జిల్లాకు మరో ఫైర్ స్టేషన్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో మరో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు కానుంది. దీనికి ఇప్పటికే ఆమోద ముద్ర పడిందని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మార్టిన్ లూథర్ కింగ్ మంగళవారం తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వెలుగుబంద ప్రాంతంలో ఈ ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే, ఫైర్ ఇంజన్ రాకపోకలకు ఆ ప్రాంతం భౌగోళికంగా అనుకూలంగా లేకపోవడంతో ఆ ప్రతిపాదనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం గ్రామీణ ప్రాంతాలతో పాటు జాతీయ రహదారిలోని అన్ని ప్రాంతాల ప్రజలకూ అందుబాటులో ఉండేలా.. అలాగే హైవేపై ప్రమాదాలు జరిగితే సంఘటన స్థలానికి వేగంగా చేరుకునేలా దివాన్‌చెరువు లేదా రాజానగరం ప్రాంతాల్లో హైవే పక్కన కొత్త ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నామని లూథర్ కింగ్ వివరించారు. ప్రస్తుతం వెలుగుబంద, చుట్టుపక్కల గ్రామాల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే రాజమహేంద్రవరం నగరం నుంచి ఫైర్ ఇంజిన్ వెళ్తోంది. ఈ క్రమంలో ట్రాఫిక్ రద్దీని తప్పించుకుని సంఘటన స్థలానికి చేరుకోవడంలో జాప్యం జరుగుతోంది. కొత్తగా ఏర్పాటు చేసే ఫైర్ స్టేషన్ వల్ల సంఘటన స్థలానికి వేగంగా చేరుకుని ఆస్తి, ప్రాణ నష్టాలు తగ్గించవచ్చని లూథర్‌కింగ్ చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకూ రాజమహేంద్రవరం, కోరుకొండ, అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు ప్రాంతాల్లో ఐదు ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. కొత్తగా హైవేలో ఏర్పాటు చేసే ఫైర్ స్టేషన్‌తో ఈ సంఖ్య ఆరుకు చేరుకోనుంది. స్ధల సేకరణ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించి, మార్చిలోగా కొత్త ఫైర్ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకు రానున్నామని, ఈ స్టేషన్‌లో ఒక ఫైర్ ఇంజన్‌తో పాటు ఆరుగురు సిబ్బంది పని చేస్తారని లూథర్‌కింగ్ చెప్పారు.
హైవే లైన్‌గా సేవలు
Comments
Please login to add a commentAdd a comment