విలేకరులతో మాట్లాడుతున్న ఎంపీ భరత్‌రామ్
రాజమహేంద్రవరం రూరల్: స్కీవవముల పేరుతో భారీ స్కాములు చేసి అడ్డంగా దొరికిపోయి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లిన చంద్రబాబుకు తనను విమర్శించే అర్హత లేదని ఎంపీ, వైఎస్సార్ సీపీ సిటీ కో ఆర్డినేటర్ మార్గాని భరత్‌రామ్ ధ్వజమెత్తారు. కాతేరు సభలో చంద్రబాబు తనపై చేసిన ఆరోపణల్లో ఒక్కటైనా నిరూపించగలరా అని సవాల్ విసరారు. సోమవారం రాత్రి ఎంపీ భరత్‌రామ్ విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండించారు. తాను నీతిగా, నిజాయితీగా సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, చంద్రబాబు, టీడీపీ నాయకుల్లా రాజకీయాలను అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించడానికి కాదని అన్నారు.
రాజమహేంద్రవరంలో మీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వడ్డీ వ్యాపారాలు, చీట్ల వ్యాపారాలు చేసి అడ్డంగా దొరికి, సెంట్రల్ జైలులో ఉండి వచ్చారని అన్నారు. ‘ఆవ భూముల్లో నాకు రూ.150 కోట్లు ఎవరిచ్చారు? దానిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అని చాలెంజ్ విసిరారు. ‘వైఎస్సార్ ఆసరా పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని 80 లక్షల మంది మహిళలకు రూ.25 వేల కోట్లు ఇచ్చారు, నువ్వు ఇవ్వగలవా?’ అని ప్రశ్నించారు. దమ్ముంటే తనపై చంద్రబాబు కుమారుడు లోకేష్‌ను పోటీకి దింపాలని సవాల్ విసిరారు.
మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు అంటున్నారని, ఆ స్కీమ్ జన్మభూమి కమిటీలకు, టీడీపీ కార్యకర్తలకు తప్పిస్తే రాష్ట్రంలోని అర్హులైన వారికి కాదనే సంగతి అందరికీ తెలుసునని అన్నారు. స్కిల్ స్కామ్, ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇన్‌సైడర్ ట్రేడింగ్, పోలవరం ప్రాజెక్టు నిధుల స్వాహా.. ఇలా ప్రజాధనాన్ని లూటీ చేసిన చంద్రబాబుకు తనను విమర్శించే అర్హత లేదని అన్నారు. రాజమహేంద్రవరాన్ని రెండున్నరేళ్లలో ఎలా అభివృద్ధి చేశానో చూడాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment