పూలు విలవిలలాడేనని..
● సగానికి పైగా తగ్గిన ధరలు
● మరోవైపు గణనీయంగా దిగుబడి
● రేటు లేక తోటల్లోనే వదిలేస్తున్న రైతులు
● ఉపాధి దొరకక కూలీలు,
మహిళలకు ఇబ్బందులు
పెరవలి: కొద్ది రోజులుగా మార్కెట్లో పూల ధరలు పడిపోవటంతో రైతులు విలవిలలాడుతున్నారు. మరోవైపు పూలకోత కూలీలు ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో కడియపులంక తరువాత చెప్పుకోదగిన కాకరపర్రు పూల మార్కెట్టు నేడు పూలు కొనేవారు లేక కళావిహీనంగా కనిపిస్తోంది. ప్రస్తుతం శుభ ముహూర్తాలు, పండగలు లేకపోవటంతో పూల వినియోగం తక్కువగా ఉందని, అందువల్లనే ధరలు తగ్గాయని చెబుతున్నారు. ప్రస్తుతం దిగుబడి ఉన్నా తగినంత ధర లేక రైతులు.. ఉపాధి దొరకక కూలీలు.. అమ్మకాలు లేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో, నిత్యం కళకళలాడుతూ కనిపించే కాకరపర్రు పూల మార్కెట్టు నేడు వెలవెలబోతోంది.
దిగులు పెంచిన దిగుబడి
జిల్లావ్యాప్తంగా 4,897 ఎకరాల్లో రైతులు పూల సాగు చేస్తున్నారు. దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. కొద్ది రోజులుగా వాతావరణం చల్లగా, అనుకూలంగా ఉండటంతో పూల దిగుబడి గణనీయంగా పెరిగింది. సాధారణంగా ఎకరానికి, కోతకు సుమారు 300 కేజీల బంతిపూల దిగుబడి వస్తూంటుంది. అటువంటిది ప్రస్తుతం 400 కేజీల వరకూ వస్తోంది. అలాగే, చామంతి పూలు కూడా సాధారణంగా 100 కేజీల లోపు వస్తూంటుంది. ప్రస్తుతం ఇది 125 నుంచి 150 కేజీల వరకూ వస్తోంది. ఈవిధంగా దిగుబడి పెరిగిన తరుణంలో రైతులు, వ్యాపారులు ఆనందంగా ఉండాలి. కానీ, సరిగ్గా ఇదే సమయంలో సంక్రాంతితో పండగలన్నీ ముగిసిపోవడం.. శుభముహూర్తాలు లేకపోవడంతో ప్రస్తుతం పెద్ద మొత్తంలో పూలు కొనేవారే లేకుండా పోయారు. నిత్య పూజలు, ఇతర చిన్న చిన్న అవసరాలకు తప్ప చాలా మంది పూలు కొనడం లేదు. దీంతో వాటి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. మామూలుగా వారానికి రెండు కోతలు కోయాల్సి ఉండగా.. నేడు ధర లేకపోవడంతో ఒక్క కోతతోనే సరిపెడుతున్నామని రైతులు చెబుతున్నారు. కోత కోయిస్తే కనీసం కూలి ఖర్చులు కూడా రావడం లేదని, కోత కోసి నష్టపోయేకంటే కోయకుండా వదలివేయడమే మేలని పలువురు రైతులు భావిస్తున్నారు.
ధరలు పడిపోయాయిలా..
ఇరవై రోజుల క్రితం కిలో చామంతి, జాజుల ధర రూ.300 పలికింది. నేడు పూల నాణ్యతను బట్టి కిలో రూ.60 నుంచి రూ.120కి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అవి కూడా వ్యాపారుల వద్ద రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉండిపోతున్న పరిస్థితి. అప్పటికీ అమ్ముడుపోకపోతే పూలు పాడైపోవడంతో గత్యంతరం లేక వాటిని నాలుగో రోజున రోడ్ల పక్కన పారబోస్తున్నామని వ్యాపారులు వాపోతున్నారు. పూల మాలలు అల్లించడం, గ్రేడింగ్ వంటి పనులు చేయిద్దామన్నా కనీస కూలి ఖర్చులు కూడా రావడం లేదని చిరు వ్యాపారులు వాపోతున్నారు.
కూలి ఖర్చులు కూడా రాక..
ధరలు తగ్గటంతో రైతులు కోతలు కోయించకుండా పూలను చేలల్లో వదిలేస్తున్నారు. గతంలో ప్రతి రోజూ పది మంది కూలీలతో పూల కోతలు కోయించే రైతులు నేడు వారానికి ఒక్కసారి మాత్రమే కోత కోయిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎకరా బంతి పూల తోటలో ఒక్క కోతకు 10 మంది కూలీలు అవసరమవుతారు. వీరికి రోజుకు రూ.350 కూలి ఇవ్వాలి. మార్కెట్లో కిలో పూల ధర రూ.40 పలుకుతోంది. ఒక విడతకు సుమారు 100 కిలోలు కోయిస్తే కూలీలకు రూ.3,500, కాఫీ, టిఫిన్లు, సంచులు, రవాణా కలిపి రూ.1,000 ఖర్చు అవుతుంది. ఈ లెక్కన 100 కిలోల బంతిపూలకు రూ.4 వేల రాబడి వస్తే.. ఖర్చు రూ.4,500 అవుతోంది. ఇతర పూల పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంటోంది. దీంతో, చేతి ఖర్చు అదనంగా పడుతూండటంతో కోత కోయించకుండా వదిలేస్తున్నామని రైతులు వాపోతున్నారు. పూల కోత కోసే కూలీలకు ప్రస్తుతం వారానికి ఒక్క రోజు మాత్రమే పని లభిస్తోంది.
పూల ధరలు పడిపోయాయిలా.. (కిలోకు రూ.లలో)
పూల రకం 20 రోజుల క్రితం ప్రస్తుతం
బంతి 80.00–120.00 40.00
చామంతి 300.00 60.00–80.00
జాజులు 350.00 150.00
కనకంబరాలు 1,000.00 500.00
మల్లెలు 1,000.00 500.00
గులాబీలు 350.00 150.00
Comments
Please login to add a commentAdd a comment