చంద్రబాబుకు దొంగ హామీలు పరిపాటే.. | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు దొంగ హామీలు పరిపాటే..

Published Wed, Jan 29 2025 12:17 AM | Last Updated on Wed, Jan 29 2025 11:04 AM

-

2019లో జగన్‌కు ఖాళీ ఖజానా ఇచ్చారు

అయినా సంక్షేమ పథకాల అమలులో ఆయనదే అగ్రస్థానం

చంద్రబాబు ఒక్క పథకమూ అమలు చేయలేదు

ఆయనో ఫెయిల్యూర్‌ సీఎం

అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌

రాజమహేంద్రవరం సిటీ: ఎన్నికల్లో దొంగ హామీలు ఇవ్వడం, గద్దెనెక్కిన తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పనీ చేయలేనని చేతులెత్తేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపాటని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ విమర్శించారు. ఇటువంటి ఫెయిల్యూర్‌ సీఎం దేశంలోనే ఎక్కడా లేరని దుయ్యబట్టారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయన మీడియాకు వీడియో విడుదల చేశారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు అధికారంలోకి రావడానికి దొంగ హామీలివ్వడం పరిపాటిగా వస్తోందని గుర్తు చేశారు. 

రాష్ట్రం విడిపోయినప్పుడు వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రుణ మాఫీ చేయలేనని కచ్చితంగా చెప్తే.. తాను అమలు చేస్తానంటూ ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘనుడు చంద్రబాబని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో ఆ ఒక్క కారణంతోనే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత 2014–19 మధ్య దేశంలో పూర్తి స్థాయి ఫెయిల్యూర్‌ ముఖ్యమంత్రిగా నిలిచిపోయారన్నారు. ఆయన హయాంలో ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్‌ రాలేదని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపలేకపోయారని ధ్వజమెత్తారు.

నాటి చంద్రబాబు ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి, 2019లో విజయం సాధించిన అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు అప్పగించారని హర్షకుమార్‌ గుర్తు చేశారు. నాటి ఎన్నికల సమయంలో రూ.23 వేల కోట్ల నిధుల్ని పసుపు – కుంకుమ పేరిట మహిళలకు పంచి పెట్టేశారన్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని మరీ గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాలు అమలు చేసి, అగ్రస్థానాన నిలిచారని కితాబు ఇచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు చేయలేనంటున్న పథకాలను నాడు జగన్‌ అమలు చేసి చూపించారన్నారు. 

కూటమి ప్రభుత్వం పాలన చేపట్టి 8 నెలలు కావస్తున్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, సూపర్‌ సిక్స్‌ హామీలను గాలికొదిలేశారని విమర్శించారు. అమ్మకు వందనం, నిరుద్యోగ భృతి, మహిళలకు ఇస్తానన్న డబ్బులు, ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌, ఉచిత బస్సు పథకాల జాడ లేదన్నారు. చేతకాని ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయారని దుయ్యబట్టారు. ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని ఇప్పటి వరకూ ఎక్కడా చూడలేదని ధ్వజమెత్తారు. 

ప్రజలను మోసగించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు.. సంక్షేమ పథకాలను నాటి సీఎం జగన్‌ ఏవిధంగా అమలు చేశారనే విషయాన్ని ఇప్పటికై నా ఆలోచించాలని హితవు పలికారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేని చంద్రబాబు.. కొత్త ప్రాజెక్టులు కట్టేందుకు అప్పుల కోసం సిద్ధం కావడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసే పద్ధతిని చంద్రబాబు ఇప్పటికై నా మార్చుకోవాలని హర్షకుమార్‌ డిమాండ్‌ చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement