కొవ్వూరులో ముప్పిడి పరిచయ సభకు జవహర్ వర్గీయుల డుమ్మా
పత్తా లేని బీజేపీ, జనసేన నాయకులు
కానరాని టీడీపీ ఆశావహులు
కొవ్వూరు: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు కొవ్వూరులో ఆదిలోనే హంసపాదు ఎదురైంది. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన పరిచయ కార్యక్రమం నిర్వహించారు. దీనికి బీజేపీ, జనసేన నేతలతో పాటు మాజీ మంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేఎస్ జవహర్ వర్గీయులు, టీడీపీ ఆశావహులు డుమ్మా కొట్టారు. తద్వారా రానున్న ఎన్నికల్లో ముప్పిడికి సహకరించేది లేదని చెప్పకనే చెప్పారు. మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కొవ్వూరు నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న వెంకటేశ్వరరావు నిర్వహించిన మొదటి సభలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి టీవీ రామారావుతో పాటు బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఇతర ముఖ్య నాయకులు, టీడీపీ ఆశావహులు పత్తా లేకపోవడం చర్చనీయాంశమైంది.
వెంకటేశ్వరరావు తన ప్రసంగంలో మూడు పార్టీలు అంటూ పదేపదే ప్రస్తావించినప్పటికీ ఈ సభకు టీడీపీలోని కొంత మంది నాయకులు మాత్రమే హాజరు కావడం ఆ పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. ఇప్పటికే తాను పోటీలో ఉంటానని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ప్రకటించడం, ఆయనకు పార్టీ ఆశావహులు జత కలవడం టీడీపీని కలవరపరుస్తోంది. ఈ ఎన్నికల్లో కొవ్వూరు నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న తలారి వెంకట్రావు ప్రస్తుతం గోపాలపురం ఎమ్మెల్యే కూడా.
గత ఎన్నికల్లో ఆయన చేతిలో ముప్పిడి 36 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అటువంటి అభ్యర్థిని తిరిగి కొవ్వూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా అది కూడా తలారి వెంకట్రావు పైనే పోటీకి దింపడమేమిటంటూ టీడీపీ శ్రేణులు తల పట్టుకుంటున్నాయి. తాజా పరిణామాలతో ఆ పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. వైఎస్సార్ సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు ఇప్పటికే ఇంటింటి ప్రచారంతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనాన్ని ఎదుర్కోవడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment