
దేశంలో మినీ ఎన్నికల సమరానికి తెర లేచింది. కీలకమైన ఉత్తరప్రదేశ్ సహా పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలు అయిదింటికీ ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న ఎన్నికలు అధికార పక్షానికే కాదు... కేంద్ర ఎన్నికల సంఘానికీ ఇప్పుడు అగ్నిపరీక్ష. అయిదు రాష్ట్రాల్లో నాలుగింట అధికారంలో ఉన్న బీజేపీ ఆ పట్టును నిలబెట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తుంటే, ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ దేశంలో మళ్ళీ విజృంభిస్తున్న వేళ ఈ తాజా భారీ ఎన్నికల కసరత్తు ఎన్నికల సంఘానికి కత్తి మీద సాము కానుంది. ఈ 7 విడతల ఎన్నికలలో మెగా ర్యాలీలు కనిపించేలా లేవు. దేశ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పూర్తిగా డిజిటల్, వర్చ్యువల్ ప్రచారాలే శరణ్యం కావచ్చు.
70 దేశాల్లో ఎన్నికలు వాయిదా పడ్డా, మన దగ్గర నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాల్సిందేనని పార్టీలన్నీ ఏకాభిప్రాయం వ్యక్తం చేశాక, ఎవరైనా చేసేది ఏముంది! దేశవ్యాప్తంగా 4.72 లక్షల యాక్టివ్ కరోనా కేసులు, రోజువారీ పాజిటివిటీ రేటు 9.28 శాతం ఉందనగా ఎన్నికల షెడ్యూల్ వెలువడడం గమనార్హం. ఉత్తర ప్రదేశ్‌లో 7, మణిపూర్‌లో 2 విడతల్లో, గోవా– పంజాబ్ – ఉత్తరాఖండ్‌లలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.
ఫిబ్రవరి 10న మొదలై మార్చి 10న కౌంటింగ్ దాకా సాగే ఈ యుద్ధంలో చిత్రవిచిత్రాలు తప్పవేమో! ఎన్నికల సంఘం అభ్యర్థుల ప్రచార వ్యయ పరిమితిని రూ. 28 లక్షల నుంచి 40 లక్షలకు పెంచింది. కానీ మారిన లెక్కలు, ఇప్పుడీ కొత్త డిజిటల్ వ్యూహాల నేపథ్యంలో ఆ వ్యయంతో సాధ్యమా అన్నది సందేహమే! అలాగే, నీతి ఆయోగ్ లెక్క ప్రకారం ప్రతి 100 మందిలో 39 మందే నెట్ వినియోగ దారులు, గ్రామాల్లో వందకు 4 ఇళ్ళలోనే కంప్యూటర్లున్న యూపీ లాంటి చోట్ల డిజిటల్ అంతరాలను పార్టీలు ఎలా నెగ్గుకొస్తాయో!
పండుగలు, ఉత్సవాల కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమనీ, వారిని కాపాడాలనీ కలకత్తా హైకోర్ట్ సహా పలువురు కుండబద్దలు కొట్టారు. అలహాబాద్ హైకోర్ట్ ఏకంగా యూపీ ఎన్నికలే వాయిదా వేస్తే మేలు అంది. తీరా పశ్చిమ బెంగాల్ లాంటి చోట్ల గంగా సాగర్ మేళాలకూ, తమిళనాట సంక్రాంతికి ఎడ్లను లొంగదీసే జల్లికట్టు ఉత్సవాలకూ తోటి పాలకులే గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం విడ్డూరం. అలా ఇటు ప్రజలు కానీ, అటు రాజకీయ పార్టీలు కానీ రకరకాల వేరియంట్ల కరోనాతో చెలగాటానికే సై అనడం విచిత్రం. ఆ మాటకొస్తే, ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని భౌతిక ఎన్నికల ర్యాలీలపై ఈ జనవరి 15 వరకు నిషేధం విధించేదాకా బీజేపీ, ఎస్పీ సహా అన్ని పార్టీలూ ఎడాపెడా బహిరంగ సభలు పెట్టినవే! నిషేధం కన్నా ముందే యూపీ పాలకులు తెలివిగా ప్రధాని సహా పార్టీ పెద్దలందర్నీ దింపి, కొద్ది వారాలుగా ఎన్నెన్ని ప్రారంభోత్సవాలు, సభలు పెట్టారో తెలిసిందే.
మాయావతి సారథ్యంలోని బీఎస్పీ స్తబ్ధుగా మారడంతో, 15 కోట్ల మంది ఓటర్లు – 403 సీట్ల యూపీలో ఈసారి ప్రధానంగా బీజేపీ, ఎస్పీల మధ్య పోరు ఉంటుందని అంచనా. 1985 తర్వాత ఇప్పటి వరకు ఏ పార్టీ వరుసగా రెండు సార్లు గద్దెనెక్కని ఈ రాష్ట్రంలో కులం, మతం, అభివృద్ధి, కరోనా కీలకాంశాలు కానున్నాయి. 2.13 కోట్ల మంది ఓటర్లున్న 117 స్థానాల పంజాబ్‌లో ‘ఆప్’, బీజేపీలతో పోరాడుతూ అధికారం నిలబెట్టుకొంటే కానీ జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు పరువు దక్కేలా లేదు. ప్రత్యర్థులతో పాటు సిద్ధూ ఇంటిపోరు ఆ పార్టీకి అదనపు బరువైంది. ఉత్తరాఖండ్‌లో రెండుసార్లు ముఖ్యమంత్రులను మార్చాల్సి రావడం, మణిపూర్‌లో ముఠా తగాదాలు ఎక్కువ కావడం బీజేపీకి ఉన్న తలనొప్పులకు నిదర్శనం. సాధారణంగా స్థానిక అంశాలు ప్రాధాన్యం వహించే గోవాలో ఈసారి తృణమూల్, ‘ఆప్’ల రంగప్రవేశంతో ఎన్నికల చిత్రం సంక్లిష్టమైంది.
ఈ పరిస్థితుల్లో కరోనాపై పోరుకు తోడు స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడడం ఎన్నికల సంఘానికి సవాలు. యూపీలో అధికార పార్టీ కార్యకర్తల లాగా పనిచేస్తున్న అధికారుల్ని పక్కకు తప్పించాలని ఎస్పీ డిమాండ్ చేసింది. అధికార, పోలీసు యంత్రాంగం రాజకీయమయం అయిందంటూ రానున్న రోజుల్లో ఇలాంటి మరిన్ని డిమాండ్లు వివిధ రాష్ట్రాల్లో రావడం ఖాయం. ఇక, స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల సంఘానికి ఆ మధ్య ఢిల్లీ పాలకుల నుంచి వచ్చిన భేటీ పిలుపుపై విమర్శలొచ్చాయి. దాంతో, స్వతంత్రతనూ, సచ్ఛీలతనూ నిరూపించుకోవాల్సిన అదనపు బాధ్యతా ఎన్నికల సంఘంపై పడింది.
నేర చరిత ఉన్న వ్యక్తిని పార్టీలు అభ్యర్థిగా ఎంచుకుంటే, ఎందుకలా చేసిందీ 48 గంటల్లో తమకు చెప్పాలని సంఘం పేర్కొంది. ఈ ఎన్నికల మార్గదర్శకాలు ఏ మేరకు అమలవుతాయో, గూండాలకు టికెట్లివ్వకుండా పార్టీలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. 2020 బీహార్ ఎన్నికల్లో వర్చ్యువల్ ప్రచారంలో ఆరితేరిన బీజేపీకి దీటుగా వనరులు, సాంకేతికతలో ఇతర పార్టీలకు సమతూకం నెలకొల్పడం ఎన్నికల సంఘానికి ఎంత వరకు సాధ్యమో చెప్పలేం.
ఏమైనా, కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్‌లో నిర్లక్ష్య వైఖరితో పాలకులు, ప్రజలు తప్పు మీద తప్పు చేశారు. నిరుడు ఏప్రిల్‌లో తమిళనాడు, బెంగాల్ సహా 5 రాష్ట్రాల ఎన్నికలు, ప్రచారాలు కరోనా మహా వ్యాప్తికి కారణమయ్యాయి. ఆ ఎన్నికల తర్వాత మేలో రోజుకు 4 లక్షలకు పైగా కేసులు మీద పడ్డాయి. ఇప్పుడు మొన్న డిసెంబర్ నాటి 5 వేల చిల్లర నుంచి పెరిగి, తాజాగా రోజూ లక్షకు పైగా కేసులొస్తూ, థర్డ్‌వేవ్ పడగ విప్పింది. ఈ ఎన్నికల్లో మళ్ళీ నిర్లక్ష్యం చూపితే పర్యవసానాలేమిటో ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. పార్టీలు, ప్రజలు, చివరకు ఎన్నికల సంఘమైనా పాత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే. చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తే అంతకన్నా ఘోరం, నేరం ఉండదు!