సంపన్న దేశాల కర్తవ్యం | Sakshi Editorial On G-20 Summit At Delhi | Sakshi
Sakshi News home page

సంపన్న దేశాల కర్తవ్యం

Published Sat, Sep 9 2023 12:52 AM | Last Updated on Sat, Sep 9 2023 12:52 AM

Sakshi Editorial On G-20 Summit At Delhi

నేటి నుంచి ప్రారంభం కాబోయే రెండు రోజుల జీ–20 శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ సర్వసన్నద్ధమైంది. ఈ చరిత్రాత్మక సమావేశాలకు వివిధ దేశాధినేతలతోపాటు తరలివచ్చే వారి మంత్రులు, ఉన్నతాధికార గణం, వేలాదిమంది సిబ్బందితో దేశ రాజధాని నగరం సందడిగా మారింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా తదితరులు ఢిల్లీ చేరుకున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 85 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలు జీ–20లో సభ్యదేశాలుగా ఉన్నాయి. భారత్‌కు అధ్యక్ష హోదా వంతులవారీగా వచ్చిందే కావొచ్చుగానీ, వచ్చిన సమయం అత్యంత కీలకమైనది.

కరోనా మహమ్మారి పర్యవసానంగా ప్రపంచం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అంతో ఇంతో కోలుకుంటుండగా ఉక్రెయిన్‌లో రష్యా మొదలెట్టిన దురాక్రమణ యుద్ధం మరింత కుంగదీసింది. పైకి రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య పోరుగా కనబడుతున్నా అక్కడ వాస్తవంగా తలపడుతున్నది అమెరికా, రష్యాలే. ఇటు అమెరికా–చైనాల మధ్య తీవ్ర వైరుధ్యాలు న్నాయి. చైనాకూ మనకూ మధ్య ఉన్న సమస్యలు సరేసరి. సరిహద్దుల్లో ఏదో సాకుతో గిల్లికజ్జాలకు దిగటం, కొత్త మ్యాప్‌లు ముద్రిస్తూ కవ్వించాలని చూడటం చైనాకు రివాజైంది.

ఈ సమస్యలేవీ జీ–20లో ప్రస్తావనకు రాకున్నా, ఎజెండాలో ఈ అంశాలే లేకున్నా, వాటి నీలినీడలు శిఖరాగ్ర సదస్సుపై పడకతప్పదు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఈ సమావేశాలకు హాజరు కాబోరని ఆ దేశం ప్రకటించింది. ఉక్రెయిన్‌ విషయంలో అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్‌ నేపథ్యమే ఇందుకు కారణం. ఇక అమెరికాతోపాటు మనపైనున్న కంటగింపు పర్యవసానంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ముఖం చాటేశారు. ఆయన బదులు పెద్దగా అధికారాలు లేని ప్రధాని లీ కియాంగ్‌ను ఆ దేశం పంపుతోంది.  

ప్రపంచ ఆర్థిక, ద్రవ్య సంబంధ అంశాలతోపాటు మారిన కాలానికి అనుగుణమైన నియంత్రణ వ్యవస్థలను అమల్లోకి తీసుకురావటం, వాతావరణ సమస్యలు, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలు, కార్పొరేట్‌ దిగ్గజ సంస్థలపై విధించే పన్నులు, బహువిధ అభివృద్ధి బ్యాంకులను వర్తమాన అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దటం వంటి అంశాలు జీ–20లో ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి. వీటన్నిటిపైనా ఎంతవరకూ ఏకాభిప్రాయం కుదురుతుందో, శిఖరాగ్ర సమావేశాల అనంతరం సంయుక్త ప్రకటన వెలువడేందుకు ఏమాత్రం అవకాశం ఉంటుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.

‘ఒకే భూమి – ఒకే కుటుంబం – ఒకే భవిష్యత్తు’ మకుటంతో నిర్వహిస్తున్న ఈ శిఖరాగ్ర సదస్సు విజయ వంతమైతే ఆ కీర్తిప్రతిష్ఠలు మనకే దక్కుతాయి. అయితే దేశాలు చీలికలు పేలికలుగా విడిపోయిన వర్తమాన యుగంలో అదెంతవరకూ సాధ్యమో చెప్పలేం. మారిన అంతర్జాతీయ పరిస్థితులు ఐక్యరాజ్యసమితి మొదలుకొని డబ్ల్యూహెచ్‌ఓ, డబ్ల్యూటీవో వరకూ అనేకానేక వేదికలపై ప్రతిబింబిస్తున్నప్పుడు జీ–20 వాటికి భిన్నంగా ఉండాలనుకోవటం అత్యాశే కావొచ్చు. కానీ సామరస్యత కోసం ప్రయత్నించటం కొనసాగాలి.

రష్యా, చైనా ఒక పక్క– అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి సంపన్న దేశాలు మరో పక్క మోహరించివున్న ప్రస్తుత వాతావరణంలో పేద దేశాల స్వరాన్ని గట్టిగా వినిపించాల్సిన చారిత్రక అవసరం ఎంతో ఉంది. ధనిక, బీద దేశాలకు సభ్యత్వం ఉండి, వాటిమధ్య సంభాషణలు సాగే అతి తక్కువ అంతర్జాతీయ వేదికల్లో జీ–20 ఒకటి. అగ్ర దేశాల పంచాయతీకే ఈ సంస్థ పరిమితమైతే పేద దేశాల సమస్యలకు చోటుండదు. పేద దేశాల సమస్యలు సాధారణమైనవి కాదు. ఇన్నేళ్లూ అభివృద్ధి పేరుతో, లాభార్జనే ధ్యేయంగా ధనిక దేశాలు విచ్చలవిడిగా వినియోగించిన శిలాజ ఇంధనాల కారణంగా వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరిగి భూగోళం వేడెక్కింది.

ఇందువల్ల దక్షిణార్ధ గోళంలో ఉన్న పేద దేశాలకే అధిక నష్టం సంభవిస్తోంది. వచ్చే నవంబర్‌ నెలాఖరులో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యాన దుబాయ్‌లో కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (సీఓపీ) సదస్సు జరగబోతోంది. పర్యావరణ సమస్యలన్నీ అక్కడే చర్చించవచ్చునని ధనిక దేశాలు తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు. దీన్ని సాగనీయకూడదు. 2021లో రోమ్‌లో జీ–20 శిఖరాగ్ర సదస్సు జరిగినప్పుడు ‘అర్థవంతమైన చర్యల ద్వారా భూగోళానికి ముప్పు కలగకుండా చూస్తామనీ, విదేశాల్లోని బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కర్మాగారాలకు ఆర్థిక సాయం అందకుండా చూస్తామ’నీ ధనిక దేశాలు హామీ ఇచ్చాయి.

ఈ వాగ్దానంలో ధనిక దేశాల్లోని కర్మాగారాల ఊసు లేదు. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి రికార్డు స్థాయికి చేరింది. వర్తమాన సంవత్సరంలో ఈ రంగంలో పెట్టు బడులు ఎన్నడూ లేనంతగా 15,000 కోట్ల డాలర్లకు చేరుకున్నాయని అంచనా. అంటే రోమ్‌లో చేసిన బాసలకు విలువే లేదన్న మాట. దీనిపై ప్రస్తుత సదస్సులో నిలదీయాలి. జీ–20 సభ్యత్వంలోనూ ఎన్నో తిరకాసులున్నాయి. నూతన ఆర్థిక శక్తిగా ఎదగటం మాట అటుంచి, కనీసం 20 ఉన్నత స్థాయి ఆర్థిక వ్యవస్థల్లో కూడా ఒకటిగా లేని అర్జెంటీనాకు సంస్థలో సభ్యత్వం ఉంది.

పోర్చుగల్, ఈజిప్టు వంటి దేశాలకు చోటులేదు. ఒక సంస్థగా చెప్పుకోదగిన విజయాలు ఎందుకు సాధించలేదో, అందుకు అడ్డుపడుతున్నవేమిటో జీ–20 ఆత్మవిమర్శ చేసుకోవాలి. భవిష్యత్తరాలకు సురక్షితమైన భూగోళాన్ని అప్పగించాలంటే సంపన్న దేశాలుగా తాము చేయాల్సిందేమిటో అమెరికా, రష్యా, చైనా తదితర దేశాలు ఆలోచించాలి. అంతర్జాతీయ సంబంధాలు ఛిద్రమైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తలకిందులయ్యే ప్రమాదం ఉంటుందని గుర్తెరిగి ధనిక దేశాలు బాధ్యతగా మెలగాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement