కాకినాడ సిటీ: ఆడ శిశువు పట్ల వివక్షతో జరిగే భ్రూణ హత్యలను నివారించడంతో పాటు డివిజన్ స్థాయిలో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జె.నరసింహనాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, లీగల్, సీ్త్ర శిశు సంక్షేమం, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి డిస్ట్రిక్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ, డిస్టిక్ లెవెల్ అడ్వైజరీ కమిటీ, జిల్లా స్థాయి పీసీ, పీఎన్‌డీటీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గర్భస్థ పిండ ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించిన పరీక్షలను లింగ నిర్ధారణకు దుర్వినియోగం కాకుండా అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టామన్నారు. అల్ట్రా సౌండ్ వైద్య పరీక్షలు లింగ నిర్ధారణకు ఉపయోగించుకోవడం చట్ట రీత్యా నేరమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకొంటామన్నారు. జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన 157 స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్లు, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ నెల నుంచి జనవరి వరకు 38 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించగా 316 స్కానింగ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. డీఎల్‌ఏటివో డాక్టర్ రమేష్, డీఐవో డాక్టర్ కేవీ సుబ్బరాజు, వైద్యాధికారులు ఎస్.స్వప్న, పి.సరిత, పి.ఈశ్వరుడు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, హెచ్‌వోడీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment