మహిమాన్విత క్షేత్రం అంతర్వేది
● 4 నుంచి నరసన్న కల్యాణోత్సవాలు
● 13వ తేదీ వరకు తొమ్మిది రోజులు సందడి
సఖినేటిపల్లి: మహిమాన్వితమైనది అంతర్వేది లక్ష్మీనృసింహుని క్షేత్రం. ఆంధ్ర రాష్ట్రంలో విరాజిల్లుతున్న నారసింహక్షేత్రాల్లో ఈ క్షేత్రం పురాణ ప్రసిద్ధి చెంది, చారిత్రకత ప్రాధాన్యతను సంతరించుకుంది. దక్షిణ కాశీగా పేరొందిన ఈ క్షేత్రంలో లక్ష్మీనృసింహస్వామి శిలారూపంలో పశ్చిమ ముఖంగా అవతరించడం విశేషం. కృతయుగ ఆరంభంలో సృష్టికర్త బ్రహ్మ రుద్రయాగం చేయడానికి నిర్ణయించి, ఆ యాగ వేదికగా సాగరసంగమం తీరమైన అంతర్వేది గ్రామాన్ని ఎంపిక చేసినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. యాగరక్షణకు నీలకంఠేశ్వరుడిని ప్రాణప్రతిష్ఠ చేసి, యాగం పూర్తి చేశారు. బ్రహ్మయాగ వేదికగా ఉన్న ఈ గ్రామానికి తొలుత అంతర్వేదికగా పేరొచ్చింది. కాలక్రమంలో అది అంతర్వేదిగా స్థిరపడింది. నీలకంఠేశ్వరుడు క్షేత్ర పాలకునిగా కొలువుదీరినది అంతర్వేది. ఏటా మాఘమాసంలో శుద్ధ సప్తమి(రథసప్తమి)నుంచి తొమ్మిది రోజుల పాటు క్షేత్రంలో లక్ష్మీనృసింహుని దివ్య తిరుకల్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారు.
అత్యంత ప్రధాన ఘట్టాలు
ఫిబ్రవరి 4నుంచి 13వ తేదీ వరకూ నిర్వహించే స్వామి వారి వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టాల్లో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని సేవించుకుంటారు. ఉత్సవాలు ప్రారంభం రోజు 04వ తేదీ రథసప్తమి పర్వదినం. ఆ రోజు స్వామి సూర్యవాహనంపైన, చంద్రప్రభ వాహనంపైన అర్చకులు గ్రామోత్సవం నిర్వహిస్తారు. తదనంతరం ధూపసేవ పిమ్మట శ్రీస్వామివారిని పెండ్లి కుమారుని, అమ్మవారిని పెండ్లి కుమార్తె చేసే ఘట్టం ముద్రికాలంకరణ నిర్వహిస్తారు. 7వ తేదీ దశమి తిధి నాడు పంచముఖ ఆంజనేయస్వామి వాహనం, కంచుగరుడ వాహనంపైన స్వామి గ్రామోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 12–55 గంటలకు మృగశిరా నక్షత్రయుక్త వృశ్చిక లగ్న పుష్కరాంశంలో కనులపండువగా శ్రీస్వామివారి తిరు కల్యాణం నిర్వహిస్తారు. కల్యాణం మరునాడు 8వ తేదీ భీష్మ ఏకాదశి రోజు మధ్యా హ్నం 2–05 గంటలకు రథోత్సాన్ని నిర్వహిస్తారు. 12వ తేదీ మాఘ పౌర్ణమి రోజున చక్రవారి సముద్ర స్నానం ఘట్టం నిర్వహిస్తారు. స్వామితో అసంఖ్యాకమైన భక్తులు సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. 13వ తేదీ అంతర్వేదిలో హంసవాహనంపై శ్రీస్వామి, అమ్మవార్ల తెప్పోత్స వం నిర్వహిస్తారు. రాత్రి ఉత్సవరులకు తిరుమంజనములు, దర్పణసేవ, ధూపసేవ, ద్వాదశ తిరువారాధన, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, శ్రీపుష్పోత్సవం, చెంగోలం విన్నపం, తీర్థగోష్టి, శ్రీస్వామివారి పవళింపు సేవ నిర్వహించడంతో ఉత్సవాలు పూర్తవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment