తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ! తప్పించుకు తిరిగేవాడు దొరికితే సంచలనమే సుమీ!! చార్లెస్ శోభరాజ్ వంటి కరుడుగట్టిన నేరస్తుడు అరెస్టయితేనే అప్పట్లో అదో సంచలన వార్తయింది. అటువంటిది మన అతిపెద్దమనిషి చంద్రబాబు అరెస్టయితే సంచలనం కలగకుండా ఉంటుందా? ఆయనపై ఇప్పటివరకు కనీసం రెండు డజన్ల పెద్దస్థాయి అవి నీతి ఆరోపణలు వచ్చాయి. కనీసం ఒక్కదానిపై కూడా విచా రణ జరక్కుండా అడ్డుచక్రాన్ని గిరగిరా తిప్పి విసరడంతో ఆయన చూపుడు వేలు నేర్పరితనం ఇప్పటికే రికార్డు పుటల్లోకి ఎక్కింది.
చంద్రబాబును సెంట్రల్ జైలుకు పంపించిన అభియో గాలు ఇప్పుడు న్యాయస్థానాల పరిశీలనలో ఉన్నాయి. కనుక వాటి మీద చర్చను పక్కనపెడితే, ఆయన అరెస్టు మాత్రం పెద్ద వార్తే అయింది. పెద్ద వార్తల చుట్టూ అనేక పిల్ల వార్తలూ, పిట్టకథలూ, ఉపాఖ్యానాలు, వ్యాఖ్యానాలు చేరిపోవడం సహజం. అలా చేరిపోయిన వాటిలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోని ఇద్దరు నాయకుల రాజకీయ వ్యాఖ్యానాలు మరో చర్చకు దారితీశాయి. ఐటీ ఉద్యోగుల పేరుతో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ వారు రెండు, మూడు ఊరేగింపులు చేశారు. దీనిపై కేటీఆర్ అభ్యంతరం చెబుతూ ‘పక్క రాష్ట్ర రాజకీయ అంశంపై ఇక్కడెందుకు నిరసనలు?
ఐటీ కారిడార్‌లో శాంతిభద్రతల సమస్య సృష్టించడమెందు క’ని ప్రశ్నించారు. వెంటనే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దానిపై స్పందించారు. చంద్రబాబు జాతీయ నాయకుడనీ, ఆయన కోసం ఎక్కడైనా ఆందోళన చేయవచ్చనీ చెబుతూనే ‘బీఆర్‌ఎస్‌కు ఆంధ్ర వాళ్ల ఓట్లు కావాలి గానీ, వాళ్ల సమస్యలు అక్కర్లేదా’ అని వ్యాఖ్యానించారు.
ఈ చర్చలో అంతర్లీనంగా రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి – ఐటీ రంగ అభివృద్ధికీ, హైదరాబాద్ అభి వృద్ధికీ మారుపేరుగా చంద్రబాబును ప్రస్తావిస్తూ ఒక ఫేక్ బ్రాండ్ ఇమేజ్‌ను గత పాతికేళ్లుగా యెల్లో మీడియా పోషించు కుంటూ వస్తున్నది. దాని కొనసాగింపుగానే ఐటీ ఉద్యోగులంతా చంద్రబాబును తమ తాతపాదుల వారిగా తలపోస్తు న్నారనే భ్రాంతిని సృష్టించడం కోసం ఈ ర్యాలీలను తెలుగు దేశం పార్టీ నిర్వహించింది.
ఈ ర్యాలీల్లో కూడా ఒక సామాజిక వర్గమే ప్రధాన భూమికను పోషించిందన్న మాట కూడా ఒక నిష్ఠుర సత్యం. ఇక రెండో అంశం – తెలంగాణలో ఆంధ్రావాళ్ల ఓట్లు. సెటిలర్ల ఓట్లన్నీ గంపగుత్తగా తెలుగుదేశం పార్టీ ఖాతాలో, బాబు కనుసైగల అజమాయిషీలో ఉన్నట్టు కూడా యెల్లో మీడియా మరో భ్రాంతి జనిత బ్రాండ్‌ను సృష్టించింది.
ఇద్దరు తెలంగాణ నాయకుల వ్యాఖ్యలు యథాలాపమా, ఆలోచనాపూర్వకమా అనే విషయం వారికి మాత్రమే తెలుసు. కానీ ఆచరణలో అవి స్పష్టమైన పాత్రనే నిర్వహించాయి.
చంద్రబాబు మీద కప్పిన ఫేక్ బ్రాండ్ ముసుగును తొలగించే ప్రయత్నం కేటీఆర్ వ్యాఖ్యల్లో కనిపిస్తే, ఆ ముసుగును కాపాడే అంతరార్థం రేవంత్‌రెడ్డి మాటల్లో ధ్వనించింది. రేవంత్‌రెడ్డికి పూర్వాశ్రమంలో చంద్రబాబుతో ఉన్న సాహచర్యం కారణంగా అలా కావాలని మాట్లాడి ఉండవచ్చేమో! చంద్రబాబు పట్ల ఆయన సానుకూల స్పందన పెద్ద విశేషమేమీ కాదు. కానీ, ఆ నకిలీ బ్రాండ్ ముసుగును తొలగించడం బీఆర్‌ఎస్‌కు కచ్చితంగా ఒక రాజకీయ అవసరం. తమ హయాంలో జరిగిన నగరాభివృద్ధినీ, ఐటీ పురోగతినీ కూడా యథేచ్ఛగా యెల్లో మీడియా చంద్రబాబు ఖాతాలో వేస్తుంటే ఏ ప్రభుత్వమైనా ఎంతకాలం భరిస్తుంది?
తెలుగుదేశం పార్టీ నేతలకు తమిళ సినిమారంగ స్టార్ రజనీకాంత్ సన్నిహితుడు. ఎన్టీఆర్‌కు వెన్ను పోటు పొడిచిన సమయంలో ఆయన హైదరాబాద్‌కు వచ్చి మరీ చంద్రబాబు గ్యాంగ్‌కు మద్దతు పలికిన సంగతి చాలా మందికి గుర్తే. ఆయన ఈమధ్య మాట్లాడుతూ హైదరాబాద్‌కు వెళ్తే న్యూయార్క్‌కు వెళ్లినట్లుంటుందని చెబుతూ, అందుకు చంద్రబాబే కారకుడని ఓ వీరతాడును ఆయన మెడలో వేశారు. ఈ పదేళ్లలో హైదరాబాద్‌లో జరిగిన పరిణామాలకూ, ఇరవయ్యేళ్ల కిందనే తోక ముడిచిన చంద్రబాబుకూ ఏరకమైన సంబంధముంటుంది? ఇటువంటి ఘటనలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు సహజంగానే అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఆ అసౌకర్యమే కేటీఆర్ మాటల్లో వెల్లడై ఉండవచ్చు.
యెల్లో మీడియాను మాత్రమే అనుసరించే వారి మెదళ్లలో ఈ ఫేక్ బ్రాండ్ గుజ్జు ఎంత నిండిందో తెలియజెప్పే ఉదంత మొకటి ఈమధ్యనే మీడియాలో కనిపించింది. బాబు అరెస్టుకు నిరసన తెలియజేస్తున్న ‘ఐటీ ఉద్యోగుల్లో’ ఒక యువతి ముందు మన యెల్లో మీడియా మైకు పెట్టింది. ‘‘సీబీఎన్ అరెస్టును తెలంగాణ ప్రభుత్వం ఖండించలేదండీ! ఎందుకంటే ఇప్పుడు సీబీఎన్ బయటకొస్తే ఆటోమేటిక్‌గా ఏపీ డెవలపయిపోతుంది.
తెలంగాణ వెనకబడుతుంది. అందుకని వాళ్లు ఖండించరు’’. ఆహా ఎంత పరిణతి! సాక్షాత్తూ జ్ఞాన సరస్వతీ దేవి ఉపదేశమా ఇది. ‘‘తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ ... ... ... సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా!’’ మనం మరోసారి అక్షరాభ్యాసం చేయాల్సిందే. నిన్నటిదాకా ఆయన బయటే ఉన్నాడు కదమ్మా. ఐదేళ్లు అధికారంలో కూడా ఉన్నాడు కదమ్మా. మరి ఆటోమేటిగ్గా ఏపీ అగ్రస్థానంలోకి ఎందుకు దూసుకెళ్లలేదు తల్లీ అనే సహజమైన ప్రశ్న కూడా ఆ దిగ్భ్రాంతి క్షణాన ఎవరికీ జనించి ఉండదు.
ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రచార సాధనాల (మీడియా) ద్వారా ప్రజాభిప్రాయాన్ని ఎలా ఉత్పత్తి చేసుకుంటాయో (manufacturing consent) తెలియజెప్పే సిద్ధాంత పత్రాన్ని అమెరికా మేధావులు నోమ్ చోమ్‌స్కీ, ఎడ్వర్డ్ హెర్మాన్‌లు వెలువరించారు. ఏపీలో చంద్ర బాబు అధికారంలోకి రాకపూర్వమే అమెరికా పరిస్థితులను అధ్యయనం చేసి వారు ఈ థియరీని ప్రతిపాదించారు.
కానీ, ప్రస్తుత మన యెల్లో మీడియా కర్మాగారాలను, వాటి ఉత్ప త్తులను చూసి ఉంటే పరిశోధన పక్కనపెట్టి మూర్ఛ పోయేవారు. ఈ కర్మాగారాల్లో తయారైన అతి ముఖ్యమైన ఉత్పత్తి ‘బ్రాండ్ బాబు’! ఐటీకి ఆద్యుడుగా, అభివృద్ధికి రోల్‌మోడల్‌గా, హైదరాబాద్ నిర్మాతగా బ్రాండ్ బాబును ప్రచారంలో పెట్టారు. ఇప్పుడీ బ్రాండ్ బాబు ఇమేజిపై పోస్ట్‌మార్టమ్ జరిగి తీరాలి. వర్తమాన చరిత్రకు జరుగుతున్న వక్రీకరణను సరిచేయవలసిన బాధ్యత కూడా వర్తమాన సమాజానిదే!
హైదరాబాద్‌లోనే కాదు, మొత్తం దేశంలో కూడా ఐటీ అభివృద్ధికి సంబంధించి ఏ ఒక్కరికో క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే అది మన తెలుగుజాతి కీర్తికిరీటం పీవీ నరసింహారావుకే దక్కాలి. ఆయన ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) పేరుతో ఐదారు నగరాల్లో ఐటీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో హైదరా బాద్ మొదటిది.
చంద్రబాబు నిర్మించినట్టుగా మనం చదువు కుంటున్న హైటెక్ సిటీ లేదా సైబర్ టవర్స్‌కు 1993లోనే అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి శంకుస్థాపన చేశారు. దేశంలోనే పెద్దవైన ఐదు ఐటీ కంపెనీల్లో ఒకటైన సత్యం కంప్యూటర్స్ (టెక్ మహేంద్ర) 1987లోనే ఏర్పాటైంది. 1995లో జరిగిన వెన్నుపోటు పట్టాభిషేకం నాటికి సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో హైదరాబాద్‌ది మూడో స్థానం. 2004లో చంద్ర బాబు గద్దె దిగేనాటికి నాలుగో స్థానం.
ఆ తర్వాత వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో మళ్లీ మూడో స్థానానికి ఎగబాకింది. ఐటీ ఎగుమతుల్లో ఇప్పుడు హైదరాబాద్‌ది దేశంలో రెండో స్థానం. గూగుల్, ఫేస్‌బుక్, ఆపిల్, క్వాల్‌కామ్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు వాటి అతిపెద్ద క్యాంపస్‌లను (అమెరికా వెలుపల) హైదరాబాద్‌లో చంద్రబాబు అనంతర కాలంలోనే ఏర్పాటు చేశాయి.
ఐటీ రంగం విస్తృతమవుతున్న నేపథ్యంలో నేదురుమల్లి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కొత్తగా 11 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతినిస్తే, వాటికి వ్యతిరేకంగా చంద్రబాబు నేతృత్వంలో యెల్లో మీడియా ఆధ్వర్యంలో, కమ్యూనిస్టుల తోడ్పాటుతో, పెద్ద ఉద్యమాన్ని లేవదీసి వాటిని ఆపేశారు.
చంద్రబాబు గద్దెనెక్కగానే ఏకంగా 30 కాలేజీలను ప్రారంభించారు. ఎవరూ కిమ్మనలేదు. ఆ పదకొండు ఎవరికి చెందినవి, ఈ 30 ఎవరివి అనేది ఒక ప్రత్యేక రాజకీయ – సామాజిక అధ్యయనాంశం. ఇప్పుడు అప్రస్తుతం. వైఎస్‌ఆర్ అధికారంలో ఉన్న సమయంలో ఇంజనీరింగ్ మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో వీసాల కోసం అమెరికా కాన్సులేట్ కార్యాలయాన్ని వైఎస్ హైదరా బాద్‌లో ఏర్పాటు చేయించారు.
ఇవన్నీ వాస్తవాలు! చెరిపేస్తే చెరిగిపోయేవి కావు. ఎవరైనా రికార్డులను పరిశీలించుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డును, శంషాబాద్ ఎయిర్‌పోర్టును కూడా యెల్లో మీడియా బాబు ఖాతాలోనే వేస్తున్నది. బాబు సంగతి సరేసరి. ‘సెల్‌ఫోన్ కనిపెట్టింది కూడా నేనే’ అనే స్థాయికి చేరిన వైపరీత్యం ఆయన మనస్తత్వానిది.
ఎయిర్‌పోర్టు పనులకు శంకుస్థాపన చేసిందీ, కొత్త ఎయిర్‌పోర్టును ప్రారంభించిందీ కూడా వైఎస్సార్ హయాంలోనే! ఔటర్ రింగ్‌రోడ్డు కోసం భూసేకరణ దగ్గర్నుంచీ రోడ్డు నిర్మాణం 90 శాతం పూర్తయింది కూడా వైఎస్సార్ హయాంలోనే! ఇక ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా ఎయిర్‌పోర్టు నుంచి నగరానికి వస్తున్నప్పుడు రజనీ కాంత్‌కు కనిపించిన న్యూయార్క్ దృశ్యం ఈ అయిదేళ్లలో ఆవిష్కృతమైన పరిణామం.
పీవీ నరసింహారావుకు, వైఎస్సార్‌కు, కేసీఆర్‌కూ దక్కా ల్సిన ఘనతలను కూడా బరబరా లాక్కుని చంద్రబాబుకు కట్టబెట్టే సమాచార గూండాగిరీకి యెల్లో మీడియా పాల్పడు తున్నది. అది ప్రజాభిప్రాయ ‘ఉత్పత్తి’ దశను దాటి ప్రజాభి ప్రాయ ‘రిగ్గింగ్’ దశకు చేరుకున్నది. అందులో భాగమే తెలంగాణలో, హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్లంతా బాబు వర్గమే అనే ప్రచారం.
బాబు వర్గం అంటే వారి ఉద్దేశం ప్రకారం టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న సామాజికవర్గం. సెటిలర్లలో వారు సింహభాగం ఉంటారు. మిగిలిన వారిని ప్రభావితం చేస్తారని వారి ఉద్దేశం. ఈ తప్పుడు లెక్కలతోనే తెలంగాణ రాజకీయ పార్టీలను యెల్లో మీడియా దబాయి స్తున్నది. సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయ బోయే నాయకులను బెదిరించి చంద్రబాబు అరెస్టును ఖండించే ప్రకటనలు యెల్లో మీడియా చేయిస్తున్నది. కానీ వారు చెబుతున్న లెక్కలు వాస్తవమేనా?
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేసిన క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారం దాదాపు ఇరవై లక్షలమంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సెటిలర్లు ఉన్నారు. వీరిలో ఇరవై శాతం వరకు కమ్మవారుంటారని అంచనా. పదిహేను శాతం రెడ్లు, పదిహేను శాతం కాపులు. బీసీలు ముప్పయ్ శాతం. మిగిలిన ఇరవై శాతం ఇతరులు. ఇవి వాస్తవికతకు దగ్గరగా ఉన్న ఉజ్జాయింపు లెక్కలు మాత్రమే.
యెల్లో మీడియా దబాయింపు ప్రకారం ఇరవై శాతం సామాజిక వర్గం చెప్పుచేతుల్లోనే ఎనభై శాతం మసలుకుంటున్నట్టు లెక్క. వాస్తవానికి ఆంధ్రా సెటిలర్లు అనేది ఒక ఓటు బ్యాంకు ఎంతమాత్రమూ కాదు. ఎవరి రాజ కీయ అభిప్రాయాలు వారివి. కులాల లెక్కలు కూడా చెల్లవు. అసలు ఆంధ్రప్రదేశ్‌లోనే కుల ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాజకీయ పోరాటాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్గ పోరాటంగా మార్చివేశారు.
పేదలకూ – పెత్తందార్లకూ మధ్య యుద్ధంగా ఆయన పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఇంకా తెలుగు దేశం పార్టీ మాత్రమే ఒక్క కులాన్ని పట్టుకుని వేలాడుతున్నది. అటువంటి విభజనే సెటిలర్లలో కొంతమేరకు ఉండవచ్చు. లేదా స్థానిక అంశాల ఆధారంగా వారి మద్దతు ఉండవచ్చు.
సెటిలర్లపై చంద్రబాబు ప్రభావం అనేది యెల్లో మీడియా ఉత్పత్తి చేస్తున్న భ్రాంతి మాత్రమే. తెలంగాణ ప్రజలకు చంద్ర బాబులో ఇప్పటికీ ఒక సామాజిక విధ్వంసకుడు కన్పిస్తాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గడిచిన ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠం నేర్చుకున్నదో లేక మరోసారి బలిపీఠం ఎక్కడానికి సిద్ధపడుతున్నదో వేచి చూడాలి.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
బ్రాండ్ బాబు బాగోతం!
Published Sun, Oct 1 2023 3:42 AM | Last Updated on Sun, Oct 1 2023 11:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment