పూర్వకాలంలో సేవాతత్పరత కలిగిన ఒక సంపన్నుడు ఉండేవాడట. ఆయన గుణగణాలు నచ్చిన ప్రజలు తమ అధినేతగా ఎంపిక చేసుకున్నారట. అదే సమయంలో అదే రాజ్యంలో ఒక పేద యువకుడు తీవ్రమైన ధనాశ, అధికార వ్యామోహంతో రగిలిపోతూ ఉండేవాడు. రాచబాటలో పయనిస్తే వాటిని సంపాదించడం అసాధ్యమని గట్టి నిర్ణయానికి వచ్చాడు. అడ్డదారులు తొక్కనారంభించాడు. తాంత్రిక విద్యల్ని, కనికట్టు శాస్త్రాన్ని నిష్ఠగా అభ్యసించాడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసే నైపుణ్యం అలవడింది. తన ఇంద్రజాల ప్రదర్శనలతో అధినేత దృష్టిలో పడ్డాడు. కుతాంత్రిక విద్యా రహస్యం తెలియని సదరు అధినేత ఇంద్రజాలికుణ్ణి మెచ్చి తన కుమార్తెల్లో ఒకరినిచ్చి పెళ్ళి జరిపించాడు.
ఆశబోతు యువకుడు ఇక ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. తంత్రాంగం మొదలుపెట్టాడు. ఒక మంత్రించిన మర్రి మొక్కను నాటించాడు. ఈ మర్రి చెట్టుకు భూత భవిష్యత్ వర్తమానాలను చెప్పగలిగే దివ్యదృష్టి ఉందని చాటింపు వేయించాడు. ప్రజలకు ఏదైనా సందేశాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు మంత్రాల మర్రి ఒక ఆకును రాలుస్తుందనీ, ఆకు మీద ఉండే సందేశాన్ని అక్షరాలా పాటిస్తే ప్రజలకు పుణ్యం ప్రాప్తిస్తుందనీ, వచ్చే జన్మలో సుఖ సంతోషాలతో బతుకుతారనీ ప్రచారం చేయించాడు. ప్రజలు నెమ్మదిగా ఆకు కథల్ని నమ్మడం మొదలుపెట్టారు. జనం తన దారిలో పడ్డారన్న గురి కుదరగానే ఒక సంచలన హెచ్చరికతో కూడిన ఆకు రాలింది.
అధినేతను తక్షణం గద్దె దింపి ఖైదు చేయాలనీ, లేకపోతే దేశానికి అరిష్టం దాపురిస్తుందనీ రాలిపడ్డ ఆకులో రాసి ఉంది. ఇంద్రజాలం తెలిసిన ఆయన అల్లుడిని గద్దెనెక్కిస్తే ప్రజలు భోగభాగ్యాలతో తులతూగుతారని కూడా సదరు మర్రి ఆకు జోస్యం చెప్పింది. జనం కొంత కలవరపడ్డారు. వెర్రి వెంగళప్ప లయిన అధినేత సంతానం మాత్రం బావగారి వశీకరణ మంత్రానికి దాసోహమన్నారు. వారే ముందుండి తండ్రిని ఖైదు చేయించి, బావను కుర్చీలో కూర్చోబెట్టారు. మంత్రాల మర్రి ఆకు రాతల సాయంతో చాలాకాలంపాటు ఇంద్రజాలికుడు పెత్తనం చలాయించాడు. కొన్నాళ్లకు బండారం బయటపడి జనం బడితె పూజ చేసి దేశ బహిష్కారం చేశారట!
వాస్తవాలను పోలిన కథలున్నట్టే కథల్ని పోలిన వాస్తవాలు కూడా ఉంటాయి. వర్తమాన ఆంధ్ర రాజకీయాలకు ఈ కథకు చాలా దగ్గరి పోలికలుంటాయి. మంత్రాల మర్రి కాన్సెప్టుకు అచ్చు గుద్దినట్టు సరిపోయే మీడియా మాత్రం పలు చానెళ్లు, పత్రికలు, సోషల్ విభాగాలతో ఊడలు దిగి విస్తరించి ఉంది. గిట్టనివాళ్లు దీన్ని ‘ఎల్లో మీడియా’ అని విమర్శిస్తుంటారు. కథలోని ఇంద్రజాలికుడి అభీష్టం మేరకు మంత్రాల మర్రి ఆకులు రాల్చినట్టే చంద్రబాబు ప్రయోజనాల కోసం ఈ మంత్రాల మర్రి మీడియా కూడా పనిచేస్తున్నది. మిగిలిన విషయాల్లో పోలికలు ఉన్నాయో లేదో తెలియదు గానీ, ఆ మంత్రాల మర్రి – ఈ మీడియా మంత్రాల మర్రి మధ్య, వాటి స్వామిభక్తి పరాయణతల మధ్య మాత్రం స్పష్టమైన పోలికలున్నాయి.
చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడు మరో కోణంలో ఆకు కథల్ని రాల్చడం ఈ మంత్రాల మర్రి ప్రత్యేకత. దీంతోపాటు చంద్రబాబుకు మరికొన్ని అదనపు సౌలభ్యా లున్నాయి. తన సొంత పార్టీ కాకుండా ఇతర పార్టీల్లో కూడా ఆయనకు కొందరు అద్దె ‘మైకు టైసన్’లున్నారు. బాబు క్యాంపు నుంచి సిగ్నల్ అందిన వెంటనే బాబు ప్రత్యర్థి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్‌గా వ్రాయించి ఇచ్చిన పంచ్ డైలాగ్‌లను చదివేస్తారు. స్వయంగా చంద్రబాబు లేదా ఆయన పార్టీవారు రోజుకు రెండో మూడో పంచ్‌లు విసురుతారు. ఆ పంచ్‌లు పాచిపోయే దాకా మీడియా మంత్రాల మర్రి వాటిని ప్రతిధ్వనింపజేస్తుంది. స్వయంగా మంత్రాలమర్రి ఊడ్చు కొచ్చిన స్వీయరచనలు ఈ పంచ్‌లకు అదనం.
ముప్పేట దాడి వ్యూహంతో ఎల్లో మీడియా రాల్చుతున్న ఆకు కథనాలు వారానికి డజన్ దాటుతున్నాయి. ఆకు కథల్లో ఏముంది? దాని అసలు సంగతేమిటి? అని శోధించి చూసి నప్పుడు దిగ్భ్రాంతికి లోనవుతాము. సమాచార విప్లవ విస్ఫోటనం తర్వాత కూడా ఈ మంత్రాల మర్రి కథలు ఎలా రాజ్యం చేయగలుగుతున్నాయని కలవరం కలుగుతుంది. తాంత్రిక సేద్యంతో పెరిగి పెద్దదైన ఈ వృక్షం సమాజంలోకి తంత్రాంగాన్నే ప్రాణవాయువుగా విడుదల చేస్తూ, నాగరిక జీవనంలో కాలుష్యానికి కారణమవుతున్నది. ఈ వారం రోజుల్లోనే ఒక డజన్‌కు పైగా కాలుష్యకారక కథనాలను మంత్రాలమర్రి మీడియా విడుదల చేసింది. అందులో మచ్చుకు ఒక ఆకు కథనాన్ని, దాని అసలు విషయాన్ని పోల్చి చూద్దాం. మతులు పోగొట్టే ఒక మాయా ప్రపంచపు గుట్టుమట్లు కొద్ది కొద్దిగానైనా అర్థమవుతాయి.
ఒక ఆకు కథ: కాకినాడ బియ్యం
కాకినాడ రేవు నుంచి 2020–21 సంవత్సరంలో 30 లక్షల టన్నుల (గ్రాండ్‌గా ఉండేందుకు 3 కోట్ల క్వింటాళ్లని రాశారు) బియ్యాన్ని ఎగుమతి చేశారు. రాష్ట్రంలో బియ్యం ధర కేజీ 40 రూపాయలు వుంటే 25 రూపాయల చొప్పునే ఎగుమతి చేశారు. స్థానిక వినియోగదారులను మోసగిస్తూ తక్కువ ధరకే ఎగుమతి చేయడం ఎలా సాధ్యమైంది! కేవలం రెండే రెండు కారణాల వల్ల ఇది సాధ్యమవుతుంది. ఒకటి: పేదల సబ్సిడీ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి దారి మళ్లించే స్కామ్ ద్వారా ఎగుమతి చేసి ఉండాలి. రెండు: రైతులకు మద్దతు ధర ఎగవేసి ఉండాలి. ఎందుకంటే 1,900 రూపాయల చొప్పున మద్దతు ధర చెల్లిస్తే 25 రూపాయలకు కిలో వర్కవుట్ కాదు. ఆ ధరకు ఎగుమతి చేయాలంటే రైతులకు ధాన్యం ధర మద్దతు కంటే తక్కువగా రూ.1,400 మాత్రమే చెల్లించి ఉండాలి. ఈ రకంగా పండించిన రైతుకూ, వినియోగదారునికీ, సబ్సిడీ బియ్యం అందవలసిన పేదవారికీ అన్యాయం జరిగింది. చదివితే స్క్రీన్‌ప్లే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కాని మూలకథకూ, స్క్రీన్‌ప్లేకూ ఎటు వంటి సంబంధం లేకపోవడమే ఇక్కడ విశేషం.
అసలు కథ: ఇక్కడ స్క్రీన్‌ప్లే రచయిత నిర్ధారణ చేసుకోవలసిన కొన్ని ప్రాథమిక విషయాలను గాలికొదిలేశారు. 1. కాకినాడ నుంచి ఎగుమతి అయ్యే బియ్యం మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే సేకరించారా? 2. ఎన్ని రాష్ట్రాల నుంచి ఎగుమతి బియ్యం కాకినాడ రేవుకు వస్తుంది? 3. మొత్తం ఎగుమతిలో ఏపీ బియ్యం వాటా ఎంత శాతం? 4. ఇందులో ఏపీ ఎగుమతి దారులు స్వరాష్ట్రం నుంచి సేకరించినదెంత – ఇతర రాష్ట్రాల నుంచి సేకరించినదెంత? 5. ఏరకమైన లేదా ఎన్నిరకాల బియ్యాన్ని కాకినాడ రేవు ఎగుమతి చేస్తున్నది. 6. అందులో మన రాష్ట్ర ప్రజలు వినియోగించే రకాలు ఉన్నాయా? 7. ఆ సంవత్సరంలో ప్రభుత్వం మద్దతు ధరకు సేకరించిన బియ్యం పరిమాణమెంత? 8. మద్దతు ధర కంటే ఎక్కువకు రైస్ మిల్లర్లు సేకరించినదెంత? 9. రైతులే నేరుగా అధిక ధరకు ఇతర రాష్ట్రా లకు పంపించింది ఎంత? కాకినాడ పోర్టులో గానీ, బియ్యం ఎగుమతిదారుల సంఘం దగ్గర గానీ, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ దగ్గర గానీ ఈ వివరాలన్నీ దొరుకుతాయి. కానీ, ఆ వివరాల సేకరణ కోసం స్క్రీన్‌ప్లే రచయిత ప్రయత్నించలేదని ఈ కథనం చూసిన తర్వాత భావించవలసి వస్తున్నది.
కాకినాడ నుంచి 2020–21 సంవత్సరం 30 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసిన మాట వాస్తవం. ఇందులో ఉప్పుడు బియ్యం, నూక బియ్యం కలిపి 80 శాతం వాటా. మార్కెట్‌లో 40 రూపాయలకు దొరికే బియ్యాన్ని 25 రూపాయలకే ఎలా ఎగుమతి చేసేవారన్న ప్రశ్నకు జవాబు ఇక్కడ దొరుకుతుంది. ఉప్పుడు బియ్యాన్ని, నూక బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్ వినియోగ దారులు ఉపయోగించరు. ఇంతకంటే తక్కువ ధరకే బయట రాష్ట్రాల్లో సేకరించి ఎగుమతి చేస్తున్నారు. నూక బియ్యం, ఉప్పుడు బియ్యం పోను కాకినాడ నుంచి ఎగుమతి అయ్యే పచ్చిబియ్యం మొత్తం కూడా పొడుగు బియ్యమే. పొడుగు బియ్యాన్ని ఆంధ్ర రైతులు పండించరు. కనుక ఎగుమతి చేసిన ఉప్పుడు బియ్యం, నూక బియ్యం, పొడుగు రకం పచ్చి బియ్యాల్లో ఏ రకం కూడా ఆంధ్రప్రదేశ్‌లో సేకరించినవి కావు. కాకినాడ నుంచి ఎగుమతి చేసే బియ్యం 80 శాతాన్ని ఇతర రాష్ట్రాల ఎగుమతిదారులే చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఎగుమతిదారులు సేకరించే మిగిలిన 20 శాతం బియ్యంలో తొంభై శాతాన్ని బెంగాల్, ఒడిషా, బిహార్ రాష్ట్రాల నుంచి సేకరిస్తున్నారు.
ఈ లెక్క ప్రకారం 2020–21లో కాకినాడ పోర్టు ఎగుమతి చేసిన 30 లక్షల టన్నుల బియ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎగుమతి దారులు సేకరించింది (20 శాతం) 6 లక్షల టన్నులు. ఇందులో ఇతర రాష్ట్రాల్లో సేకరించింది (90 శాతం) 5 లక్షల 40 వేల టన్నులు. ఇక మిగిలింది 60 వేల టన్నులు. అంటే మొత్తం ఎగుమతిలో రెండు శాతం! హతవిధీ! ఈ రెండు శాతం ఎంత పని చేసింది? మంత్రాల మర్రి కథనం ప్రకారం రైతుల గిట్టుబాటు ధరలో క్వింటాల్ 500 రూపాయలను కొల్లగొట్టింది ఈ రెండు శాతమే. వినియోగదారులకు మార్కెట్‌లో 25 రూపాయలకు కిలో బియ్యం దొరక్కుండా చేసింది ఈ రెండు శాతమే. సబ్సిడీ బియ్యాన్ని అందుకునే నిరు పేదల కడుపు కొట్టింది కూడా ఈ రెండు శాతమేనని ఈ కథనం సారాంశం. ఈ లెక్కలన్నీ బియ్యం ఎగుమతిదారుల సంఘం వారు విడుదల చేసినవే. ఆంధ్రప్రదేశ్ రైతులు 2020–21లో 1 కోటి 31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిని సాధించారు. ఇందులో 82 లక్షల 68 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు సేకరించింది. మేలురకం ధాన్యాన్ని నేరుగా రైస్ మిల్లర్లే మద్దతు ధరకంటే ఎక్కువకు రైతుల నుంచి కొనుగోలు చేశారు. మిగిలిన ధాన్యాన్ని రైతులు కుటుంబ అవసరాల కోసం తమవద్దే ఉంచుకున్నారు. ఇదీ లెక్క. మరి మంత్రాల మర్రిచెట్టు చెప్పిన 30 లక్షల టన్నుల బియ్యం లెక్క ఎక్కడిదో విజ్ఞులు ఆలోచించాలి.
ఈ వారం రోజుల్లో మంత్రాల మర్రి రాల్చిన ఆకు కథలన్నీ ఇటువంటి మాయ కథలే. సినిమారంగ సమస్యలపై చర్చించ డానికి కొందరు హీరోలు, దర్శకులు ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంపై కూడా చంద్రబాబు అసంగతమైన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి సినీ ప్రముఖులను అవమా నించారని ఈయన ఆవేశం వెళ్లగక్కారు. ఆయన ఆవేశానికి మంత్రాల మర్రి సుడిగాలినిచ్చి ఎగదోసింది. ముఖ్యమంత్రిని గురించి ఆయనను కలిసిన తర్వాత ఆ సినీప్రముఖులు ఏమని చెప్పారనే ఇంగితాన్ని వదిలేశారు. ముఖ్యమంత్రి వ్యక్తిత్వం మీద చినజీయర్ స్వామి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ఈ తరహా ప్రచారానికి చెంపపెట్టు లాంటివి. ప్రత్యేక హోదా ఎపిసోడ్ నిజానికి చంద్రబాబు కూటమి సిగ్గుతో తలదించుకోవలసిన విషయం. సాంకేతికంగా రెండు రాష్ట్రాల మధ్య జరిగే చర్చల ఎజెండా నుంచి రాష్ట్రానికే ప్రత్యేకమైన అంశాలను తొలగించి ఉండవచ్చు. కానీ, చంద్రబాబు స్వహస్తాలతో ఖననం చేసిన అంశానికి వైఎస్ జగన్ తిరిగి ప్రాణం పోసి నిలబెట్టారని ఈ ఎపిసోడ్ నిరూపించింది.
కానీ మన మంత్రాల మర్రి దీన్ని జగన్ ప్రభుత్వ వైఫల్యంగా ప్రచారం చేయడానికి నానాపాట్లు పడింది. గౌతమ్ సవాంగ్ వ్యవహారం ఇలాంటిదే. చంద్రబాబు హయాంలో ఒక డీజీపీ సగటున 15 నెలలు పనిచేశారు. 30 నెలల తర్వాత సవాంగ్‌ను మార్చడం మంత్రాల మర్రికి విడ్డూరంగా తోచింది. ఉద్యోగుల సంఘ నాయకుడిగా ఉన్న అశోక్‌బాబు తన సర్వీస్ రిజిస్టర్‌ను ట్యాంపర్ చేసి లేని విద్యార్హతలను చేర్చుకున్నారు. నేరం బయటపడడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. దొంగతనం చేస్తే మాత్రం అరెస్టు చేస్తారా? ఇది వేధింపు కాదా అని ప్రతిపక్షం ఎదురుదాడికి దిగింది. నిజంగానే జగన్ ప్రభుత్వం తన వ్యతిరేకులను వేధిస్తున్నదని మంత్రాల మర్రి చర్చాగోష్ఠులు నడిపింది. ఒక్క వారంలో ఇన్ని వక్రీకరణలకు పాల్పడిన మంత్రాల మర్రి కథల పట్ల జనం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉన్నది.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment