డ్రోన్లతో కషాయాల పిచికారీ
పెరవలి: ప్రకృతి సాగు విధానంలో పండిస్తున్న వరి పైరుపై డ్రోన్లతో కషాయాలు పిచికారీ చేస్తున్నామని సేంద్రియ వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ సాకా రామకృష్ణ తెలిపారు. మండలంలోని కాపవరంలో వరి చేలపై మంగళవారం డ్రోన్‌తో కషాయాల పిచికారీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి మండలంలోను 250 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసే చేలపై 6 డ్రోన్లతో ప్రణాళిక ప్రకారం కషాయాలు పిచికారీ చేస్తున్నామని చెప్పారు. పెరవలి మండలంలో మొదటి విడతగా 650 ఎకరాల్లో పిచికారీ చేయాలని నిర్ణయించామని, ఇప్పటి వరకూ ముక్కామల, పెరవలి, ఉసులుమర్రు గ్రామాల్లో 106 ఎకరాల్లో డ్రోన్లతో పిచికారీ చేశామని తెలిపారు. దీని ద్వారా వరిపై తెగుళ్లను అరికట్టవచ్చన్నారు. వరిపై వేప గింజల పొడి, ఇంగువ, చేప బెల్లం ద్రావణం పిచికారీ చేయటం వలన కాండం తొలుచు, రసం పీల్చే పురుగుల నివారణ జరుగుతుందన్నారు. బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, వావిల కషాయాలను జీవామృతంతో పిచికారీ చేయటం వలన ఎటువంటి తెగుళ్లనైనా నివారించవచ్చని వివరించారు. డివిజన్ మోడల్ మేకర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ఈ కషాయాలు ప్రకృతి షాపుల్లో దొరకుతాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment