న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కొత్త ఏడాది తొలిరోజే ఓ యువతి దారుణంగా హింసకు గురై ప్రాణాలు కోల్పోయింది. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో తప్పతాగిన ఐదుగురు దుండగులు బాధితురాలి స్కూటర్‌ను ఢీకొట్టడంతో పాటు ఆమెను నాలుగు కిలోమీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. శరీరంపై నూలుపోగు కూడా లేకుండా రోడ్డుపై పడి ఉన్న ఆ యువతి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఈ దారుణ సంఘటన ఢిల్లీ సుల్తాన్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బాధితురాలు ఆదివారం తెల్లవారుజామున తన స్కూటర్‌పై వెళ్తోంది. ఆమె స్కూటర్‌ను ఓ కారు ఢీకొట్టింది. ఈ క్రమంలోనే ఆమె డ్రెస్ కారు టైరులో చిక్కుకుంది. స్కూటర్‌ను ఢీకొట్టినప్పటికీ ఆగకుండా కారును ముందుకు నడిపారు. టైరులో డ్రెస్ చిక్కుకోవడంతో సుమారు 4 కిలోమీటర్లు ఆ బాధితురాలిని ఈడ్చుకెళ్లారు. దీంతో తీవ్రగాయాలపై ఆ యువతి మృతి చెందింది. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా యువతి మృతదేహం కనిపించటం కలకలం సృష్టించింది.
రోడ్డుపై నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహాన్ని చూసి ముందుగా హత్యాచారంగా భావించారు. కానీ, రోడ్డు ప్రమాదం కారణంగా ఆమెను కారు వెనకాల ఈడ్చుకెళ్లడం ద్వారా మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 3.24 గంటలకు రోడ్డుపై మృతదేహం సమచారం అందినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ‘ఓ మహిళ మృతదేహాన్ని బలెనో కారుకు కట్టి ఈడ్చుకెళ్తున్నారని ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. కంఝవాలా పోలీస్ స్టేషన్ బృందం ఈ విషయంపై ఆ కాలర్‌కు తిరిగి పలు మార్లు ఫోన్ చేశారు. ఆ తర్వాత బలెనో కారును ఆ వ్యక్తి గుర్తించాడు.’ అని తెలిపారు.
ఫోన్ రాగానే పోలీసు బృందం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. రోహిణి జిల్లా క్రైమ్ టీం సైతం అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఎస్‌జీఎం ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆ తర్వాత కారును పట్టుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలోనే సుల్తాన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్ జరిగినట్లు వారు తెలిపారు.
మహిళా కమిషన్ నోటీసులు
యువతిని ఈడ్చుకెళ్లి మృతి చెందేందుకు కారణమైన ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కేసులో నిజానిజాలు తేల్చి పూర్తి వివరాలు సమర్పించాలని ఢిల్లీ పోలీసులకు నోటీసులు ఇచ్చారు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ శ్వాతి మాలివాల్. ‘ఢిల్లీ కంఘావాలా ప్రాంతంలో ఓ యువతి మృతదేహం నగ్నంగా పడి ఉంది. కొందరు యువకులు తప్పతాగి ఆమె స్కూటర్‌ను ఢీకొట్టడంతో పాటు ఆమెను పలు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. ఈ సంఘటన చాలా ప్రమాదకరమైనది. ఢిల్లీ పోలీసులకు సమన్లు జారీ చేస్తున్నా.’అని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: చైనాలో తమిళనాడు యువకుడు మృతి.. సాయం కోసం కుటుంబం వేడుకోలు
Comments
Please login to add a commentAdd a comment