పూల రైతుల పల్లెబాట
పెరవలి: శుభ ముహూర్తాలు, పండగలు ముగిసిపోవడం.. మరోవైపు దిగుబడి ఇబ్బడిముబ్బడిగా వస్తూండటంతో.. ధరలు పడిపోయి పూల రైతులు విలవిలలాడుతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కొంత మంది పూల రైతులు పల్లె బాట పడుతున్నారు. ఊరూరా తిరుగుతూ, పూలు అమ్ముకుంటూ.. ఎంతో కొంత ఆర్జించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంత మంది సైకిళ్లు, మోటార్ సైకిళ్లపై ఈవిధంగా విక్రయిస్తూండగా.. మరి కొంత మంది ఆటోలో పూలు అమ్ముకుంటూ.. కొంతలో కొంత నష్టాన్ని భర్తీ చేసుకుంటున్నారు. ‘పూలనే నమ్మి సాగు చేశాం. కానీ మార్కెట్లో ధరలు నానాటికీ పడిపోతూండటంతో అయినకాడికి పూలు అమ్మేసుకుంటున్నాం. కోత ఖర్చులైనా వస్తాయనే ఉద్దేశంతో గ్రామాల్లో తిరిగి అమ్ముకుంటున్నాం’ అని పూల సాగుకు, మార్కెట్కు ప్రసిద్ధి చెందిన కడియపులంక గ్రామానికి చెందిన పూలరైతు బి.సురేష్ అన్నారు. పెరవలి మండలం అన్నవరప్పాడులో మంగళవారం ఆటోలో వచ్చి ఆయన పూలు విక్రయించారు. కడియపులంక గ్రామానికి చెందిన సురేష్ కుటుంబమంతా పూల సాగు పైనే జీవిస్తున్నారు. కొన్ని రోజులుగా నేల చూపులు చూస్తున్న పూల ధరలు సోమవారం సాయంత్రానికి మరింతగా పడిపోయాయి. దీంతో పూల రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ‘ప్రస్తుతం కిలో చామంతి పూలకు రూ.20 నుంచి రూ.25 మాత్రమే వస్తోంది. నేను 300 కిలోల పూలు కోశాను. మార్కెట్లో అమ్ముకుంటే కోత ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. దీంతో గ్రామాల్లో అమ్ముకుంటే ఖర్చులైనా వస్తాయనే ధీమాతో ఆటోలో పూలు కిలో రూ.40 చొప్పున అమ్ముకుంటున్నాను. ఇలా వచ్చిన రెండు గంటల్లోనే పూలన్నీ అమ్ముడైపోయాయి. దీనివలన కోత ఖర్చులు, ప్రయాణపు ఖర్చులు పోను మరో రూ.500 మిగిలాయి’ అని సురేష్ చెప్పారు. ధరలు ఈవిధంగా పడిపోతే పూల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment