లక్ష్యసాధనలో పట్టునాయక్‌ | - | Sakshi
Sakshi News home page

లక్ష్యసాధనలో పట్టునాయక్‌

Published Wed, May 24 2023 8:38 AM | Last Updated on Wed, May 24 2023 8:37 AM

తల్లిదండ్రులు శారదా రాజ్యలక్ష్మి, రవికుమార్‌ పట్నాయక్‌తో తరుణ్‌ పట్నాయక్‌  - Sakshi

తల్లిదండ్రులు శారదా రాజ్యలక్ష్మి, రవికుమార్‌ పట్నాయక్‌తో తరుణ్‌ పట్నాయక్‌

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): పట్టుదల, ప్రణాళిక ఉంటే ఏదైనా సాధించవచ్చునని తరుణ్‌ పట్నాయక్‌ నిరూపించాడు. తొలి ప్రయత్నంలో సివిల్స్‌లో 99వ ర్యాంకు సాధించి ఉద్యోగం పొందినా దాంతో సంతృప్తి పడకుండా రెండోసారి పట్టుదలగా ప్రయత్నించి 33వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా తన కలను సాకారం చేసుకున్నాడు. సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పాఠశాల స్థాయి నుంచి రాణిస్తూ ఐఏఎస్‌కు ఎంపికయ్యాడు. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో 33వ ర్యాంకు సాధించాడీ రాజమహేంద్రవరం యువకుడు.

స్వశక్తితో.. పక్కా ప్రణాళికతో..
చదువులో రాణిస్తూ..గౌహతి ఐఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి, కోచింగ్‌ సెంటర్లను ఆశ్రయించకుండా స్వశక్తితో పక్కా ప్రణాళికతో చదువుకున్నాడు. రాజమహేంద్రవరం మోడల్‌ కాలనీకి చెందిన తరుణ్‌ పట్నాయక్‌ తండ్రి రవికుమార్‌ పట్నాయక్‌ ఎల్‌ఐసీ రాజమహేంద్రవరం రూరల్‌ బ్రాంచిలో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. తల్లి శారదారాజ్యలక్ష్మి పట్నాయక్‌ గృహిణి. ఏకై క సంతానమైన తరుణ్‌ పట్నాయక్‌ను చిన్నతనం నుంచే అతను ఏ లక్ష్యం వైపు అడుగు వేసినా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. దీంతో తరుణ్‌ ఐఐటీ చదివి ఐఏఎస్‌ కావాలన్న తన లక్ష్యాన్ని సాధించగలిగాడు.

1999 జనవరి 12వ తేదీన జన్మించిన తరుణ్‌ పట్నాయక్‌ ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు జస్వర్‌ స్కూల్లోను, 6వ నుంచి 10వ తరగతి వరకు కేకేఆర్‌ గౌతమ్‌స్కూల్లో, ఇంటర్‌ శ్రీచైతన్యలోను, గౌహతిలో ఐఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ 2020లో పూర్తిచేశాడు. అప్పటి నుంచి కోచింగ్‌ సెంటర్లను ఆశ్రయించకుండా సివిల్స్‌ స్వయంశక్తితో చదివాడు. గంటల తరబడి కాకుండా సిలబస్‌ ప్రకారం చదవడంతో పాటు ప్రాక్టీస్‌ చేసేవాడు. 2021 సివిల్స్‌ తుది ఫలితాల్లో 99వ ర్యాంకు సాధించి సిమ్లాలోని ఇండియన్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్‌లో ట్రైనింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడితో ఆగకుండా మళ్లీ తన లక్ష్యాన్ని సాధించేందుకు 2022 సివిల్స్‌కు మరింతగా కష్టపడి చదవడంతో పాటు ప్రాక్టీస్‌ చేయడంతో తుదిఫలితాల్లో 33వర్యాంకు సాధించి తన ఐఏఎస్‌ కలను సాకారం చేసుకున్నాడు.

 సిలబస్‌ ప్రకారం చదివా...
గంటల తరబడి కాకుండా సిలబస్‌ను డివైడ్‌ చేసుకుని చదివాను. చదవడంతోపాటు ప్రాక్టీస్‌ ఎక్కువగా చేశాను. తొలివిడతలో ఆరు మార్కుల తేడాలో 99వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌ సాధించలేకపోయా. ఈసారి ఎలాగైనా ఐఏఎస్‌ సాధించాలన్న లక్ష్యంతో పక్కా ప్రణాళికతో చదవడంతో పాటు, ప్రాక్టీస్‌ చేయడంతో 33వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌ కావడం చాలా ఆనందంగా ఉంది. ఐఏఎస్‌ కావడానికి తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. సిలబస్‌ను ఇష్టపడి చదవడంతో పాటు, ప్రాక్టీస్‌ చేస్తే ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని సాధించవచ్చు. ఐఏఎస్‌ కావడంతో ప్రజలకు సేవచేసే అవకాశం దక్కింది.

– తరుణ్‌ పట్నాయక్‌, 33వ ర్యాంకు, సివిల్స్‌, రాజమహేంద్రవరం

జక్కంపూడి అభినందనలు
సివిల్స్‌ 33వ ర్యాంకు సాధించిన తరుణ పట్నాయక్‌కు రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరానికి ఎంతో ఘన చరిత్ర ఉందని, వివిధ రంగాల్లో ఎందరు ప్రముఖులు ఉన్నారని, తరుణ్‌ పట్నాయక్‌ సివిల్స్‌లో 33వ ర్యాంకు సాధించి ఆ కీర్తి మరింత పెంచాడని అన్నారు. తరుణ్‌ తండ్రి రవికుమార్‌ పట్నాయక్‌ శ్రీ జక్కంపూడి రామ్మోహన్‌రావు ఫౌండేషన్‌ ట్రస్టీ సభ్యులుగా విశేషమైన సేవలందిస్తున్నారని రాజా ప్రశంసించారు.

చాలా ఆనందంగా ఉంది
నా కుమారుడు తరుణ్‌ పట్నాయక్‌ సివిల్స్‌లో 33వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. అతి సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన నేను ఎల్‌ఐసీలో క్లర్క్‌గా పనిచేస్తూ కుమారుడిని చదివించా. తరుణ్‌ చిన్నతనం నుంచే ఐఐటీ చదివి ఐఏఎస్‌ కావాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాడు. తన లక్ష్యాన్ని తల్లిదండ్రులుగా ప్రోత్సహించాం. తొలివిడతలో రాకపోయినా రెండో విడతలో ఐఏఎస్‌ సాధించడంతో మా సంతోషానికి అవధులు లేవు.
–రవికుమార్‌ పట్నాయక్‌, తరుణ్‌ తండ్రి, రాజమహేంద్రవరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement