కథతో మొదలెట్టుకుందాం. ఒక మోసగాడు కొయ్యగుర్రాన్ని రాజాస్థానానికి పట్టుకుని వచ్చి ‘రాజా.. ఈ గుర్రం ఎగురుతుంది. పదివేల వరహాలకు అమ్ముతాను’ అంటాడు. ఎగిరే గుర్రాన్ని ఎవరు వద్దనుకుంటారు? ‘ఎగరకపోతేనో?’ అంటాడు రాజు. ‘ఎగురుతుంది రాజా. పున్నమిరోజు వెన్నెల రాత్రి ధవళ వస్త్రాలు ధరించి అధిరోహించు. ముల్లోకాలు తిప్పి తెస్తుంది’ అంటాడు. పదివేల వరహాలు మోసగాడికి దక్కాయి. పున్నమి వచ్చింది. వెన్నెల రాత్రి వచ్చింది. ధవళ వస్త్రాలతో రాజు గుర్రం ఎక్కాడు.
గుర్రం కదల్లేదు. మెదల్లేదు. ముఖం జేవురించిన రాజు ‘వాడి తల ఉత్తరించండి’ అన్నాడు భటులతో. భటులు వెళ్లి మోసగాణ్ణి పట్టుకొని వస్తే వాడు దబ్బున కాళ్ల మీద పడి ‘రాజా... ఎక్కడో పొరపాటు జరిగింది. ఆరు నెలలు సమయం ఇవ్వండి. ఈలోపు గుర్రం ఎగరకపోతే అప్పుడు నన్ను ఉరి తీయండి’ అన్నాడు. రాజు నెమ్మదించాడు. మోసగాణ్ణి మరోమారు నమ్మి చెరసాలకు పంపాడు.
చెరసాలలో సీనియర్ ఖైది ఈ మోసగాణ్ణి చూసి ‘ఒరే... ఎలాగూ గుర్రం ఎగరదు. నీ తల తెగిపడకా తప్పదు. ఈ ఆరునెలల సమయం ఎందుకు అడిగావు?’ అంటాడు. దానికి మోసగాడు ‘ఏమో ఎవరు చూడొచ్చారు. ఈ ఆరు నెలల్లో ఏమైనా జరగొచ్చు. రాజు నన్ను క్షమించవచ్చు. లేదా జబ్బు పడవచ్చు. గుండాగి చావొచ్చు. ఏమో... ఆరు నెలల్లో శత్రురాజు ఈ దేశం మీదకు దండెత్తి ఆక్రమించవచ్చు. ఏమో... వరదలు ముంచెత్తి ఈ చెరసాల గోడలను బద్దలు కొట్టవచ్చు.
ఏమో... ఇవన్నీ జరగకపోతే కనీసం గుర్రం ఎగురా వచ్చు’ అంటాడు. ఆశ అంటే అది. కాలం మీద ఆశ. కాలం భవిష్యత్తులో మొదలయ్యి వర్తమానంలోకి వచ్చి గతంలోకి జారుకుంటుంది. మనకు గతం మాత్రమే తెలుసు. వర్తమానం సంభవిస్తూ ఉండగా అంచనా ఉండదు. భవిష్యత్తు ఆచూకీ తెలియదు. కాలం హాయిగా గడవాలని ఏ మనిషైనా కోరుకుంటాడు. హాయిగా గడవడం కోసం శ్రమ పడతాడు. హాయిగా గడవదేమోనని భయపడతాడు.
‘రోజులన్నీ ఒక్కలాగే ఉండవు’ అని కలవరపడే మనిషే ‘రోజులన్నీ ఒక్కలాగే ఉంటాయా ఏంటి’ అని ఏదో ఒక గుడ్డి నమ్మకం కాలం మీద పెట్టుకుంటాడు. ఇదేమీ తెలియని కాలం ఆవిశ్రాంతంగా ఉద్భవిస్తూ, జనిస్తూ, సకల ప్రాణికోటికి సమంగా బట్వారా అవుతూ, రెప్పపాటు నుంచి మన్వంతరాల వరకూ జరిగే ఘటనలను తనలో లీనం చేసుకుంటూ ముందుకు సాగిపోతుంటుంది. కాలం ముందుకే సాగగలగడం మనిషి అదృష్టం. టైమ్ మిషన్ ఎక్కి వెనక్కు వెళ్ళాలని అనుకుంటాడుగాని వెనక్కు వెళితే ఏముంటుంది? గుప్తుల స్వర్ణయుగంలో కూడా దోమలు ఉంటాయి. మశూచి ఉండే ఉంటుంది.
‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని మనిషి అనుకుంటాడు గానీ గత కాలం పట్ల అసంతృప్తే మనిషిని ముందుకు నడిపించేది. గత కాలపు అనుభవాలలోని లోటును గ్రహించడం వల్లే మనిషి భవిష్యత్తు ఆవిష్కరణలు చేసేది. గతంలో రాజు గారికి రాచకురుపు వస్తే రాకుమారుడు గుర్రం తీసుకుని విరుగుడు ఆకుల కోసం వేయి యోజనాలు ప్రయాణించాల్సి వచ్చేది. ఇవాళ బంజారా హిల్స్‌లో అడుగుకొక కేన్సర్ హాస్పిటల్ ఉంది. గతంలో నలభై, నలభై ఐదేళ్లకు మనిషి పుటుక్కుమనేవాడు.
ఇవాళ షుగర్, బిపిలను మేనేజ్ చేసుకుంటూ అతి సులభంగా ఎనభై ఏళ్లు జీవిస్తూ ఉన్నాడు. పాలకుల, శ్రీమంతుల, నగర పెద్దల పిల్లలకు మాత్రమే పరిమితమైన గురుకుల విద్య నేడు సకల వర్గాలకు మిడ్ డే మీల్స్ విత్ బాయిల్డ్ ఎగ్ దొరుకుతూ ఉంది. గతం లోపాలను చెరిపేసుకుంటూ కాలాన్ని సరిదిద్దుకుంటూ మనిషి ముందుకు సాగడం వల్ల జరిగే మేళ్లు ఇవి.
మరి గత కాలాన్ని ఎందుకు గౌరవించాలి? విలువలకు. వెర్రిబాగులతనానికి. అకలుషితానికి. రుచికి. పరిమళానికి. బాంధవ్యాలకు. ఆపేక్షలకు. నిజాయితీకి. నిరాడంబరతకు. బాగా బతకాలని భవిష్యత్తు మీద ఆశ పెట్టుకునే మనిషి ఇవి లేకుండా బాగా బతకలేడు. ఏ మంచిని వదలుకుని ఏ చెడును ముందుకు తీసుకెళుతున్నావన్న కాల అప్రమత్తత మనిషికి ఉండాలి.
గతాన్ని లోడి, దాని గాయాలను కెలికి, అందులోని చెడు ఘటనలు వెలికి తీసి వాటిని ఎవరో ఒకరి ద్వేషానికి ఉపయోగిస్తూ, గతంలోని ఫలానా కారణం వల్ల భవిష్యత్తులో ఫలానా వారికి గుణపాఠం చెప్పాలి అని ప్రచారం చేస్తూ ఉంటే కనుక రాబోయే కాలం గడ్డుకాలమే అవుతుంది. గతంలోని ద్వేషం వద్దు. గతంలోని యుద్ధం వద్దు. గతంలోని దోపిడి వద్దు. గతంలోని ఎక్స్‌ప్లాయిటేషన్ వద్దు. గతంలోని పాపాలను భవిష్యత్తులో కడుక్కోవడానికి మాత్రమే మనిషి కాలాన్ని వారధి చేసుకోవాలి.
కొత్త సంవత్సరం వచ్చిన ప్రతిసారి మనిషి కాలం మీద ఆశ పెట్టుకునే వెల్‌కమ్ చెబుతాడు. గతం గతః అనుకుంటాడు. ఇకపై మంచి జరగాలని సగటు మనసుతో కోరుకుంటాడు. పాత బాధలను తలువనివ్వని కొత్త కాలం కోసం ప్రార్థనలు చేస్తాడు. కాని ప్రజల మంచికాలం పాలకుల గుప్పిట్లో ఉంది. ఒక ఫైల్ మీద బాధ్యత లేని సంతకం, అమానవీయ చట్టం, తప్పుడు నిర్ణయం ప్రజలకు చేటుకాలం తెస్తుంది.
‘తమకు మాత్రమే మంచి కాలం ఉండాలని’ పాలకులు ప్రజలకు చెడుకాలం తెచ్చి పెట్టినంత కాలం మన టైము బాగుంటుందని, బాగు పడుతుందని ఆశ పెట్టుకోవడం వృధా. మన కాలం బాగుండాలంటే పాలకులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. పాలనా వ్యవస్థలను హెచ్చరించగలగాలి. పరిపాలనను సరిదిద్దడానికి గట్టిగా నిలబడాలి. మన నొసటి కాలాన్ని మనమే రాసుకోవాలి. 2023లో అలా జరుగుతుందని ఆశిద్దాం. ఏమో... గుర్రం ఎగురా వచ్చు. హ్యాపీ న్యూ ఇయర్.
Comments
Please login to add a commentAdd a comment