ఇజ్రాయెల్‌లో మళ్లీ ఎన్నికలు | Israel To Hold Snap Election In March, Fourth In Two Years | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌లో మళ్లీ ఎన్నికలు

Published Fri, Dec 25 2020 12:01 AM | Last Updated on Fri, Dec 25 2020 12:01 AM

Israel To Hold Snap Election In March, Fourth In Two Years - Sakshi

గత రెండేళ్లుగా... ప్రత్యేకించి మొన్న ఫిబ్రవరి మొదలుకొని రాజకీయంగా వరస సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్న ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ చివరికి మరోసారి జనం తీర్పు కోరడానికి సిద్ధపడ్డారు. బడ్జెట్‌ ఆమోదంపై రాజకీయ పక్షాల మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ కెన్సెట్‌ ఆ దేశ రాజ్యాంగ నిబంధన ప్రకారం రద్దయింది. నాలుగేళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలు కాస్తా మొదటి రెండేళ్ల వ్యవధిలోనే నాలుగో దఫా నిర్వహించక తప్పడంలేదు. కొత్త సంవత్సరం మార్చిలో జరిగే ఈ ఎన్నికలు ఆయనకు అన్నివిధాలా అగ్నిపరీక్షే. నెతన్యాహూ సాధారణ రాజకీయవేత్త కాదు. వ్యూహరచనా నిపుణుడు. ఎత్తుగడల్లో ఆరితేరినవాడు.

మొన్న మార్చిలో పార్లమెంటుకు మూడోసారి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఎవరికీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. 120 మంది సభ్యులుండే పార్లమెంటులో నెతన్యాహూ నేతృత్వంలోని మితవాద లికుడ్‌ పార్టీకి కేవలం 36 స్థానాలు మాత్రమే వచ్చాయి. మధ్యేవాద పక్షమైన బ్లూ అండ్‌ వైట్‌ పార్టీకి 33 స్థానాలు లభించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన కనీస మెజారిటీ 61. ఇతర పార్టీలకు చెప్పుకోదగ్గ రీతిలో సీట్లు రాలేదు. ఈ పరిస్థితుల్లో చివరికి తాను గట్టిగా వ్యతిరేకించే బ్లూ అండ్‌ వైట్‌ పార్టీతో చేతులు కలిపి నెతన్యాహూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో బ్లూ అండ్‌ వైట్‌ పార్టీ నేత బెన్నీ గాంట్జ్‌కూ, నెతన్యాహూకు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 18 నెలలు నెతన్యాహూ, మిగిలిన నెలలు గాంట్జ్‌ పాలించాలి. కానీ దాన్ని కాస్తా నెతన్యాహూ బేఖాతరు చేయదల్చుకున్నారు.

పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన తాను ప్రధాని స్థానంలో వుండి ఆ కేసుల్ని ఎదుర్కొనాలి తప్ప మాజీగా మిగలకూడదని ఆయన గట్టిగా కోరుకున్నారు. అందుకే బడ్జెట్‌ ఆమోదానికి ప్రయత్నించి, ప్రధాని కావాలని ఆరాటపడిన గాంట్జ్‌ ఆశలకు ఆయన గండికొట్టారు. కెన్సెట్‌ రద్దుకు పరోక్షంగా కారకులయ్యారు. అయితే ఇద్దరికీ రెండు పార్టీల్లోనూ ప్రత్యర్థుల బెడద ఎక్కువే. నెతన్యాహూకు ఒకప్పుడు శిష్యుడిగా వుండి పార్టీలో గట్టి ప్రత్యర్థిగా ఎదిగిన గిడియన్‌ జార్‌ ఇటీవలే ఆ పార్టీనుంచి నిష్క్రమించి న్యూహోప్‌ పేరిట కొత్త పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. జార్‌ వెళ్లిపోయినా నెతన్యాహూకు పార్టీలో ప్రత్యర్థులు తక్కువేమీ లేరు.

గాంట్జ్‌ పరిస్థితి కూడా అంతే. నెతన్యాహూతో చేరొద్దని, దానికి బదులు పార్లమెంటుకు మరోసారి ఎన్నికలు రావడమే మేలని నచ్చజెప్పారు. కానీ ఆయన వినలేదు. చివరకు ఈ చెలిమివల్ల రెండూ తీవ్రంగానే నష్టపోయాయి. అయితే నెతన్యాహూ పార్టీయే ఈసారి ఎన్నికల్లో కూడా అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని మీడియా సర్వేలు చెబుతున్నాయి. దానికి 27 సీట్లు రావొచ్చునని సర్వేలు చెబుతున్న మాట. గత ఎన్నికల్లో 33 స్థానాలు గెల్చుకున్న బ్లూ అండ్‌ వైట్‌ పార్టీ మాత్రం ఈసారి ఆరు స్థానాలకు పరిమితమవుతుందని అంటున్నాయి.  

ఏడు దశాబ్దాల ఇజ్రాయెల్‌ చరిత్రంతా అరబ్‌ వ్యతిరేకతతో, ముఖ్యంగా పాలస్తీనాపై కత్తులు నూరడంతో  ముడిపడి వుంటుంది. అందుకే ప్రతి ఎన్నికలకూ ముందు పాలస్తీనాపై నిప్పులు కక్కడం లేదా దానిపై దాడులు చేయడం ఇజ్రాయెల్‌లో ఎవరు అధికారంలో వున్నా రివాజు. గత ఎన్నికల సమయంలో అయితే నెతన్యాహూ పాలస్తీనా అధీనంలో వున్న వెస్ట్‌బ్యాంకు ప్రాంతాలన్నిటినీ స్వాధీనం చేసుకుంటానని వాగ్దానం చేశారు. దేశంలో అరబ్‌ పార్టీల కూటమి జాయింట్‌ లిస్టును ఎలాగైనా అధికారంలోకి రానీకుండా చేయాలని ఇజ్రాయెల్‌ పార్టీలు శాయశక్తులా ప్రయత్నిస్తుంటాయి.

వాస్తవానికి 2019 ఎన్నికల్లో జాయింట్‌ లిస్టు కింగ్‌ మేకర్‌గా ఆవిర్భవించింది. తమతో చేతులు కలిపితే ప్రధాని పదవి దక్కుతుందని, అవినీతిపరుడైన నెతన్యాహూను అధికారానికి దూరం పెట్టొచ్చునని జాయింట్‌ లిస్టు గాంట్జ్‌కు ప్రతిపాదన పంపినా అంగీకరించలేదు. జాయింట్‌ లిస్టుతో కలవొద్దన్న నిర్ణయాన్ని సమర్థిస్తూనే నెతన్యాహూను కూడా అంగీకరించొద్దని అనుచరులు సూచించినా గాంట్జ్‌ వినలేదు. ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు ముందు ఎప్పుడూ రాజకీయాలు వ్యక్తి కేంద్రంగా లేవు. తీవ్ర అరబ్‌ వ్యతిరేకతే అన్ని పార్టీలకూ ఊపిరి. అదే సమయంలో అరబ్‌ పార్టీల కూటమి చెప్పుకోదగ్గ స్థానాలు గెల్చుకుంటూ వుంటుంది. కానీ నెతన్యాహూ నాయకత్వ స్థానంలోకొచ్చాక అది మారింది. ఆయనకు వ్యతిరేకంగా కొత్త పార్టీలు పుట్టుకురావడం, ఆయన్ను వ్యతిరేకించడం మినహా వాటికి మరో రాజకీయ కార్యక్రమం లేకపోవడం రివాజైంది. 

ఇజ్రాయెల్‌కు లిఖితపూర్వక రాజ్యాంగం లేదు. అక్కడి పార్టీలకు నిర్దిష్టమైన రాజకీయ సిద్ధాంతం లేదు. పాలస్తీనా వ్యతిరేకత, యూదు జాత్యహంకారం, రాజకీయ నాయకుల స్వప్రయోజనాలు మాత్రమే మిగిలాయి. వీటికి గత రెండేళ్లుగా దేశాన్ని పీడిస్తున్న రాజకీయ అనిశ్చితి తోడైంది. దీనికి మూలాలు ఇజ్రాయెల్‌ ఆవిర్భావంలోనే వున్నాయి. వెస్ట్‌బ్యాంకు ప్రాంతంలోని యూదు కాలనీలను క్రమేపీ పెంచుకుంటూ పోవడం, అలా పెంచుతామని హామీ ఇవ్వడమే అన్ని పార్టీలకూ రివాజైంది. ఇదంతా క్రమేపీ దేశంలో మితవాద పక్షం బలపడటానికి దారితీసింది. అంతవరకూ పెద్దగా ప్రజాభిమానంలేని మితవాద పక్షం లికుడ్‌ పార్టీ 1977లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికొచ్చింది. వామపక్ష ప్రాభవం అంతరించడం మొదలైంది.

1995లో లేబర్‌ పార్టీ నేత ఇట్జాక్‌ రాబిన్‌ను మితవాద తీవ్రవాద పక్షం హత్య చేయడంతో దేశ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అన్ని పరిణామాల్లోనూ నెతన్యాహూ కీలక భూమిక పోషించి, లికుడ్‌ పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు తగిన ఆధారాలున్నాయని ఇప్పటికీ ఇజ్రాయెల్‌ సమాజం విశ్వసిస్తోంది. అదే సమయంలో ఆయన తప్ప గత్యంతరం లేదనుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే మార్చిలో జరగబోయే ఎన్నికల అనంతరం మళ్లీ నెతన్యాహూయే అధికారానికొస్తారా లేక ఈ అనిశ్చితి మరింత తీవ్రమవుతుందా అన్నది చూడాల్సివుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement