మూడు దశాబ్దాల అమానవీయ రాజకీయ వ్యవస్థ తన మరణ వాఙ్మూలాన్ని లిఖించవలసిన పరిస్థితులు పొడసూపు తున్నాయి. సమతామమతలతో కూడిన ఒక సరికొత్త సామాజిక పొందిక తన జనన నమోదుకు గుర్తుగా జేగంట మోగిస్తున్నది. ఎట్టకేలకు మన కపట రాజనీతి సామ్రాట్టు చట్టం చేతికి చిక్కి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన పెత్తందారీ పరిపాలన పాపాలు ఒక్కొక్కటిగా బోనెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్తకోణం ఆవిష్కృత మవుతున్నది.
తనను అన్యాయంగా కేసులో ఇరికించారని మనకాలపు మాకియవెలీ న్యాయాధికారి ఎదుట బుకాయిస్తున్న సమయంలోనే రాష్ట్రంలో ఒక అబ్బురం చోటుచేసుకున్నది. పెత్తందారీ పాలనలో అణగారిపోయిన పేదవర్గాల్లో మొగ్గతొడిగిన బాల్యం అంతర్జాతీయ వేదిక మీద గొంతు సవరించుకున్నది. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న పదిమంది బాలలు ఐక్యరాజ్యసమితి వేదికలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై ఎలుగెత్తారు. విఖ్యాత కొలంబియా విశ్వవిద్యాలయంలో ధైర్యంగా మాట్లాడారు. విద్య, వైద్య రంగాల్లో తమ కళ్లెదుటనే విప్పారుతున్న మరో ప్రపంచపు కాంతి కిరణాలను గురించి వివరంగా చెప్పారు.
యాదృచ్ఛికమే కావచ్చు కానీ, సరిగ్గా అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇంటర్నేషనల్ బకలోరియేట్ (ఐబీ) సంస్థతో ఒక ఒప్పందాన్ని చేసుకున్నది. ఈ ఒప్పందం ప్రకారం ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో క్రమానుగతంగా ఐబీ సిలబస్‌ను ప్రవేశపెడతారు. ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే పాఠశాల విద్యా సిలబస్ ఇది.
ఈ విధానంలో చదువుకునే పిల్లలపై మానసిక ఒత్తిడి ఉండదు. వారిలోని సృజనశీలతను వెలికితీసే విధంగా ఉంటుంది. హేతుబద్ధమైన స్వతంత్ర ఆలోచనా ధోరణి అలవడుతుంది. తార్కిక వివేచన అబ్బుతుంది. క్లిష్టమైన విషయాలను కూడా సులభగ్రాహ్యం చేసుకోగల నైపుణ్యం ఒంటబడుతుంది.
ప్రపంచం మొత్తం మీద మూడు వేల స్కూళ్లలో, భారతదేశంలో రెండొందల కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే ఈ సిలబస్ అందుబాటులో ఉన్నది. చదివే క్లాసును బట్టి, స్కూల్ స్థాయిని బట్టి ఏటా ఆరు లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. అంటే పట్టణ ప్రాంతాల్లోని అత్యంత సంపన్నులైన వారి పిల్లలకు మాత్రమే ఐబీ సిలబస్ అందుబాటులో ఉన్నది. వైఎస్ జగన్ ప్రభుత్వం అంత ఖరీదైన విద్యను ప్రభుత్వ బడుల్లో చదివే పేద పిల్లలందరికీ ఉచితంగా అందుబాటులోకి తేబోతున్నది. మొదటి సంవత్సరం ఒకటో క్లాసుతో ప్రారంభించి ఏటా ఒక క్లాసును పెంచుకుంటూ వెళ్తారని సమాచారం.
ఇదొక నిశ్శబ్ద విప్లవం. వచ్చే పన్నెండేళ్లలో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరూ ప్రతిష్ఠాత్మకమైన ఐబీ గొడుగు కిందకు వస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు ఇరవై లక్షలమందిని ఐబీ విద్యావిధానం తీర్చి దిద్దుతున్నది. ఏపీ ప్రభుత్వ బడుల్లో ఇప్పుడే యాభై లక్షల మంది చదువుతున్నారు. ఇంకో పన్నెండేళ్ల తరువాత ఎంత మంది ఉంటారో అంచనా వేయగలిగితే ఇప్పుడు పడిన అడుగు ఎంత విప్లవాత్మకమైనదో అర్థమవుతుంది. అప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఐబీ విద్యార్థుల సంఖ్య ఇంకా పెరుగుతుం దనుకున్నా కూడా బహుశా సగంమంది ఏపీలోనే ఉంటారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య – వైద్యరంగాలకు తొలి ప్రాధాన్యతనిస్తూ ‘నాడు – నేడు’ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొమ్మిదేళ్లు పనిచేసిన కాలంలోనే ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేయడం ప్రారంభమైంది. విభజిత రాష్ట్రంలోనూ అదే పంథా కొనసాగింది.
ఫలితంగా పేదపిల్లలకు నాణ్యమైన చదువు లభించక ఉన్నత స్థానాలకు చేరుకోలేకపోయారు. చాలామంది డ్రాపవుట్లుగా మిగిలి పోయారు. మధ్యతరగతి ప్రజలు పిల్లల చదువుల కోసం రుణభారంలో కూరుకుపోవడం సర్వ సాధారణమై పోయింది. ఆ పరిస్థితిని ‘నాడు–నేడు’ కార్య క్రమం చక్కదిద్దిందనేది మన కళ్లముందటే కదలాడుతున్న చరిత్ర.
పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడంతోనే ఆగిపోలేదు. పోటీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంగ్లిషు మీడియంతోపాటు సీబీఎస్‌ఇ సిలబస్‌ను కూడా ప్రవేశ పెట్టారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనని ప్రకటించిన జగన్‌మోహన్‌రెడ్డి ఆ ఆస్తి విలువను అనేక రెట్లు పెంచడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టారు. అప్పటికే కనాకష్టం మీద ప్రైవేట్ స్కూళ్లలో పిల్లల్ని చదివిస్తున్న తల్లులను నిరుత్సాహపరచకుండా ‘అమ్మ ఒడి’ పథకాన్ని వారికి కూడా వర్తింపజేశారు.
ఇంగ్లిషు మీడియంలోకి పిల్లలు సులభంగా ప్రవేశించడానికి వీలుగా ఒకటి నుంచి పదో క్లాసు వరకు ద్విభాషా పాఠ్యపుస్తకాలను అందరికీ అందజేస్తున్నారు. ‘విద్యాకానుక’ కింద పాఠ్య పుస్తకాలతోపాటు మూడు జతల యూనిఫాం, నోట్‌బుక్కులు, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ, బూట్లు, బెల్టును కూడా స్కూళ్లు తెరిచే తొలిరోజు నాటికే ఉచితంగా అందజేస్తున్నారు.
పేదలు, మధ్యతరగతి ప్రజల మీది నుంచి పిల్లల చదువు భారాన్ని పూర్తిగా తొలగించి జగన్ ప్రభుత్వం తన భుజాలపైకి ఎత్తుకున్నది. ఇంగ్లిష్ మీడియంతోపాటు మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లలు ముందడుగు వేయడం కోసం డిజిటల్ బోధనా విధానాన్ని ప్రభుత్వ స్కూళ్లలో విస్తృతంగా ప్రవేశ పెట్టిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
8వ తరగతి నుంచి ఆపైన చదివే విద్యార్థులకు ట్యాబ్‌లను అందజేసింది. పాఠ్యాంశాల్లో తమ ప్రావీణ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడం కోసం ట్యాబ్‌ల ద్వారా ఖరీదైన ‘బైజూస్’ కంటెంట్‌ను అందు బాటులోకి తెచ్చింది. ఆరు నుంచి పదో క్లాస్ వరకు అన్ని తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది.
ఒక్క ఉదాహరణ చాలు – చంద్రబాబు పరిపాలనా కాలంలో మొత్తం పాఠశాల విద్యార్థుల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల సంఖ్య 50 శాతానికి పడిపోయింది. ఆ యాభై శాతం మంది కూడా మరో గత్యంతరం లేక మిగిలి పోయినవారే! నాలుగేళ్లలో అది 60 శాతానికి పెరిగింది. ‘అమ్మ ఒడి’ కూడా అందుతున్న నేపథ్యంలో పెద్దక్లాసు పిల్లలు మధ్యలో స్కూల్ మారడం ఇష్టంలేక ఉండిపోతున్నారు.
లేకుంటే ఈ శాతం మరింత పెరిగేది. ఒకటి నుంచి ఎనిమిదో క్లాస్ వరకు లెక్కిస్తే చేరికలు చంద్రబాబు హయాంలో 75 శాతం గరిష్ఠంగా ఉండగా ఇప్పుడది 100 శాతాన్ని దాటింది. అంటే హౌస్‌ఫుల్, ఎక్స్‌ట్రా బెంచ్ అన్నమాట! జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనలు ఉన్నత విద్యారంగాన్ని ఉద్దీపనం చేశాయి. ఎంతగా అంటే జాతీయ స్థాయిలో ఉన్నత విద్యారంగం చేరికల్లో 3.8 శాతం పెరుగుదల ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో 14.81 శాతం నమోదైంది.
ఇది చాలు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి! 2018–19లో క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా 37 వేలమందికి ఉద్యోగాలు లభిస్తే 2022–23లో ఒక లక్షా 20 వేలమందికి ఉద్యోగాలు లభించాయి. చేరికల్లోనూ, నియామ కాల్లోనూ నాలుగేళ్లలో నాలుగు రెట్లు ప్రగతి.
‘మేం బాలికలం, ఈ ప్రపంచాన్ని ఏలడానికి సిద్ధంగా ఉన్నామ’ని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిన యువజన సదస్సులో ఏపీ బాలిక రాజేశ్వరి సభావేదిక మీది నుంచి ప్రకటించింది. ఈ ప్రకటన హాజరైన సభికులను ముగ్ధుల్ని చేసింది. రాజేశ్వరి ఏపీలోని నంద్యాల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థిని.
ఆంగ్లభాషలో అనర్గళంగా, నిర్భయంగా అంతర్జాతీయ వేదికపై మాట్లాడటం చాలామంది గమనించి ఉండవచ్చు. మరో ఏపీ బాలిక షేక్ అమ్మజాన్ కూడా అంతే ధాటిగా మాట్లాడి ఆకట్టుకున్నది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నాలుగేళ్లలో ప్రారంభమైన విద్యా విప్లవం రాజేశ్వరి, అమ్మజాన్ వంటి వందలాదిమంది పేదింటి బిడ్డల్ని నాయ కత్వ శ్రేణుల్లో నిలబెట్టింది.
ఆధిపత్య శక్తులు లేదా పెత్తందారీ వర్గాలు ఏరకమైన విప్లవాన్నీ సహించవు. విద్యావిప్లవాన్ని కూడా సహించలేదు. ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టినప్పుడే సాంస్కృతిక దాడికి పూనుకున్నారు. దీన్ని తెలుగు భాషపై జరుగుతున్న దాడిగా చిత్రించేందుకు చంద్రబాబు – యెల్లో మీడియా తెగ ప్రయాస పడ్డారు.
తమ పిల్లల్ని ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తూ పేదల పిల్లల్ని మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలని శాసిస్తున్న పెత్తందారీ శక్తుల అంతరంగాన్ని జనం గమనించారు. ప్రభుత్వ బడుల్లో ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టే ప్రయత్నాలపై కూడా యెల్లో మీడియా అవాకులు చెవాకులు పేలడం తాజా ఉదాహరణ.
ఇప్పుడు సర్వహంగులతో తీర్చిదిద్దిన ప్రభుత్వ స్కూళ్లపై పెత్తందారుల కన్ను పడింది. పొరపాటున అధికారంలోకి వస్తే ఈ స్కూళ్ల నిర్వహణను నారాయణ సంస్థలకు అప్పగించే ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నారు. అప్పుడిక నారా యణకు ఫీజులు చెల్లించి చదువుకోవలసిన దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడతాయి. అధికారంలో ఉన్నప్పుడే ప్రభుత్వ స్కూల్ భవనాలనూ, స్థలాలనూ నారాయణకు అప్పగించే ప్రయత్నం జరిగింది. మరోసారి చంద్రబాబు గెలిచి ఉంటే పేద పిల్లలకు చెట్టుకింది చదువులే మిగిలి ఉండేవి.
ఈ పరిస్థితి ఒక్క విద్యారంగానికే పరిమితమైనది కాదు. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టుకున్న వైద్యం, వ్యవసాయ రంగాలపై కూడా పెత్తందారీ శక్తులు కన్నేస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు భిన్న ప్రయోజనాల పట్ల వైరుద్ధ్యంగా, ఆ వైరుద్ధ్యం పోరాటంగా రూపుదిద్దుకున్నాయి. పేదల సంక్షేమాన్ని గాలికొదిలేసి పెత్తందార్లను మేపే విధానం చంద్రబాబు పార్టీది. ఆయన పద్నాలుగేళ్ల పాలనలో అనేకమార్లు రుజువైన నగ్నసత్యమిది.
పెత్తందారీ శక్తుల కరదీపికగా యెల్లో మీడియా పనిచేస్తున్నదని కూడా పలుమార్లు రుజువైంది. బలహీనవర్గాల నుంచి ఎదిగిన నాయకులపై హీనంగా, అవమానకరంగా బ్యానర్ వార్తలు వండి వార్చిన నేపథ్యం ఈ మీడియాది. కనుక పేద ప్రజలు, బలహీనవర్గాలు, మహిళల సాధికారత లక్ష్యంగా ప్రత్యామ్నాయ ఎజెండాను భుజాన వేసుకున్న జగన్‌మోహన్‌రెడ్డిని ఏమాత్రం సహించే స్థితిలో రాష్ట్రంలోని పెత్తందార్ల పార్టీ, వారి మీడియా లేదన్నది ఒక బహిరంగ రహస్యం.
రాష్ట్ర రాజకీయ పోరాటాల అంతస్సారం ఇదే. పెత్తందారీ వర్గాలు, పేదల ప్రయోజనాలకు మధ్య వైరుద్ధ్యం, పోరాటం. ఈ సారాన్ని పేదలు, బలహీనవర్గాల ప్రజలు గ్రహించారు గనుకనే చంద్రబాబు కూటమికి భవిష్యత్తుపై బెంగ పట్టుకున్నది. అన్నిరకాల అవకాశవాద పొత్తుల కోసం అర్రులు చాస్తున్నది ఈ బెంగతోనే! ఈ నేపథ్యంలో వచ్చిన అవినీతి కేసును సానుభూతి కోసం ఉపయోగించుకు నేందుకు ఆ కూటమి పడరాని పాట్లు పడుతున్నది. కానీ, జనస్పందన శూన్యం.
అవినీతిలో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయస్థానాలు కూడా భావించడంతో వారు ఆశించిన సానుభూతి రావడం లేదు. కనీసం తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యులు సైతం వీధుల్లోకి రాని దైన్యం ఆ పార్టీని వెన్నాడుతున్నది. కేవలం చంద్రబాబు సొంత సామాజికవర్గం యువతీ యువకుల్ని రెచ్చగొట్టడం ద్వారా అక్కడక్కడా ప్రదర్శనలు చేసి మమ అనిపిస్తున్నారు.
నిజానికి యాభయ్యేళ్లకు పూర్వం వరకు ప్రగతిశీల భావాలతో పరుగుతీసిన సామాజిక వర్గమే అది. కానీ చంద్రబాబు బ్రాండ్ స్వార్థ సంకుచిత రాజకీయాలు, యెల్లో మీడియా పెద్దల అవసరాల కోసం జనజీవన స్రవంతి నుంచి ఆ పాయను వేరుచేసి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
వికసించిన విద్వత్తేజం!
Published Sun, Sep 24 2023 12:50 AM | Last Updated on Sun, Sep 24 2023 1:20 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment