అమరచింత (కొత్తకోట): పట్టణ సమీపంలోని కొత్తతండా శివారులో ఉన్న పత్తి పొలంలో బుధవారం ఓ యువతి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు..తండా సమీపంలోని చిన్న కుర్మన్న పొలాన్ని పట్టణంలోని శ్రీకృష్ణానగర్‌కు చెందిన కతలన్న కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. వారం రోజుల క్రితం పత్తి తీసిన రైతు బుధవారం మరోమారు పత్తిని ఏరుతుండగా పరిసరాల నుంచి దుర్వాసన వచ్చింది. పరిశీలించగా ఓ గుర్తు తెలియని యువతి మృతదేహం కనిపించడంతో ఆందోళన చెంది వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు అధికసంఖ్యలో సంఘటన స్థలానికి తరలివచ్చారు. డీఎస్పీ కిరణ్‌కుమార్ అక్కడికి చేరుకొని జాగిలాలతో అన్వేషణ చేపట్టారు. సీఐ సీతయ్య, ఎస్‌ఐతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వారం క్రితమే యువతిని హతమార్చి ఉండవచ్చని ప్రాథమిక నిర్ధారణకు వచ్చామన్నారు. మృతిచెందిన యువతి వయస్సు 18 నుంచి 20 ఏళ్లలోపు ఉంటుందని.. పెట్రోల్ పోసి నిప్పంటించి ఉండవచ్చన్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉందని.. అన్ని మండలాల పోలీస్‌స్టేషన్లకు సమాచారమిచ్చామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment