గాలి ఎటు వీస్తున్నదో... అది ఏ గమ్యం చేరుతుందో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు తెలుసున్నంతగా దేశంలో మరే రాజకీయ నాయకుడికీ తెలియదని ఇప్పటికే ముద్రపడింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండగా ఆయన మరోసారి ఈ విన్యాసానికి తెరలేపారు. విపక్ష ఇండియా కూటమి ఏర్పాటులో చొరవ తీసుకుని, నాలుగైదు సమావేశాల్లో కూడా పాల్గొన్న నితీశ్ మరోసారి రంగు మార్చబోతున్నారని వారం రోజులుగా కథనాలు వస్తూనేవున్నాయి.
మరికొన్ని గంటల్లో ఆయన కాషాయ కూటమి తీర్థం పుచ్చుకుని తరించబోతున్నారని కథనాలు వెలువడుతున్న దశలో కూడా ఆయన మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. పరస్పర విరుద్ధ సంకేతాలిస్తూ కథను రక్తికట్టించటానికి ఆయన పార్టీ జేడీ(యూ) ప్రయత్నిస్తోంది. ఒకపక్క తదుపరి సర్కారు గురించి గవర్నర్‌తో మంతనాలు జరుపుతూ కూడా ‘మహాఘట్’ బంధన్ సర్కారు బాగానేవుంది.
మీడియా కథనాలన్నీ ఊహాగానాలే’ అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు ఉమేశ్ సింగ్ కుష్వాహా ప్రకటించటం ఎవరిని నమ్మించటానికో అర్థం కాదు. చిత్రమేమంటే మహాఘట్ బంధన్ కాపురాన్ని వదులుకోకుండానే... సీఎం పదవికి రాజీనామా చేయకుండానే ఆదివారం ఆయన నేతృత్వంలో ఏర్పడబోయే ఎన్డీయే సర్కారులో ఉపముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ఎవరెవరుండాలనే నిర్ణయాలు జరిగిపోతున్నాయి. పట్నా–ఢిల్లీ మధ్య ఫోన్‌లైన్లు బిజీ అయిపోయాయి.
బీజేపీలో బహిరంగంగానే హడావుడి కనబడుతోంది. ఎందుకిలా? ‘రాజకీయాల్లాంటి జూదం మరేదీ లేదు... అక్కడ కనిపించినంత ప్రస్ఫుటంగా మరెక్కడా వైపరీత్యాలు కనబడవు’ అని వెనకటికొక రాజనీతిజ్ఞుడు వ్యాఖ్యానించాడు. నితీశ్ పోకడలు గమనిస్తే అది అక్షరాలా నిజం అనిపిస్తుంది. ఆయన ఒక కూటమిలో వున్నంత కాలం మరో కూటమి ఆయన రాక కోసం ఎదురు చూస్తూ వుంటుంది. నితీశ్‌కు సీఎం పదవి కట్టబెట్టి ఆయన డిప్యూటీలుగా కొనసాగేందుకు రెండుచోట్లా నేతలు సిద్ధంగావుంటారు.
కూటములను మార్చటంలో నితీశ్‌ను తలదన్నే నేత దేశంలో మరెవరూ ఉండకపోవచ్చు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడొక్కరే బహుశా ఆ విషయంలో నితీశ్‌తో పోటీపడగలరు. ఎన్డీయేతో తన దశాబ్దకాల అనుబంధాన్ని 2013లో నితీశ్ తెంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. నరేంద్ర మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించటం అప్పట్లో ఆయనకు అభ్యంతరం అనిపించింది. తీరా 2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలవడం, కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఏర్పడటంతో సీఎం పదవికి రాజీనామా చేసి జీతన్‌రాం మాంఝీని ఆ పీఠంపై కూర్చోబెట్టారు. కానీ ఆ వైరాగ్యం మూన్నాళ్ల ముచ్చటే అయింది. కొన్ని నెలలకే ఆయన్ను తొలగించి తిరిగి సీఎం అయ్యారు.
2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి మహాగuŠ‡బంధన్ కూటమి కట్టి మరోసారి సీఎం అయ్యారు. కానీ రెండేళ్లు గడిచేసరికల్లా మళ్లీ ఎన్డీయే గూటికి చేరి మళ్లీ సీఎం అవతారమెత్తారు. మోదీ నాయకత్వాన్ని సంపూర్ణంగా ఆమోదించారు. తీరా 2022లో దాన్నుంచి బయటపడి మరోసారి మహాగuŠ‡బంధన్ సర్కారుకు సారథ్యం వహించారు. తాజాగా ఎన్డీయే కూట మిలో ప్రవేశం ఖరారైందన్న కథనాలు నిజమైతే ఆయన ముచ్చటగా మూడోసారి రంగు మార్చి నట్టు! 2005లో తొలిసారి సీఎంగా అయినప్పుడు మొదలుకొని ఈ పదిహేడేళ్లలో ఆయన పదహారేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. చిత్రమేమంటే ఆయన ఎన్నిసార్లు యూటర్న్‌లు తీసుకున్నా బిహార్‌లో కాస్త అటూ ఇటూగా ఆయన ప్రతిష్టకు ఏనాడూ ఇబ్బంది కలగలేదు.
లాలూ ప్రసాద్ యాదవ్, అటుపై ఆయన సతీమణి రబ్డీ దేవి ఏలుబడి సవ్యంగా వుంటే నితీశ్ ప్రాభవం ఈ స్థాయిలో ఉండేది కాదేమో! తన సొంత సామాజికవర్గం కుర్మీల బాగోగులు చూస్తూ బాగా వెనకబడిన కులాలనూ, మహాదళిత్ కులాలనూ సమాదరించి ‘కోటాలో కోటా’ కల్పించటం ఆయ నకు రాజకీయంగా కలిసొచ్చింది. అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యతనీయటంవల్ల ఆధిపత్య కులాల్లో కొంత అసంతృప్తి ఉన్నమాట నిజం. అలాగే బీజేపీతో తరచు దగ్గరవుతున్నందుకు ముస్లింలలోనూ నితీశ్‌పై కినుకవుంది. కానీ ఆయన్ను పూర్తిగా దూరం పెట్టేంత తీవ్ర వ్యతిరేకత ఆ వర్గాల్లో లేక పోవటం నితీశ్‌కు ఆమోదయోగ్యతను కల్పిస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లో బీసీల్లోనూ, దళితుల్లోనూఅత్యంత వెనకబడిన కులాల ఆదరణను సులభంగా పొందగలిగిన బీజేపీకి బిహార్‌లో నితీశ్ అండ దండలుంటేనే అది సాధ్యంకావటం జేడీ(యూ)కు తోడ్పడుతోంది. మన పార్లమెంటరీ పార్టీలకు సిద్ధాంత జంజాటం తక్కువ. కొంతకాలం క్రితంవరకూ వామ పక్షాల్లో, మితవాదపక్షాల్లో ఆ పట్టింపు ఎక్కువుండేది. కానీ ఓట్ల, సీట్ల వేటలో అది మసకబారింది. వామపక్షాలు బీజేపీని అంటరాని పార్టీగా చూస్తాయి తప్ప దాంతో జతకట్టినవారిపట్ల ఆ భావంవుండదు. వారు బయటపడిన మరుక్షణం పునీతులైనట్టే భావిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో గాలి వాలుకు తగినట్టు రంగులు మార్చే నితీశ్ వంటి వారి నుంచి మెరుగైన కార్యాచరణను ఆశించలేం.
ఆ సంగతలావుంచి ఇప్పటికే తృణమూల్ అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ రాష్ట్రంలోఇండియా కూటమితో పొత్తుండదని చెప్పిన తరుణంలో, పంజాబ్ ఆప్ నేత, సీఎం భగవంత్ మాన్ సైతం అదే బాణీ వినిపించిన నేపథ్యంలో నితీశ్ నిర్ణయం ఇండియా కూటమిని నామమాత్రావశిష్టం చేస్తుంది. నిర్దిష్టమైన సిద్ధాంతం లేనివారినీ, సులభంగా రంగులు మార్చే వారినీ, సూత్రబద్ధ రాజకీ యాలు అనుసరించలేని వారినీ వెంటేసుకుని కూటమి కట్టినంత మాత్రాన మెరుగైన ఫలితాలు రావని, ఎంత మాత్రమూ ప్రయోజనం ఉండదని విపక్షాలు ఇప్పటికైనా గ్రహించటం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment