ధరణి దద్దరిల్లింది! | - | Sakshi
Sakshi News home page

ధరణి దద్దరిల్లింది!

Published Sat, Feb 1 2025 12:27 AM | Last Updated on Sat, Feb 1 2025 12:27 AM

ధరణి

ధరణి దద్దరిల్లింది!

జిల్లాలో భూముల

ధరల పెంపు ఇలా...

రిజిస్ట్రేషన్‌ గతంలో ప్రస్తుతం

కార్యాలయం ధర (శాతం) (శాతం)

బిక్కవోలు 13 23

అనపర్తి 10 22

కడియం 2 10

కోరుకొండ 10 20

రాజమహేంద్రవరం 5 21

సీతానగరం 10 23

పిడింగొయ్యి 4 12

అనపర్తి 5 20

నిడదవోలు 6 20

కొవ్వూరు 4 20

రాజానగరం 7 25

వేగేశ్వరపురం 10 14

సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం అనుకున్న విధంగానే మరోసారి ప్రజల నెత్తిన భారం మోపింది. ఇప్పటికే విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజల ఆగ్రహానికి గురైన సర్కారు శనివారం నుంచి భూముల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నెల రోజులుగా నాన్చుతూ వచ్చిన భూముల పెంపు వ్యవహారానికి ఎట్టకేలకు తెర దించింది. గత నెలలోనే పెంచాలని భావించినా.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో వాయిదా వేసింది. తాజాగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సైతం పెంచిన ధరలతో రిజిస్ట్రేషన్లు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న మార్కెట్‌ విలువలు, నిర్మాణ విలువలు సవరణ చేశారు.

సవరణ ఇలా..

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నవీకరించి ప్రతిపాదించిన భూముల రిజిస్ట్రేషన్‌ విలువను అమలు చేయనున్నారు. రెండు విడతల ధరల సవరణ అనంతరం అధికారులు సిద్ధం చేసిన తుది ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న మార్కెట్‌ విలువను ఆధారంగా తీసుకుని ప్రక్రియ చేపట్టారు. భూముల విలువలను రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీ అధికారులు సమన్వయంతో చర్చించి నిర్ణయించారు. సవరించిన విలువలకు రివిజన్‌ కమిటీ ఆమోద ముద్ర వేసింది. అనంతరం సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నోటీసు బోర్డులో పొందుపరిచారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లో సైతం అందుబాటులో ఉంచారు.

జిల్లాలో ఇలా..

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 15 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. ప్రతి రోజూ 500 నుంచి 1,000 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ప్రతి రోజూ సుమారు రూ.2 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అంటే నెలకు రూ.60 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. ఆయా ప్రాంతాల్లో భూములకు ఉన్న విలువల ప్రకారం ధరలు పెంచారు. సాధారణంగా బయట మార్కెట్‌లో అధిక ధరలకు కక్షిదారులు భూములు కొన్నా ఆ ధరలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలపై కక్షిదారులు ప్రభుత్వానికి చలనా రూపంలో ఫీజులు చెల్లించి రిజిస్ట్రేషన్‌లు చేయించుకుంటారు. ప్రస్తుతం 10 నుంచి 25 శాతం వరకు ధరలు పెంచారు. వాణిజ్య సముదాయాల్లో భారీగా పెంపు కనిపించింది.

పెంపు ఇలా..

జిల్లాలో భూముల విలువ పెంపు విషయమై ఇప్పటికే జాయింట్‌ కలెక్టర్‌ జిల్లా రిజిస్ట్రార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌లతో సమావేశం నిర్వహించారు. గ్రోత్‌ సెంటర్ల ఆధారంగానే రిజిస్ట్రేషన్‌ విలువలు పెంచాలని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ప్రకటించారు. సగటున 10 నుంచి 20 శాతం వరకు పెంపుదల చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా జిల్లాలో ధరలు పెంచారు.

మరింత సంక్షోభంలోకి రియల్‌ రంగం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రియల్‌ రంగం కుదేలైంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ప్రోత్సాహం కరువవడం, కూటమి ప్రభుత్వం రోజుకో విధానం తీసుకువస్తుండటం, ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలను దూరం చేయడంతో ప్లాట్లు కొనేవారే కరువయ్యారు. తాజాగా భూముల ధరలు పెంచడంతో మరింత సంక్షోభం ఎదురుకానుందని రియల్‌ వ్యాపారులు అభిప్రాయ పడుతున్నారు. పెంచిన భూముల ధరలతో కొనుగోలు దారులపై రిజిస్ట్రేషన్‌ చార్జీల భారం పడనుండటంతో భూములు కొనేందుకు ఎవరూ ముందుకు రారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా..

ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూముల విలువ పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నాం. సవరణ కోసం ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించాం. మార్కెట్‌ వాల్యూ రివిజన్‌ కమిటీ ఆమోదంతో సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నోటీసుబోర్డు, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచాం. శనివారం నుంచి పెరిగిన ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపడతాం.

– రెడ్డి సత్యనారాయణ, జిల్లా రిజిస్ట్రార్‌,

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ

రాజమహేంద్రవరం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద క్రయ విక్రయదారులు

ప్రజల నెత్తిన భూ బాదుడు!

భూముల విలువ పెంపు

నేటి నుంచి అమల్లోకి..

10 నుంచి 25 శాతం పెరిగిన వైనం

రిజిస్ట్రేషన్‌ ఆదాయం

పెంచుకొనేందుకు ప్రభుత్వం కుట్ర

ఇప్పటికే రియల్‌ రంగం కుదేలు

పెంచిన ధరలతో మరింత సంక్షోభంలోకి..

కూటమి ప్రభుత్వ పాలనలో

బాదుడే.. బాదుడు

నివాస స్థలాలపై..

కమర్షియల్‌ ప్రాంతాల్లోని స్థలాలే కాకుండా నివాస స్థలాలపై సైతం భారం మోపేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గజం 10 నుంచి 25 శాతం వరకు పెంచారు. వెరసి రాజమహేంద్రవరం సిటీ, దివాన్‌చెరువు, లాలాచెరువు, హౌసింగ్‌ బోర్డ్‌, మోరంపూడి జంక్షన్‌ తదితర ప్రాంతాల్లో ధరలు పెరగనున్నాయి. దీనికితోడు ఆర్‌సీసీ భవనాలు, మట్టి మిద్దెలు, రేకుల షెడ్లు, సెల్లార్‌, సినిమా హాళ్లు, పరిశ్రమలు, పూరిళ్ల విలువలను సైతం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు.

రాజమహేంద్రవరం నగరంలోని దేవీచౌక్‌, జాంపేటలో గతంలో గజం రూ.28,000 ఉండగా.. ప్రస్తుతం రూ.30,000కు పెంచారు.

లక్ష్మివారపుపేటలో రూ.30,000 ఉండగా.. రూ.33,000కు పెరిగింది.

కేవీఆర్‌స్వామిరోడ్డు, అప్సర థియేటర్‌ ఏరియాల్లో రూ.31,000 ఉన్న గజం భూమి రూ.34,000కి పెరిగింది.

పాత ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంతంలో రూ.30,000 నుంచి రూ.33,000, వీరభద్రనగర్‌లో రూ.26,000 నుంచి రూ.28,000 పెంచారు.

ఆదిరెడ్డిపల్లి కాలనీలో అత్యధికంగా రూ.34,000 నుంచి రూ.37,000కి పెరిగింది.

వీఎల్‌ పురం, శ్రీనగర్‌, ఆల్‌బ్యాంక్‌కాలనీ, ఆర్‌టీసీ కాలనీ, మోడల్‌ కాలనీలో రూ.35,000 ఉన్న ధర ప్రస్తుతం రూ.36,000కు పెరగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో పొలం ధరలు సైతం భారీగా పెరిగాయి.

కొవ్వూరు అర్బన్‌ ప్రాంతంలో ఎకరం భూమి గతంలో రూ.54 లక్షలు ఉండగా.. ప్రస్తుతం రూ.60 లక్షలకు పెరిగింది. దొమ్మేరులో రూ.25 లక్షల నుంచి రూ.28 లక్షలకు పెరిగింది.

నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో ఎకరం డ్రైల్యాండ్‌ వాల్యూ గతంలో రూ.32 లక్షలు ఉండగా.. ప్రస్తుతం రూ.34 లక్షలకు చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
ధరణి దద్దరిల్లింది!1
1/1

ధరణి దద్దరిల్లింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement