారం గత 21 ఏళ్లుగా సాగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. కాగా నిందితురాలు నూర్జహాన్ పోలీసుల దర్యాప్తులో తన భర్త తనను సరిగా చూడటం లేదని తెలిపింది. తరచూ కొడుతుంటాడని ఆరోపించింది. ఇకపై తాను తన ఆరుగురు పిల్లలతో పాటు తన ప్రియుడు నౌషద్ దగ్గరే ఉంటానని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment