అమెరికా అవాంఛనీయ చర్య | Sakshi Editorial On America Entry In Indian Ocean Water | Sakshi
Sakshi News home page

అమెరికా అవాంఛనీయ చర్య

Published Wed, Apr 14 2021 2:37 AM | Last Updated on Wed, Apr 14 2021 2:48 PM

Sakshi Editorial On America Entry In Indian Ocean Water

ముందస్తు అనుమతి లేకుండా హిందూ మహాసముద్ర జలాల్లోని మన ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజడ్‌) సమీపంలోకి అమెరికా నావికా దళం ఈ నెల 7న సంచరించింది. పైగా అదొక ఘన కార్యమన్నట్టు చాటింపు వేసుకుంది. పర్యాటక ఆసక్తితో దేశాలు సందర్శించేవారికి సైతం వర్తమాన ప్రపంచంలో నిబంధనలున్నాయి. అక్కడి ప్రభుత్వాలు రూపొందించుకున్న నిబంధనలు అనుమ తించినమేరకు మాత్రమే ఆ దేశాలు పర్యటించటానికైనా, అక్కడ శాశ్వత నివాసం ఏర్పరుచు కోవటానికైనా అవకాశం వుంటుంది. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన నౌక సాధారణమైనది కాదు. అది అమెరికా నావికా దళంలోని సప్తమ విభాగానికి చెందిన యుద్ధ నౌక. దానికి క్షిపణులను ధ్వంసం చేసే సామర్థ్యముంది. యుద్ధకాలంలో మినహా ఇతరత్రా సమయాల్లో మిత్ర దేశమైనా, శత్రు దేశ మైనా వేరొకరి గగనతలంలోకి లేదా వారి సముద్ర జలాల పరిధి సమీపంలోకి ప్రవేశించదల్చుకున్న ప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వటం ఆనవాయితీ. ఇందువల్ల అనవసర ఘర్షణలు నివారిం చటం లేదా దౌత్యపరంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చూడటం వీలవుతుంది. హిందూ మహా సముద్రంలోని లక్షద్వీప్‌ సమీప జలాల గుండా అమెరికా యుద్ధ నౌక వెళ్లటం ఈ కోణంలో అవాంఛనీయమైనది. ఈ నెల 7న తాము ఇటువైపుగా వచ్చామని అమెరికా నావికా దళం మరో మూడురోజుల తర్వాత ప్రకటించేవరకూ ఆ విషయం మన దేశ పౌరులెవరికీ తెలియదు. మన విదే శాంగ శాఖ ఆ యుద్ధ నౌక కదలికల గురించి ముందే కన్నేసివుంచామని ప్రకటించింది. అది పర్షి యన్‌ జలసంధి నుంచి మలకా జలసంధిలోకి వెళ్లేవరకూ నిరంతరాయంగా దాని కదలికలను పర్య వేక్షించామని, దౌత్య మార్గాల్లో నిరసన ప్రకటించామని తెలిపింది. ఆ సంగతిని మన ప్రభుత్వం అమెరికా ప్రకటనకన్నా ముందే వెల్లడించివుంటే బాగుండేది. మనం ఐక్యరాజ్యసమితి సముద్ర ఒడంబడికకు అనుగుణంగా వ్యవహరిస్తున్నామని, దాని ప్రకారమే సముద్ర జలాల్లో 12 మైళ్ల ప్రాంతాన్ని ప్రాదేశిక జలాలుగా, మరో 24 మైళ్ల ప్రాంతాన్ని ప్రాదేశిక జలాలకు ఆనుకొని వుండే ప్రాంతంగా, దాన్నుంచి 200 మైళ్ల వరకూ ఈఈజడ్‌గా పరిగణిస్తున్నామని, ఒక సార్వభౌమాధికార దేశంగా అది మన హక్కని విశ్వసిస్తున్నప్పుడు అమెరికా వైఖరి తప్పని ఆ క్షణమే బహిరంగంగా ప్రక టించాల్సింది. కానీ ఒడంబడికను ఉల్లంఘించిన దేశం ఆ పని చేసి మన నిస్సహాయతను చాటింది.

అంతర్జాతీయ ఒడంబడికపై మన అవగాహనకూ, అమెరికా అవగాహనకూ తేడావుంది. ఈ విషయంలో మనకే కాదు... ప్రపంచంలోని వేరే దేశాలకు కూడా అమెరికాతో విభేదాలున్నాయి. ఈ జాబితాలో అమెరికా మిత్ర, అమిత్ర దేశాలు రెండూ వున్నాయి. గత డిసెంబర్‌ 24న దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని కాన్‌ దావో దీవుల సమీప జలాల గుండా అమెరికా యుద్ధ నౌక వెళ్లింది. మొన్న ఫిబ్రవరిలో మరో యుద్ధ నౌక అక్కడే స్పార్టీ. దీవుల సమీపం నుంచి వెళ్లింది. మార్చి 31న దక్షిణ కొరియాకు చెందిన కుక్‌–టో దీవుల సమీపంనుంచి, ఈ నెల 3న శ్రీలంక సముద్ర జలాల పరిధి మీదుగా అమెరికా యుద్ధ నౌకలు ప్రయాణించాయి. ఈనెల 7న మనతోపాటు మాల్దీవుల హక్కును కూడా అది ధిక్కరించింది. 1995లో కుదిరిన అంతర్జాతీయ ఒడంబడికను వాస్తవానికి అమెరికా ఇంతవరకూ ధ్రువీకరించలేదు. దాన్ని ధ్రువీకరించిన మన దేశం అందుకొక షరతు విధిం చింది. ఈఈజడ్‌ పరిధిలోకి విదేశీ యుద్ధ నౌకలు ప్రవేశించాలంటే ముందస్తుగా భారత్‌కు తెలియ జేయాలన్నది దాని సారాంశం. వాణిజ్య నౌకలకు ఈ నిబంధన వర్తించదు. చైనా మాత్రం తమ ఈఈజడ్‌ పరిధిలోకి అనుమతిలేకుండా అన్యులెవరూ రాకూడదని నిర్దేశించింది. అన్నిరకాల నౌక లకూ ఇది వర్తిస్తుంది. అంతేకాదు... విశాల సముద్ర ప్రాంతం తన ఈఈజడ్‌గా చెప్పుకోవటం కోసం అది కృత్రిమంగా పగడాల దిబ్బలు నెలకొల్పింది. దాంతో ఆ ప్రాంతంలో వేరే దేశాల వాణిజ్య నౌకల గమనానికి అవకాశం వుండటంలేదు.

ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో చైనాకూ, అమెరి కాకూ నడుస్తున్న లడాయి అదే. ఇందుకు మన దేశం కూడా మద్దతునిస్తోంది. అసలంటూ అంత ర్జాతీయ ఒడంబడిక వున్నప్పుడు ఏ దేశానికా దేశం దానికి తూట్లు పొడిచేలా సొంత నిబం ధనలు ఏర్పాటు చేసుకోవటం ఏమిటన్నది అమెరికా ప్రశ్న. కానీ ఇలా ప్రశ్నించడానికి నైతికంగా తన కేమి హక్కుందో ఆ దేశం తనను తాను ప్రశ్నించుకోవాలి. ఆ ఒడంబడికను పాతికేళ్లుగా ధ్రువీకరించ కుండా కాలక్షేపం చేస్తున్న అమెరికా... దాన్ని ధ్రువీకరిస్తూనే తమ తమ అవసరాలకు అనుగుణంగా ఒకటి రెండు షరతులు విధిస్తున్న దేశాలను తప్పు పట్టడం పరమ విడ్డూరం. అమెరికా తూర్పు ప్రాంతాన అట్లాంటిక్‌ మహా సముద్రం వుంది. దాని పడమరన పసిఫిక్‌ మహాసముద్రముంది. ఆ ప్రాంతాల్లోకి వేరే దేశానికి చెందిన యుద్ధ నౌక సంగతలావుంచి, వాణిజ్య నౌకనైనా అమెరికా అను మతించకపోవచ్చు. అదేమంటే...అంతర్జాతీయ ఒడంబడికను ధ్రువీకరించలేదని చెప్పవచ్చు. కానీ వేరే దేశాల విషయానికొచ్చినప్పుడు ‘ధ్రువీకరించాక సొంతంగా నిబంధనలెందుకు విధిస్తార’ని ప్రశ్నించవచ్చు. ఈ తర్కంతో ఒకపక్క స్వప్రయోజనాలను పరిరక్షించుకుంటూనే మరోపక్క దబా యించటం అమెరికాకే చెల్లింది. అనుమతిలేకుండా మన ఈఈజడ్‌ పరిధి సమీపంలోకి రావటం ఎంత తప్పో, దాన్ని సమర్థించుకుంటూ అది చేసిన ప్రకటన కూడా అంతే తప్పు. అందులో మిత్ర స్వరం లేదు. స్వేచ్ఛాయత నౌకా హక్కును చాటడం కోసంభారత్‌తోసహా ఎక్కడైనా మున్ముందు కూడా ఇలాగే చేస్తామని ఆ ప్రకటన చెబుతోంది. దేశాల మధ్య మిత్ర సంబంధాలు పరస్పర గౌరవ మర్యాదల ప్రాతిపదికగా వుండాలి. ఇచ్చిపుచ్చుకునే వైఖరితో మెలగాలి. పెద్దన్న పాత్ర పోషిస్తా మని, పెత్తనం చలాయిస్తామని... దానికి అందరూ తలొగ్గి వుండాలని భావిస్తే అది చెల్లదని అమె రికా గుర్తెరిగేలా చేయటం మన తక్షణ కర్తవ్యం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement