ఇలాగైతే ఎలాగ? | Sakshi Editorial On Corona Third Wave | Sakshi
Sakshi News home page

ఇలాగైతే ఎలాగ?

Published Thu, Jul 15 2021 1:04 AM | Last Updated on Thu, Jul 15 2021 5:10 AM

Sakshi Editorial On Corona Third Wave

తెలివిగల వాడు తొలిసారే తెలుసుకుంటాడు. తెలివితక్కువ వాళ్ళే నాలుగు చోట్ల అంటించుకున్న తరువాత కూడా తెలుసుకోరు! ఇది చిన్నప్పుడు మనకు పెద్దలు చెప్పే మాట. కరోనా విషయంలో అందరం మరోసారి గుర్తుతెచ్చుకోవాల్సిన మాట. కరోనా మొదటి ఉధృతిని తట్టుకొని, రెండో ఉధృతికి తల్లడిల్లి, అది ఇంకా పూర్తిగా తగ్గిందో లేదో తెలియక ముందే, రకరకాల వేరియంట్లు విదేశాల్లో వ్యాపిస్తున్నాయని వింటున్నా... వినోదాలు, విహారాలంటూ జనం గుంపులుగా చూపుతున్న తెలివితక్కువతనం చూస్తే ఏమనాలి? ఇంగ్లిష్‌లో కొత్తగా వచ్చిన ‘కోవిడియట్స్‌’ పదం స్ఫురణకు వస్తుంది. జనం ఇలా ఉంటే, కొందరు పాలకులు ‘కావడ్‌ యాత్ర’ (శివభక్తుల కావడియాత్ర) లాంటి సామూహిక ఉత్సవాలు, ఉప ఎన్నికలంటూ ఉత్సాహపడడం ఇంకా విడ్డూరం. ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే ప్రయత్నాల్ని అర్థం చేసుకోగలం కానీ, అర్థరహిత ప్రయత్నాలను ఎలా సమర్థించాలి?

వద్దు బాబోయ్‌ అనుకుంటున్న కరోనా థర్డ్‌ వేవ్‌ ఇప్పుడీ సామూహిక మూర్ఖత్వంతో ముందుకు చొచ్చుకువస్తే... అప్పుడు లెక్కలు వేసుకొని ఏం ప్రయోజనం? కరోనా ఎక్కువున్న ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో ప్రధాని  మాట్లాడుతూ చెప్పిన అప్రమత్తత కానీ, ‘‘థర్డ్‌ వేవ్‌ అనివార్యం’’ అంటూ భారత వైద్య సంఘం (ఐఎంఏ) చేసిన హెచ్చరిక కానీ తప్పనిసరిగా చెవికెక్కించుకోవాల్సినవే! ఈశాన్యం లోనే కాదు... దక్షిణాదిన కేరళ, మహారాష్ట్రల్లో మళ్ళీ కేసులు గణనీయంగా పెరుగుతుండడం గమ నార్హం. ‘టెస్ట్‌ పాజిటివిటీ రేటు’ కేరళలో కొన్నిచోట్ల 10 శాతం పైన, మహారాష్ట్రలో 4.5 శాతం ఉంది. అలాగే, కరోనా వ్యాప్తి వేగాన్ని సూచించే ‘ఆర్‌–వ్యాల్యూ’ కూడా ఈ జూలైలో పెరుగుతున్నట్టు ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమేటికల్‌ సైన్సెస్‌’ పరిశోధకులు తేల్చారు. ఇది పారా హుషార్‌ పరిస్థితి. ఈ ఏడాది ఫిబ్రవరిలో సరిగ్గా ఇలాగే జాగ్రత్తలు గాలికి వదిలేయడం వల్ల ‘ఆర్‌–వ్యాల్యూ’ పెరిగింది. ఏప్రిల్‌కి సెకండ్‌ వేవ్‌గా పరిణమించింది. కర్ణుడి చావుకు మల్లే ఈ దుఃస్థితికీ అనేక కారణాలు. అనేక రాష్ట్రాల్లో టెస్టుల సంఖ్య, అలాగే వేస్తున్న టీకాల సంఖ్య మునుపటి కన్నా బాగా తగ్గడం ఆందోళనకరం. జూన్‌ 19 నుంచి మొదలైన వారంలో దేశ వ్యాప్తంగా 4.12 కోట్ల టీకాలు వేస్తే, నెల తరువాత ఇప్పుడీ వారంలో కేవలం 91 లక్షల టీకాలే వేస్తున్నట్టు అంచనా. దీనికి అనేక రాష్ట్రాల్లో టీకా కొరత ఓ కారణం. దేశరాజధానిలో కోవిషీల్డ్‌ కొరత. ఒడిశా, మధ్యప్రదేశ్‌లలో సరుకు లేక అనేక జిల్లాల్లో టీకాలు వేయడం ఆపేశారు. ఒకటి రెండు రోజులు టీకాలు వేయడం, తరువాత చాలా రోజులు టీకా కేంద్రాలను మూసేయడం– ఇదీ పరిస్థితి. ఇలా టీకాల కొరత ఉందంటూ రాష్ట్రాలు గగ్గోలు పెడుతుంటే, కొత్తగా ఆరోగ్య శాఖ బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి అవన్నీ అర్థం లేని వాదనలంటున్నారు. ఎప్పుడు, ఎన్ని డోసుల టీకాలు కేంద్రం నుంచి అందుతాయో ముందుగానే రాష్ట్రాలకు తెలుసంటున్నారు. జూన్‌లో లాగానే ఈ నెలకూ రాష్ట్రాలకు 12 కోట్ల డోసులు కేటాయిం చామనీ, వాటిని ఎలా వాడాలనే విషయంలో రాష్ట్రాలకు ప్రణాళిక లోపించిందనీ కేంద్రం వాదన.

పరస్పర నిందారోపణల బదులు పరిష్కారం ఆలోచించడం తక్షణ కర్తవ్యం. ప్రైవేటు రంగంలో టీకాలు వేగంగా జరగనిచోట వాటికి కేటాయిస్తున్న టీకాలను తగ్గించడమో, ఆ విచక్షణను రాష్ట్రాలకు అప్పగించడమో కేంద్రం చేయవచ్చు. అలాగే, టీకా ఉత్పత్తిదారులు ఇప్పుడు నెలకు 12 కోట్ల డోసులే సరఫరా చేస్తున్నారు. ఈ ఆగస్టు కల్లా రోజుకు 30 కోట్ల డోసులు అందించేలా ప్రోత్సహిస్తే మేలు. దీనివల్ల రోజుకు కోటి మందికి టీకా వేయాలనే లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఏడాది చివరికల్లా దేశంలోని వయోజనులందరికీ టీకాలు వేసేయవచ్చు. ఇది ఓ పెద్ద సవాలే. ఇప్పటి ఉత్పత్తి, టీకాలేసే వేగం సరిపోవనీ, అదనపు ప్రణాళిక – ఆచరణ ముఖ్యమనీ పాలకులు గ్రహించాలి.

అదే సమయంలో ప్రజలు, పాలకులు పాత తప్పులు మళ్ళీ చేస్తేనే పెద్ద చిక్కు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కరోనా జాగ్రత్తలు గాలికి వదిలేసి, కుంభమేళాలో లక్షల మంది గుమిగూడే స్వేచ్ఛ నిచ్చారు. ఫలితం– ఆ నెల మొదట్లో దేశంలో కేసులు 80 వేలుంటే, నెలాఖరుకు దాదాపు 4 లక్షలకు చేరాయి. ఇప్పుడు ఉత్తరాదిన పక్షం రోజుల పాటు సాగే ప్రసిద్ధ ‘కావడ్‌ యాత్ర’ రానుంది. యూపీ, హర్యానా, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌ తదితర అనేక రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు హరిద్వార్‌ వెళ్ళి గంగాజలం తెచ్చుకొని, దారి పొడవునా ఆలయాల్లో శివుడికి అభిషేకిస్తారు. విమర్శలు తలెత్తడంతో ఉత్తరాఖండ్, ఒడిశా లాంటివి ఈ యాత్రను ఈసారి రద్దు చేశాయి. కానీ, ఎన్నికలు రానున్న ఉత్తరప్రదేశ్‌ పాలకులు మాత్రం షరతులతో కూడిన అనుమతులు ఇస్తామంటున్నారు. దీనిపై సుప్రీం కోర్టు కేంద్ర, యూపీ సర్కార్లకు నోటీసివ్వడం గమనార్హం.

భక్తివిశ్వాసాలను గౌరవిస్తూనే, అందరూ షరతులకు కట్టుబడేలా చూడడం ఏ ప్రభుత్వానికైనా ఆచరణలో అసాధ్యమే. సౌదీ అరేబియా సైతం వరుసగా ఈ రెండో ఏడాది కూడా ఇతర దేశస్థులను హజ్‌ యాత్రకు అనుమతించడం లేదని గుర్తించాలి. ఇప్పటికే వరుస ఉత్సవాల సీజన్‌ మొదలై, టీకాలూ కొరతగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాలకూ అప్రమత్తతే శరణ్యం. గుంపుగా బయట తిరిగింది... భక్తి కోసమా, భుక్తి కోసమా, వారాంతపు రక్తి కోసమా లాంటి విచక్షణ కరోనాకు పట్టదు. గుమిగూడితే వ్యాపించడమే దాని లక్షణం. అవును... థర్డ్‌ వేవ్‌ దానంతట అది రాదు. అజాగ్రత్త, అశ్రద్ధతో కోరికొని తెచ్చుకొంటేనే ఉధృతంగా వస్తుంది. గడప దాటే లోగానే మహ మ్మారిని మళ్ళీ ఇంట్లోకి పిలిస్తే ఆ తప్పు ముమ్మాటికీ మనదే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement